heavy scam
-
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
నోట్ల రద్దు వెనక భారీ స్కాం: కేజ్రీవాల్
పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక భారీ స్కాం ఉందని, ప్రధాని తన సన్నిహితులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఆ తర్వాత నోట్లను రద్దుచేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపై పోరాటం పేరుతో భారీ స్కాంకు కొన్నిరోజుల క్రితం తెరతీశారని ఆయన అన్నారు. ఈ విషయంపై శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని సన్నిహితులంతా ముందుగానే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని డిపాజిట్ చేసేసుకున్నాక అప్పుడు నోట్ల రద్దు ప్రకటన వచ్చిందని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు జరిగేది కూడా అవినీతి అంతం కాదని.. పెద్ద మొత్తంలో డబ్బు కేవలం చేతులు మారుతుందని ఆయన అన్నారు. డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లు పన్నుతో పాటు 200 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, అంటే, వాళ్ల వద్ద ఉన్న డబ్బులో 90 శాతం కోల్పోవాల్సి వస్తుందని, అలాంటి సమయంలో నల్లడబ్బు దాచుకున్నవాళ్లు ఎందుకు అలా చేస్తారని ప్రశ్నించారు. అందువల్ల ప్రభుత్వమే పరోక్షంగా డబ్బులు డిపాజిట్ చేయొద్దని చెబుతోందని ఆరోపించారు. ''దేశంలో నల్లడబ్బు దాచుకునేవాళ్లు ఎవరు.. అదానీలు, అంబానీలు, సుభాష్ చంద్రలు, బాదల్లు మాత్రమే. అంతేతప్ప రిక్షావాలాలు, చెప్పులు కుట్టుకునేవాళ్లు, కూలీలు, రైతులు ఎక్కడైనా నల్లడబ్బు దాస్తారా'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే.. కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు తక్షణం ఖండించారు. ఆయన కేవలం ప్రచారం కోసమే ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని, కానీ అది చూసి భారతీయులంతా నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం అధికారం కోసమే లేనిపోనివన్నీ కల్పిస్తోందని, ఒకవైపు వాళ్లు అవినీతిపై పోరాడుతున్నామంటూ.. మరోవైపు అవినీతిపై పోరాడే చర్యలను విమర్శిస్తున్నారని పార్టీ నేతలు అన్నారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలలో ఒక్కదాన్నైనా ఆయన నిరూపించగలరా అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రశ్నించారు. -
నోట్ల రద్దు వెనక భారీ స్కాం: కేజ్రీవాల్