ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం మేకిన్ ఇండియాకు బదులు క్లోజింగ్ ఇండియాగా మారనుందని సీఐటీయూ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ తపన్‌సేన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రచారహోరు, ఆకర్షణీయ నినాదాలు తప్ప దేశంలో పారిశ్రామికరంగాన్ని, ఉత్పత్తిరంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు లేవన్నారు.
ఉన్న పరిశ్రమలే మూతపడే విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. గురువారం నగరానికి వచ్చిన సందర్భంగా ఆయన సీఐటీయూ జాతీయకార్యదర్శి వరలక్ష్మి, రాష్ట్రనాయకులు రమ, సాయిబాబాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇచ్చి మూసేసేందుకు, విశాఖ పోర్టుతో సహా కోల్‌కతా, ముంబయి పోర్టులను ప్రై వేటీకరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పారు.