డిసెంబర్ 12న పార్లమెంటు ముట్టడి: తపన్‌సేన్
సాక్షి, హైదరాబాద్: దేశ జనాభాలో మూడొంతులున్న కార్మికుల సమస్యలపై దాగుడు మూతలాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు కేంద్ర కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. డిసెంబర్ 12న కనీసం పది లక్షల మందితో పార్లమెంటును ముట్టడించనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే సీఐటీయూ అఖిల భారత స్థాయి క్రియాశీల కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరిలో పారిశ్రామిక సమ్మె తర్వాత కార్మికుల డిమాండ్లపై మంత్రుల బృందం చర్చించి హామీ ఇచ్చినా ఇంతవరకు అడుగుముందుకు పడలేదన్నారు. కార్మిక వర్గం యావత్తూ తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి పోరుబాట పట్టాయని చెప్పారు. మోడీ, రాహుల్ ఇద్దరూ ప్రధాని పదవికి పోటీ పడుతున్నారేగానీ కార్మిక సమస్యలపై నోరు మెదపడం లేదన్నారు. వీళ్లిద్దరూ కార్పొరేట్ సంస్థల ఏజెంట్లేనని, వచ్చే ఎన్నికల్లో వీరికి గుణపాఠం తప్పదన్నారు. కార్మికుల కడుపుకొట్టి పారిశ్రామిక వేత్తల కడుపు నింపుతారా? అని మండిపడ్డారు. బొగ్గుగని కార్మికులు డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఆందోళనకు దిగనున్నారని తెలిపారు.