ప్రధాని నరేంద్రమోదీ తన తీరు మార్చుకోలేదని, ఆయన తుగ్లక్ పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన విమర్శలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింత పదునెక్కించారు. 14వ శతాబ్దం నాటి ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్‌తో మోదీని ఆమె పోల్చారు. తాను కేంద్రంలో చాలా ప్రభుత్వాలు చూశానని, కానీ ఎప్పుడూ ఇలాంటి తుగ్లక్ ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. మోదీ వేర్వేరు సమయాల్లో వేర్వేరు మాటలు చెబుతుంటారని ఆమె చెప్పారు. తుగ్లక్ సర్కారు పాటిస్తున్న తుగ్లక్ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని బిర్‌భూమ్‌లో నిర్వహించిన వార్షిక 'జోయ్‌దేవ్ మేళా'లో మాట్లాడుతూ ఆమె అన్నారు.
మోదీ బాబు ప్లాస్టిక్ కరెన్సీ సేల్స్‌మన్ అయిపోయారని, ప్లాస్టిక్‌ను ఎవరు తింటారని ఎద్దేవా చేశారు. ప్రజల వద్ద డబ్బులు లేవని, ప్రజల డబ్బంతటినీ నల్లధనంగా ప్రకటించి, బీజేపీ డబ్బును మాత్రం తెల్లడబ్బు అంటున్నారని అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్లను అవినీతిపరులన్నారని, కేంద్ర సంస్థలను వాళ్ల మీదకు పంపారని మమత తెలిపారు. సీబీఐ అంటే 'కాన్‌స్పిరసీ బ్యూరో ఆఫ్ ఇండియా' అని ఆమె అభివర్ణించారు. గుజరాత్‌లో జరిగిన అల్లర్ల కారణంగా అమెరికా మోదీని గతంలో బ్లాక్‌లిస్ట్ చేసిందని, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన తీరు మార్చుకోకుండా.. కుట్రలు పన్నుతూనే ఉన్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలంతా బయటికొచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.