సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ బిల్లు 2018కు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఈ బంద్‌లో బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు, రేపు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కార్మిక సంఘాల అధికారాలకు తెరపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను, ఉద్యోగులను అణిచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోందన్నారు.
తమ 12 డిమాండ్లను కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. రెండు రోజుల భారత్ బంద్‌కు 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించగా, ఆలిండియా కిసాన్ మహాసభ కూడా దీనిని స్వాగతించింది. సాధారణ ప్రజలతో పాటు ఈ ఆందోళనల్లో రైతులు కూడా పాలు పంచుకోనున్నారు. పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
పబ్లిక్ సెక్టార్, చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నౌకాశ్రయాలలో పని చేసేవారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. సమ్మెలో భాగంగా రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు.
ఇందిరాపార్కులో మహా ధర్నా
కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై భారత్ బంద్‌లో భాగంగా ఇందిరాపార్కులో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా నేడు, రేపు జరగబోయే ఈ సార్వత్రిక సమ్మెలో 12 డిమాండ్లను కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రస్తావించనున్నారు. కాంట్రాక్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల సవరణ ఆపాలి తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment