central trade unions
-
అత్యవసర సేవలపై సమ్మె ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్‌పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు. బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. -
కొనసాగుతున్న భారత్ బంద్..ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సెంట్రల్ ట్రేడ్ యూనియన్ బిల్లు 2018కు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8, 9న భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ బంద్‌లో బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ రోజు, రేపు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 సవరణ ద్వారా ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని సీఐటీయు జాతీయ కార్యదర్శి తపన్ సేన్ గుప్తా ఆరోపించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే కార్మిక సంఘాల అధికారాలకు తెరపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను, ఉద్యోగులను అణిచివేసేందుకు ప్రయత్నం ప్రయత్నిస్తోందన్నారు. తమ 12 డిమాండ్లను కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచాయి. రెండు రోజుల భారత్ బంద్‌కు 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించగా, ఆలిండియా కిసాన్ మహాసభ కూడా దీనిని స్వాగతించింది. సాధారణ ప్రజలతో పాటు ఈ ఆందోళనల్లో రైతులు కూడా పాలు పంచుకోనున్నారు. పూర్తి రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పబ్లిక్ సెక్టార్, చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నౌకాశ్రయాలలో పని చేసేవారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు కూడా ఈ భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. సమ్మెలో భాగంగా రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపడుతున్నారు. ఇందిరాపార్కులో మహా ధర్నా కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై భారత్ బంద్‌లో భాగంగా ఇందిరాపార్కులో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా నేడు, రేపు జరగబోయే ఈ సార్వత్రిక సమ్మెలో 12 డిమాండ్లను కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రస్తావించనున్నారు. కాంట్రాక్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం, కార్మిక చట్టాల సవరణ ఆపాలి తదితర డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. -
సమ్మెకు సైరన్
జాతీయ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. నాలుగ సంఘాలు ఏకమై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఆందోళనబాట పట్టాయి. గుర్తింపు సంఘం ఎన్నికల ముందు, తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుకు పోరుసల్పాలని పిలుపునిచ్చాయి. ఐదు రోజుల క్రితం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్ సీఎండీ ఎన్ శ్రీధర్‌కు సమ్మె నోటీసు అందించాయి. మరో రెండు రోజుల్లో ఆర్ఎల్సీకి కూడా నోటీస్ ఇవ్వనున్నాయి. శ్రీరాంపూర్(మంచిర్యాల జిల్లా) : కార్మికుల ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 14న ఒక రోజు టోకెన్ సమ్మెకు జాతీయ సంఘాలు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 5న జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు రెండోసారి టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఎన్నికల ముందు సెప్టెంబర్ 29న, ఎన్నికలు తరువాత అక్టోబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ సాక్షిగా కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికలు ముగిసి ఇప్పటి 3 నెలలవుతున్నా అమలు చేయడంలేదు. దీంతో కార్మిక నేతలకు ఆందోళనకు దిగుతున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్ సమ్మెకు పిలుపునివ్వగా మరో జాతీయ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ సమ్మెకు దూరంగా ఉంది. 25 నుంచి కంపెనీ వ్యాప్తంగా రిలే దీక్షలు.. సమ్మె విజయవంతానికి జాతీయ సంఘాలు ఈ నెల 25 నుంచి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంల కార్యాలయాల ముందు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. అన్ని ఏరియాలకు తిరుగుతూ ప్రెస్మీట్లు పెడుతూ, సమావేశాలు నిర్వహిస్తూ సమ్మెకు కేడర్‌ను సిద్ధం చేస్తున్నారు. మౌన ముద్రలో టీబీజీకేఎస్ నేతలు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినా టీబీజీకేఎస్‌లో ఇంకా అనిశ్చితి వీడలేదు. కమిటీలు లేక, గుర్తింపు పత్రం తీసుకోక, అధికారంలో ఉన్నామా లేమా అన్న చందంగా నేతలు మౌన ముద్రలో ఉండిపోయారు. కమిటీల ప్రకటన చేసే వరకు ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని, కార్యక్రమాలు చేపట్టొద్దని అధిష్ఠానవర్గం నుంచి ఆదేశాలు ఉండటంతో యూనియన్ ముఖ్య నాయకులు కిమ్మనకుండా చూçస్తూ ఉన్నారు. కమిటీల్లో జాప్యం వల్ల నేతలు అసహనం పెరగడమే కాకుండా, ప్రతిపక్ష సంఘాలు చేసే ఆందోళన కార్యక్రమాలను ప్రతిఘటించడానికి అధిష్ఠానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప స్పందించే పరిస్థితి లేదు. ప్రధానంగా కారుణ్య నియామకాలు జాప్యం జరుగడంతో టీబీజీకేఎస్ నేతలే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గెలిచినా కార్మికులవద్దకు వెళ్లలేని పరిస్థితి ఉం దని కొందరు నేతలు వాపోతున్నారు. ఎన్నికలు జరిగిన 3 నెలలకే సమ్మె చేయడం.. రాజకీయ లబ్ధికోసమేనని టీబీజీకేఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే క్వార్టర్లకు ఏసీలు, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, ఇంకా ఇతర డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఉత్తర్వులు ఇచ్చిన కూడా సమ్మెకు పిలుపునివ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. టోకెన్ సమ్మె డిమాండ్లు కారుణ్య నియామకాల పేరుతో ఇస్తామన్నా వారసత్వ ఉద్యోగాలకు వెంటనే ఇవ్వాలి కార్మికులకు సొంతింటికి స్థలం, వసతులతో పాటు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి మారుపేర్లతో పని చేసే వారిని రెగ్యులరైజ్ చేయాలి క్వార్టర్లకు ఏసీ పెట్టుకునేందుకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం అందిస్తూ యాజమాన్యం ఇచ్చిన ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయి. వీటిని మార్చాలి 10 వేజ్‌బోర్డు బ్యాలెన్స్ ఎరియర్స్, ఇందులో సింగరేణిలో అమలు కాని ఒప్పందాలను అమ లు చేయాలి ఎల్టీసీ, ఎల్ఎల్టీసీలకు లీవులు పెట్టుకోకుండానే డబ్బులు చెల్లించాలి కొత్తగా 6 భూగర్భ గనులు తవ్వాలి వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఇంకా ఇతర డిమాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. -
ఒక్కరోజు నష్టం రూ. 18వేల కోట్లు
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్ కారణంగా 16 వేల నుంచి 18 వేలకోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడినట్టు అసోచాం అంచనా వేసింది. ఈ రోజు బంద్ కారణంగా బ్యాంకింగ్, ప్రజారవాణా, టెలికాం తదితర సేవలకు అంతరాయం ఏర్పడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడినట్టు అసోచాం ప్రతినిధులు వెల్లడించారు. దేశ జీడీపీలో వాణిజ్య, రవాణా, హోటల్స్ ప్రధాన రంగాలని, అలాగే బ్యాంకింగ్ సహా ఆర్థిక రంగ సర్వీసులు కీలకమైనవని, బంద్ కారణంగా నష్టం ఏర్పడినట్టు తెలిపారు. నెలకు కనీస వేతనం రూ. 18 వేలు చేయాలని, నెలకు రూ. 3 వేల కనీస పెన్షన్ వంటి 12 డిమాండ్లతో 10 కేంద్ర కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ కారణంగా సాధారణ జనజీవనంపై ప్రభావం చూపించింది. ప్రజా రవాణా ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. హరియాణా, జార్ఖండ్, బెంగాల్లో వందలాది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. -
డిసెంబర్ 12న పార్లమెంటు ముట్టడి: తపన్‌సేన్
సాక్షి, హైదరాబాద్: దేశ జనాభాలో మూడొంతులున్న కార్మికుల సమస్యలపై దాగుడు మూతలాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు కేంద్ర కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. డిసెంబర్ 12న కనీసం పది లక్షల మందితో పార్లమెంటును ముట్టడించనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే సీఐటీయూ అఖిల భారత స్థాయి క్రియాశీల కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరిలో పారిశ్రామిక సమ్మె తర్వాత కార్మికుల డిమాండ్లపై మంత్రుల బృందం చర్చించి హామీ ఇచ్చినా ఇంతవరకు అడుగుముందుకు పడలేదన్నారు. కార్మిక వర్గం యావత్తూ తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి పోరుబాట పట్టాయని చెప్పారు. మోడీ, రాహుల్ ఇద్దరూ ప్రధాని పదవికి పోటీ పడుతున్నారేగానీ కార్మిక సమస్యలపై నోరు మెదపడం లేదన్నారు. వీళ్లిద్దరూ కార్పొరేట్ సంస్థల ఏజెంట్లేనని, వచ్చే ఎన్నికల్లో వీరికి గుణపాఠం తప్పదన్నారు. కార్మికుల కడుపుకొట్టి పారిశ్రామిక వేత్తల కడుపు నింపుతారా? అని మండిపడ్డారు. బొగ్గుగని కార్మికులు డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఆందోళనకు దిగనున్నారని తెలిపారు. -
ప్రభుత్వాలను సాగనంపుదాం
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సమస్యలపై కనీస స్పందన లేని ఈ ప్రభుత్వాల్ని సాగనంపేందుకు సిద్ధం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడ్డాయి. పది డిమాండ్ల పరిష్కారానికి దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా హైదరాబాద్‌లో వేలాది మంది కార్మికులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐయూటీయూసీ, టీఆర్ఎస్కేవీ, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎర్రజెండాలు, డప్పునృత్యాలు, కళాకారుల పాటలతో సాగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సభలో కార్మిక నేతలు జి.ఓబులేసు, సుధాభాస్కర్, నాయిని నరసింహారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, రాంబాబు, సుధీర్, మారుతీరావ్ తదితరులు ప్రసంగించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను సాగనంపి కార్మిక పక్షపాతుల్ని ఎన్నుకున్నప్పుడే తమ సమస్యలకు పరిష్కారమని వక్తలు చెప్పారు. దేశంలో తొలిసారి 48 గంటల పాటు పారిశ్రామిక సమ్మె జరిగినా కేంద్రం స్పందించలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రయితే అసలు ఇంట్లో నుంచే రావడం లేదని, కార్మిక శాఖ మంత్రినంటున్న దానం నాగేందర్ లండన్‌లో షికారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన, సమైక్యత పేరుతో కార్మిక సంఘాలు చీలిపోయి రాజకీయ అంశాలను నెత్తినపెట్టుకున్నాయని, అసలు, సిసలైన సంఘాలైతే కార్మికుల సంక్షేమంపై పోరాడాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మూగ, చెవిటి ప్రభుత్వాల దుమ్ము దులిపేందుకు డిసెంబర్ 12న చలో పార్లమెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కనీస వేతనం రూ. 12,500కు పెంచాలని, రూ. 3 వేల పింఛన్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ నిబంధనలను సడలించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.