నోట్ల రద్దుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- భారత్ బంద్‌కు తృణమూల్ కాంగ్రెస్ దూరం
- పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్‌కతా : పెద్ద నోట్ల రద్దును ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకునే వరకు ప్రజలకు అండగా ఉండి పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. శనివారం కోల్‌కతాలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ముఖ్యనేతలతో మమతా సమావేశమయ్యారు. నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాలను నియంత్రించడంలో మోదీ విఫలమయ్యారన్నారు.
నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలుపుకొని ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న తలపెట్టిన భారత్ బంద్‌లో తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనబోదని ఆమె స్పష్టం చేశారు. బంద్ జరిపితే ప్రజలు మరింత ఇబ్బందులు పడతారని అందుకే బంద్‌కు దూరంగా ఉండాలని పార్టీ నేతలను ఆమె ఆదేశించారు. నోట్ల రద్దు అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న (మంగళవారం) కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.