డెలాయిట్‌పై ఐదేళ్ల నిషేధం? | Deloitte threatened with five-year ban in India | Sakshi
Sakshi News home page

డెలాయిట్‌పై ఐదేళ్ల నిషేధం?

Published Tue, Apr 30 2019 5:13 AM | Last Updated on Tue, Apr 30 2019 9:02 AM

Deloitte threatened with five-year ban in India - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్‌ దిగ్గజం డెలాయిట్‌ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాల ఆడిటింగ్‌ ప్రక్రియ విషయంలో డెలాయిట్‌ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్‌ఎఫ్‌ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్‌ ప్రకారం డెలాయిట్‌పై నిషేధం విధించేందుకు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్‌) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది.

కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఐఎన్‌)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్‌ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్‌ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్‌ అంటోంది.

అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్‌కు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ పార్ట్‌నర్‌ అయిన ఎస్‌ఆర్‌బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్‌ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్‌నర్‌ అయిన బీఎస్‌ఆర్‌ ఆడిట్‌ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ ఆడిటింగ్‌ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్‌ వాదన. నైట్‌ఫ్రాంక్‌ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్‌ కూడా జరిగిందని అంటోంది.

నిషేధం ఎన్నాళ్లు...
సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్‌ అగ్రగామి ప్రైస్‌ వాటర్‌హౌస్‌(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్‌నర్‌ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్‌ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్‌పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్‌) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్‌ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్‌ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ మాజీ చీఫ్‌ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్‌ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్‌ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్‌ఎఫ్‌ఐఓ విచారించింది. డెలాయిట్‌పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement