నోట్ల రద్దు వెనక భారీ స్కాం: కేజ్రీవాల్
నోట్ల రద్దు వెనక భారీ స్కాం: కేజ్రీవాల్
Published Sat, Nov 12 2016 11:14 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక భారీ స్కాం ఉందని, ప్రధాని తన సన్నిహితులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఆ తర్వాత నోట్లను రద్దుచేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపై పోరాటం పేరుతో భారీ స్కాంకు కొన్నిరోజుల క్రితం తెరతీశారని ఆయన అన్నారు. ఈ విషయంపై శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని సన్నిహితులంతా ముందుగానే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేసేసుకున్నాక అప్పుడు నోట్ల రద్దు ప్రకటన వచ్చిందని తీవ్రంగా ఆరోపించారు.
ఇప్పుడు జరిగేది కూడా అవినీతి అంతం కాదని.. పెద్ద మొత్తంలో డబ్బు కేవలం చేతులు మారుతుందని ఆయన అన్నారు. డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లు పన్నుతో పాటు 200 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అంటే, వాళ్ల వద్ద ఉన్న డబ్బులో 90 శాతం కోల్పోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో నల్లడబ్బు దాచుకున్నవాళ్లు ఎందుకు అలా చేస్తారని ప్రశ్నించారు. అందువల్ల ప్రభుత్వమే పరోక్షంగా డబ్బులు డిపాజిట్ చేయొద్దని చెబుతోందని ఆరోపించారు.
''దేశంలో నల్లడబ్బు దాచుకునేవాళ్లు ఎవరు.. అదానీలు, అంబానీలు, సుభాష్ చంద్రలు, బాదల్లు మాత్రమే. అంతేతప్ప రిక్షావాలాలు, చెప్పులు కుట్టుకునేవాళ్లు, కూలీలు, రైతులు ఎక్కడైనా నల్లడబ్బు దాస్తారా'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
అయితే.. కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు తక్షణం ఖండించారు. ఆయన కేవలం ప్రచారం కోసమే ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, కానీ అది చూసి భారతీయులంతా నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అధికారం కోసమే లేనిపోనివన్నీ కల్పిస్తోందని, ఒకవైపు వాళ్లు అవినీతిపై పోరాడుతున్నామంటూ.. మరోవైపు అవినీతిపై పోరాడే చర్యలను విమర్శిస్తున్నారని పార్టీ నేతలు అన్నారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలలో ఒక్కదాన్నైనా ఆయన నిరూపించగలరా అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రశ్నించారు.
Advertisement
Advertisement