మోదీ నిరక్షరాస్యుడు: అరవింద్ కేజ్రీవాల్
కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ఓ నిరక్షరాస్యుడని, ఎవరినీ సంప్రదించకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని, అసలు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధ్వజమెత్తారు. మోదీ తన డిగ్రీని ఎందుకు చూపించడం లేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గుజరాత్ హై కోర్టులో డిగ్రీకి సంబంధించి జరుగుతున్న విచారణ కోసం మోదీ తన బెస్ట్ లాయర్ తుషార్ మెహతాను పంపేది స్టే కోసమేనా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
నోట్ల రద్దు కుంభకోణంతో దేశ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు మోదీ విద్యార్హతలు తెలుసుకోవాలనుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. అసలు ప్రధానికి ఎకనామిక్స్ అర్థమౌతుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.