న్యూఢిల్లీ: కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెతో అత్యవసర సేవలకు అంతరాయం కలిగేలా కన్పిస్తోంది. రవాణా, బ్యాంకింగ్, రైల్వేలు, విద్యుత్‌పై ప్రభావం పడనుంది. సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 20 కోట్లకు పైగా కార్మికులు పాల్గొంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. వ్యవసాయ, తదితర రంగాల కార్మికులూ పాల్గొంటారన్నారు.
బొగ్గు, ఉక్కు, చమురు, టెలికాం, ఆదాయ పన్ను, బ్యాంకులు, బీమా రంగాల కార్మిక సంఘాలు సమ్మె నోటీసులివ్వగా రైల్వే, రక్షణ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటీకరణ చర్యలను, కార్మిక చట్టాల మార్పులను వెనక్కి తీసుకోవాలన్నది వీటి డిమాండ్. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరుతున్నాయి. సమ్మె నేపథ్యంలో జాతీయ గ్రిడ్‌లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర విద్యుత్ శాఖ సూచించింది. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment