భారత్‌ బంద్‌కి తొలి పిలుపెవరిది? | Who Called First to Bharat Bandh? | Sakshi
Sakshi News home page

భారత్‌ బంద్‌కి తొలి పిలుపెవరిది?

Published Tue, Apr 3 2018 10:15 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Who Called First to Bharat Bandh? - Sakshi

‘కంట్రీ విల్‌ గవర్న్‌డ్‌ బై కానిస్టిట్యూషన్, నాట్‌ ఫాసిజం’ నినాదానికి పునాది ఎవరు?

ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌ నిర్భయ ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీ పురవీధుల్లో యువతరం కదం తొక్కేలా చేసింది. ఒకే ఒక్క వాట్సాప్‌ మెసేజ్‌ ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ మరణాన్ని ధిక్కరించేలా చేసింది. ఇప్పుడు ‘కంట్రీ విల్‌ గవర్న్‌డ్‌బై కానిస్టిట్యూషన్, నాట్‌ ఫాసిజం’ అనే నినాదం స్ఫూర్తితో భారత్‌ బంద్‌ పిలుపు దేశాన్ని అట్టుడికేలా చేసింది. ఈ అనూహ్యమైన ఉద్యమం ఆరంభానికి దారితీసిన సామాజిక, రాజకీయ పరిస్థితులు ఒక ఎల్తైతే, భారత్‌ బంద్‌ పిలుపుతో ఉద్యమాన్ని రాజుకునేలా చేసిన చిన్న నిప్పు కణికలాంటి వాట్సాప్‌ మెసేజ్‌ ఒక ఎత్తు. నిజానికి ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఎవరు? 

సౌరాన్‌పూర్‌ పునాదిగా ఏర్పడిన భీమ్‌ ఆర్మీనా, జాతీయ దళిత సంఘాల సమాఖ్య (నాక్‌డర్‌) కారణమా లేదంటే ఇంకెవరైనా యువకులు ఈ ఉద్యమాన్ని వెనకుండి నడిపించారా? అసలు మొదట భారత్‌ బంద్‌ పిలుపుని వాట్సాప్‌లో పంపిందెవరు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీల వేధింపు నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పుని నిరసిస్తూ దేశవ్యాప్తంగా, ప్రధానంగా ఉత్తరాదిన ఎగిసిన దళిత ఉద్యమం సోమవారం హింసాత్మకంగా మారి, పరిస్థితి తీవ్రతను కొనసాగిస్తోంది. అనేక పోరాటాల అనంతరం సాధించుకున్న ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్‌సి, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ని నీరుగార్చడం తగదంటూ వెల్లువెత్తిన ప్రజాపోరాటానికి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కలిపి 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు యావత్‌ దేశాన్ని కుదిపివేస్తోంది. 

అయితే ఉత్తరభారతమంతటినీ అట్టుడికేలా చేసిన ఈ ఉద్యమం అసలు రాజుకున్నదెక్కడ అనేదే ఇప్పుడు హాట్‌ టిపిక్‌గా మారింది. ఒకే సారి అన్ని చోట్లా ఈ ఉద్యమం ఎగిసిపడడానికి పునాది ఎవరు? సోమవారం జరిగిన భారత్‌బంద్‌ను ఇంత మిలిటెంట్‌గా నడిపిందెవరు? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఉద్యమం ఆరంభాన్ని అంచనా వేసేందుకు చేసిన ప్రయత్నంలో అనేక విషయాలు వెలుగుచూసాయి.

అశోక్‌ భారతి నేతృత్వంలోని జాతీయ దళిత సంఘాల సమాఖ్య ( నాక్‌డర్‌)  మొదట భారత్‌ బంద్‌ పిలుపునిచ్చిందా? లేక సోషల్‌ మీడియానే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిందా? అనే విషయం అక్కడి భద్రతా దళాలను సైతం గందరగోళంలో ముంచేసింది. సోమవారం సాయంత్రం వరకు ఎవరిదో తెలియని ఫోన్‌ నంబర్‌ నుంచి వచ్చిన ఈ వాట్సాప్‌ మెసేజే ఈ ఉద్యమానికి ఊపరిలూదిందని భావించారు. అయితే నిజానికి ఈ విషయాన్ని అంచనా వేయడంలో స్థానిక ఇంటెలిజన్స్‌ సహా ప్రభుత్వ యంత్రాంగమంతా  పూర్తిగా విఫలమైనట్టు నేషనల్‌ మీడియా అభిప్రాయపడింది. 

మొట్ట మొదట అశోక్‌ భారతి నాయకత్వంలోని జాతీయ దళిత సంఘాల సమాఖ్య (నాక్‌డర్‌) భారత్‌ బంద్‌కి పిలుపునిచ్చినట్టు భావించారు. క్రమేణా అన్ని దళిత సంఘాలు, ఉద్యమకారులు వ్యక్తులు, సంస్థలు ఒక్కొక్కటీ ఇందులో చేరాయని అంచనా వేస్తున్నారు. అయితే భీం ఆర్మీతో సహా అనేక సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ భీం ఆర్మీ ప్రధాన సలహాదారు జై భగవాన్‌ జాటవ్‌ ఈ ఉద్యమాన్ని ‘లీడర్‌లెస్‌ ఉద్యమంగా’ పేర్కొనడం గమనార్హం. తీర్పు వెలువడిన తరువాత మంగళవారం భీం ఆర్మీ ఏర్పాటు చేసిన సమావేశానికి మొత్తం 25 దళిత సంఘాలు హాజరై భవిష్యత్‌ ఉద్యమంపై చర్చించినట్టు ఆయన తెలిపారు. 

అయితే సోమవారం ఉవ్వెత్తున ఎగిసిపడిన ఈ ఉద్యమం మాత్రం దానంతటదే స్వచ్ఛందంగా రాజుకున్నదేననీ, దానికి ప్రత్యేకించి నాయకులెవ్వరూ లేరనీ మీడియాతో ప్రస్తావించారు. ఇది కేవలం వాట్సాప్‌ మెసేజ్‌లు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంగా అంటుకుని దావానలంలా వ్యాపించిందని జాటవ్‌ స్పష్టం చేశారు. కేవలం ఏ ఒక్క దళిత సంఘమో దీని వెనుక లేదని జాటవ్‌ తేల్చి చెప్పారు.                  

ఉద్యమం ముందుభాగాన ఉన్న జాతీయ దళిత సంఘాల సమాఖ్య నాయకురాలు సుమేధ మీడియాతో మాట్లాడుతూ మార్చి 20న తీర్పు వెలువడిన అనంతరం తమ నాయకుడు అశోక్‌ భారతి మార్చి 21–22 తేదీల్లో ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పటికీ, చివరకు ఏప్రిల్‌ 2న దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహించాలని దేశంలోని అన్ని దళిత సంఘాలకు సమాచారమిచ్చినట్టు తెలిపారు. అయితే భీం ఆర్మీ ప్రధాన సలహాదారు జాటవ్‌ మాత్రం కొందరు ఈ ఉద్యమాన్ని తమదిగా చెప్పుకుంటున్నారనీ, నిజానికి ఏదో తెలియని నంబర్‌ నుంచి వచ్చిన ఈ వాట్సాప్‌ మెసేజ్‌ ను సంఘం యువకులు సోషల్‌ మీడియా ద్వారా విస్త్రుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టు తెలిపారు. 

అలాగే ఎవరో పంపిన ఈ వాట్సాప్‌ మెసేజ్‌లో ‘ భారత్‌ బంద్‌ని జయప్రదం చేయాలనీ, ఈ మెసేజ్‌ అందిన ప్రతి ఒక్కరూ పది మందికి చొప్పున ఫార్వర్డ్‌ చేయాలనీ, లేదంటే మీరూ, మీ భవిష్యత్‌ తరాలూ వేధింపులకు గురికాక తప్పదని’ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఉత్తరప్రదేశ్‌ భీం ఆర్మీ యువత విస్త్రుతంగా ప్రచారంలోనికి తెచ్చినట్టు  పేర్కొన్నారు. తమ డిమాండ్‌ని ప్రభుత్వం అంగీకరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని జాటవ్‌ స్పష్టం చేశారు. 

అయితే ఈ ఉద్యమం ఊపందుకున్న రాష్ట్రాలు దళితులపై వేధింపుల్లో అగ్రభాగాన ఉన్నాయనీ, ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే కొనసాగుతున్న దళితుల వేధింపులు, దళిత స్త్రీలపై అత్యాచారాలు, గో రక్షక్‌ల దాడులు, అగ్రవర్ణాల దురాగతాలతో విసిగి వేసారి ఉన్న దళితులకు సుప్రీం తీర్పు అగ్నికి ఆజ్యం పోసిందని జాతీయ దళిత సంఘాల సమాఖ్య  నాయకుడు అశోక్‌ భారతి వ్యాఖ్యానించారు. అయితే నిజానికి కొంత మేరకు దళిత సంఘాలు ఈ ఉద్యమానికి సన్నాహాలు చేసిన మాటనిజమే అయినప్పటికీ సోషల్‌ మీడియాది సైతం ఇందులో కీలక పాత్రగా అందరూ అంగీకరిస్తున్న విషయం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement