ప్రభుత్వాలను సాగనంపుదాం
సాక్షి, హైదరాబాద్: కార్మికుల సమస్యలపై కనీస స్పందన లేని ఈ ప్రభుత్వాల్ని సాగనంపేందుకు సిద్ధం కావాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మండిపడ్డాయి. పది డిమాండ్ల పరిష్కారానికి దేశవ్యాప్తంగా తలపెట్టిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా హైదరాబాద్‌లో వేలాది మంది కార్మికులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ, బీఎంఎస్, ఏఐయూటీయూసీ, టీఆర్‌ఎస్‌కేవీ, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎర్రజెండాలు, డప్పునృత్యాలు, కళాకారుల పాటలతో సాగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
అనంతరం జరిగిన సభలో కార్మిక నేతలు జి.ఓబులేసు, సుధాభాస్కర్, నాయిని నరసింహారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, రాంబాబు, సుధీర్, మారుతీరావ్ తదితరులు ప్రసంగించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలను సాగనంపి కార్మిక పక్షపాతుల్ని ఎన్నుకున్నప్పుడే తమ సమస్యలకు పరిష్కారమని వక్తలు చెప్పారు. దేశంలో తొలిసారి 48 గంటల పాటు పారిశ్రామిక సమ్మె జరిగినా కేంద్రం స్పందించలేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రయితే అసలు ఇంట్లో నుంచే రావడం లేదని, కార్మిక శాఖ మంత్రినంటున్న దానం నాగేందర్ లండన్‌లో షికారు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన, సమైక్యత పేరుతో కార్మిక సంఘాలు చీలిపోయి రాజకీయ అంశాలను నెత్తినపెట్టుకున్నాయని, అసలు, సిసలైన సంఘాలైతే కార్మికుల సంక్షేమంపై పోరాడాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మూగ, చెవిటి ప్రభుత్వాల దుమ్ము దులిపేందుకు డిసెంబర్ 12న చలో పార్లమెంట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కనీస వేతనం రూ. 12,500కు పెంచాలని, రూ. 3 వేల పింఛన్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ నిబంధనలను సడలించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.