
దేశ వ్యాప్తంగా కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం నిర్వహించనున్న భారత్‌బంద్‌కు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ సన్నద్ధమయ్యాయి. హైదరాబాద్‌లో ప్రజాందోళనకు అన్నిపక్షాలు రంగంలోకి దిగడంతో ప్రజారవాణా వ్యవస్థపై ప్రభావం పడనుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూత పడనున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు బస్సుల బంద్‌కు పిలుపునివ్వనప్పటికీ ఆందోళనకారులు ఆర్టీసీ, సిటీ బస్సులను డిపోల నుంచి బయటికి రాకుండా అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే, బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. మరోవైపు భారత్ బంద్‌కు తెలంగాణ లారీ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. బంద్ పాటిస్తామని ఆటో యూనియన్ వెల్లడించింది.
ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు యథావిధిగానే నడు స్తాయని మెట్రో రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ట్రిప్పుల సంఖ్య పెంచు తామని రైల్వే వర్గాలు తెలిపాయి. భారత్‌బంద్ సందర్భంగా విద్యాసంస్థలకు ఎలాంటి సెలవు ప్రకటించలేదు. దీంతో అవి యథావిధిగా నడిచే అవకాశాలున్నాయి. కాగా, పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా బంద్ పాటించి విజయవంతం చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.