ప్రతిపక్షాలపై మోదీ సీబీఐ అస్త్రం!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు. అయితే ఇందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉదహరిస్తూ ట్వీట్ చేయడం కలకలం రేపింది. మోదీజీ.. ప్రతి ఒక్క ప్రతిపక్ష నేత రాహుల్ లాగ ఉండరని గుర్తుంచుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు.
సీబీఐని రంగంలోకి దించయినా సరే ఏదోలా భయపెట్టి ప్రతిపక్ష నేతలను బలవంతంగా నోట్లరద్దును స్వాగతించేలా చేయారని చూస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ తరహాలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొదటినుంచీ మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎందుకు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తుందని ట్విట్టర్ ద్వారా ఆమె ప్రశ్నించారు. తన పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలకు సీబీఐ అధికారుల నుంచి కాల్స్ వచ్చాయని, అయినా సరే పెద్దనోట్ల రద్దుపై తాము పోరాటం కొనసాగిస్తామని మమత తన ట్వీట్ లో స్పష్టంచేశారు.