Tapan Sen
-
‘లేబర్ కోడ్’లు రద్దు చేసేవరకు పోరాడుతాం
సిద్దిపేటఅర్బన్: కార్మికుల హక్కులను హరిస్తూ...వారికి ఉరితాళ్లుగా మారిన లేబర్ కోడ్లను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపస్‌సేన్ స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల ముగింపు సమావేశం శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేరళ కార్మిక మంత్రి శివన్ కుట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా తపస్‌సేన్ మాట్లాడుతూ..కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ సామాన్యులను, కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని పెట్టుబడిదారులకు దోచిపెడు తూ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు (సీఆర్) మాట్లాడుతూ...29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా వర్గీకరించి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చిందన్నారు. మళ్లీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుగా సీఆర్ సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.వీరయ్య, భూపాల్, ఎస్.రమ, పి.జయలక్ష్మి, కె, వెంకటేశ్వర రావు, జె.మల్లికార్జున్, వీఎస్.రావు, వీరారెడ్డి, ఈశ్వర్ రావు, రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కార్యదర్శులుగా వెంకటేశ్, పద్మశ్రీ, ముత్యంరావు, చంద్రశేఖర్, మధు, మల్లేశ్, రమేశ్, శ్రీకాంత్, రమేశ్, కూరపాటి రమేశ్, గోపాల స్వామి, కోశాధికారిగా రాములు ఎన్నికయ్యారు. -
పౌరసత్వ బిల్లుతో అనిశ్చితి: తపన్‌సేన్
మల్లాపూర్: దేశ విభజన దిశగా బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును తీసుకువచ్చిందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఆరోపించారు. ఈ బిల్లు వల్ల దేశంలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు ఆదివారం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తపన్‌సేన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సమాజాన్ని, దేశాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సహా పలు విషయాల్లో ఒంటెత్తు పోకడలకు పోయి దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు, చుక్కా రాములు తదితరులు పాల్గొన్నారు. -
మోదీతో క్లోజింగ్ ఇండియా: తపన్‌సేన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం మేకిన్ ఇండియాకు బదులు క్లోజింగ్ ఇండియాగా మారనుందని సీఐటీయూ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రచారహోరు, ఆకర్షణీయ నినాదాలు తప్ప దేశంలో పారిశ్రామికరంగాన్ని, ఉత్పత్తిరంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు లేవన్నారు. ఉన్న పరిశ్రమలే మూతపడే విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. గురువారం నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన సీఐటీయూ జాతీయకార్యదర్శి వరలక్ష్మి, రాష్ట్రనాయకులు రమ, సాయిబాబాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని హెచ్ఎంటీ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి మూసేసేందుకు, విశాఖ పోర్టుతో సహా కోల్‌కతా, ముంబయి పోర్టులను ప్రై వేటీకరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పారు. -
డిసెంబర్ 12న పార్లమెంటు ముట్టడి: తపన్‌సేన్
సాక్షి, హైదరాబాద్: దేశ జనాభాలో మూడొంతులున్న కార్మికుల సమస్యలపై దాగుడు మూతలాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు కేంద్ర కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. డిసెంబర్ 12న కనీసం పది లక్షల మందితో పార్లమెంటును ముట్టడించనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే సీఐటీయూ అఖిల భారత స్థాయి క్రియాశీల కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరిలో పారిశ్రామిక సమ్మె తర్వాత కార్మికుల డిమాండ్లపై మంత్రుల బృందం చర్చించి హామీ ఇచ్చినా ఇంతవరకు అడుగుముందుకు పడలేదన్నారు. కార్మిక వర్గం యావత్తూ తమ రాజకీయ విభేదాలను పక్కనబెట్టి పోరుబాట పట్టాయని చెప్పారు. మోడీ, రాహుల్ ఇద్దరూ ప్రధాని పదవికి పోటీ పడుతున్నారేగానీ కార్మిక సమస్యలపై నోరు మెదపడం లేదన్నారు. వీళ్లిద్దరూ కార్పొరేట్ సంస్థల ఏజెంట్లేనని, వచ్చే ఎన్నికల్లో వీరికి గుణపాఠం తప్పదన్నారు. కార్మికుల కడుపుకొట్టి పారిశ్రామిక వేత్తల కడుపు నింపుతారా? అని మండిపడ్డారు. బొగ్గుగని కార్మికులు డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో ఆందోళనకు దిగనున్నారని తెలిపారు.