SFIO
-
ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: దాదాపు రూ. 90,000 కోట్ల రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తీవ్ర నేరాల విచారణ సంస్థ (ఎస్ఎఫ్ఐవో) దర్యాప్తు వేగవంతం చేసింది. మోసాల్లో పాలుపంచుకున్న ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, లోపాలను గుర్తించడంలో జాప్యానికి గల కారణాల అన్వేషణకు రిజర్వ్ బ్యాంక్ అంతర్గతంగా విచారణ జరపాలని సూచించింది. ఉన్నతాధికారులు కుమ్మక్కై పాల్పడిన మోసం కారణంగా వాటిల్లిన నష్టాలను రాబట్టేందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఫిన్) కొత్త మేనేజ్మెంట్ తగు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎస్ఎఫ్ఐవో పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థ అయిన ఐఫిన్ వ్యవహారంపై విస్తృతంగా దర్యాప్తు చేసిన అనంతరం ఎస్ఎఫ్ఐవో తాజాగా తొలి చార్జి షీటు దాఖలు చేసింది. ఈ భారీ ఆర్థిక కుంభకోణం వెనుక 9 మంది కోటరీ ఉన్నట్లు అందులో పేర్కొంది. కంపెనీని ఇష్టారాజ్యంగా నడిపిస్తూ కొందరు స్వతంత్ర డైరెక్టర్లు, ఆడిటర్లు కుమ్మక్కై ఈ కుంభకోణానికి వ్యూహ రచన చేసినట్లు ఆరోపణలు చేసింది. హరి శంకరన్, రవి పార్థసారథి, అరుణ్ సాహా, రమేష్ బవా, విభవ్ కపూర్, కే రామ్‌చంద్ తదితరులు ఈ కోటరీలో ఉన్నట్లు పేర్కొంది. రుణాలు, నికరంగా చేతిలో ఉన్న నిధుల లెక్కింపులో ఐఫిన్ అవకతవకలకు పాల్పడుతోందంటూ 2015 నుంచి ఆర్బీఐ అనేక నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐవో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో జరిమానాల విధింపులో జాప్యానికి గల కారణాలను వెలికితీసేందుకు అంతర్గతంగా విచారణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి ఎస్ఎఫ్ఐవో తెలిపింది. -
జెట్ ఎయిర్వేస్పై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు?
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్ఎఫ్ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్వోసీ ముంబై విభాగం జెట్ ఎయిర్వేస్ ఖాతాల తనిఖీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేట్ శాఖకు నివేదిక కూడా సమర్పించింది. జెట్ ఎయిర్వేస్ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్ఎఫ్ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. అరవింద్ గుప్తా అనే ప్రజా వేగు ఇచ్చిన ఫిర్యాదులో... జెట్ ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆడిట్ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్ ఎయిర్వేస్, జెట్‌లైట్ బ్రాండ్లు ప్రమోటర్లకు చెందిన కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆర్వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్ గుప్తాయే కావడం గమనార్హం. వేలానికి జెట్ ఎయిర్వేస్ కార్యాలయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో వెల్లడించింది. 52,775 చ.అ. విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్ ఎయిర్వేస్ గోద్రెజ్ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి జెట్ ఎయిర్వేస్ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది. ఇప్పటికే జెట్ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న రుణదాతలు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. -
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం : మాజీ సీఎండీకి షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ( ఐఎల్ఎఫ్ఎస్) సంక్షోభం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఎల్ ఎఫ్ఎస్ మాజీ ఎండీ, సీఈవో రమేష్ బావాను తీవ్రమైన నేరాల దర్యాప్తు కార్యాలయం (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ఎస్ఎఫ్ఐఓ) అరెస్టు చేసింది. గ్రూప్ ఎంటిటీలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. భారీగా పన్ను ఎగవేత కేసులో ఆరోపణులు ఎదుర్కొంటున్న రమేష్ బావా తనను అరెస్టు చేయకుండా, క్రిమినల్ ప్రొసిడింగ్స్ ఆపివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది రోజుల అనంతరం ఈ అరెస్ట్ జరిగింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తు సంస్థ అయిన ఎస్ఎఫ్ఐఓ కంపెనీల చట్టం 447 సెక్షన్ ప్రకారం రమేష్ బావాను అదుపులో తీసుకుంది. కాగా రూ.94,215 కోట్ల రుణ ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు సంస్థల రుణ భారంమొత్తం రూ. 94వేల కోట్లు. ఈ కేసులో ఏప్రిల్ 1న సంస్థ మాజీ చైర్మన్ హరి శంకర్‌ను ఎస్ఎఫ్ఐఓ అరెస్టు చేసింది. -
ఎస్ఎఫ్ఐవో ఫస్ట్ యాక్షన్: భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ అరెస్ట్
న్యూఢిల్లీ: బ్యాంకులసీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్, వైస్ ఛైర్మన్ నీరాజ్ సింఘాల్‌ను ఢిల్లీలో గురువారం అరెస్ట్ చేసింది. దాదాపు 2వేల కోట్ల మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఆయన్నుఅరెస్ట్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. అనంతరం ఆయన్నుకోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఆగస్టు 14వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు చెప్పింది. దేశీయ బ్యాంకింగ్ రంగ మొండి బకాయిల్లో 25 శాతానికి పైగా చెల్లించాల్సి ఉన్న 12 కంపెనీల్లో భూషణ్ స్టీల్ లిమిటెడ్ కూడా ఒకటి . వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసిన కంపెనీలపై దివాలా కోడ్ ప్రయోగించాలని గతంలో బ్యాంకులను ఆర్బిఐ ఆదేశించింది. గత ఏడాది దివాలా చట్టం తీసుకొచ్చిన తరువాత ఎస్ఎఫ్ఐఓ అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి సింఘాల్. అప్పటి మేనేజ్మెంట్ ద్వారా సేకరించిన వేలాది కోట్ల రూపాయలను సంస్థ ప్రమోటర్లు మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందనీ, అలాగే డైరెక్టర్లు, ప్రమోటర్లు విచారణకు సహకరించడంలేదని ఆరోపించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా నీరజ్ సింఘాల్ అక్రమాలతో భూషణ్ స్టీల్ లిమిటెడ్కంపెనీ దివాలాకు కారకుడయ్యాడని , 80పైగా నకిలీ కంపెనీలతో పేరుతో నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే. -
ఐసిఐసీఐ - వీడియోకాన్ స్కామ్‌పై నీలినీడలు..?
సాక్షి, ముంబయి : వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ స్కామ్‌పై విచారణ జరిపించాలన్న తీవ్ర ఆర్థిక నేరాల విచారణ కార్యాలయం (ఎస్ఎఫ్ఐఓ) వినతిపై ప్రభుత్వం జాప్యం చేసిందని ఎస్ఎఫ్ఐఓ రాసిన లేఖలోని అంశాల ద్వారా వెలుగుచూసింది. ‘ ఈ ఉదంతంలో రూవేల కోట్ల ప్రజాధనం ముడిపడిఉన్నందున ఎస్ఎఫ్ఐఓ విచారణ చేపట్టడం మేల’ని ఫిబ్రవరి 27న ఎస్ఎఫ్ఐఓ ముంబయి బ్రాంచ్ న్యూఢిల్లీలోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ స్కామ్ వెలుగుచూసిన అనంతరం గత వారం సీబీఐ ప్రాధమిక దర్యాప్తునకు రంగంలోకి దిగినా ఎస్ఎఫ్ఐఓ వంటి ఇతర కీలక ఏజెన్సీలు ఇంకా అధికారిక గ్రీన్‌సిగ్నల్ కోసం వేచిచూస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కనీసం నెలకిందటే ఈ కేసులో ప్రాధమిక దర్యాప్తును పూర్తిచేసి ఉండవచ్చనేందుకు ఎస్ఎఫ్ఐఓ లేఖ విస్పష్ట సంకేతాలు పంపుతోంది. వివిధ బ్యాంకు అక్రమాల కేసులను నిశితంగా పరిశీలించే ప్రధాని కార్యాలయంలో కీలకమైన నిపుణుడు అరవింద్ గుప్తా 2016లోనే ఈ కుంభకోణాన్ని పీఎంఓ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఐసీఐసీఐ వీడియోకాన్ అనుబంధంలో వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్లు, ఐసిఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్, ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై గుప్తా ఆరోపణలనే ఎస్ఎఫ్ఐఓ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్నతస్ధాయిలో భారీ కుంభకోణం వెలుగుచూసినా ఇప్పటికీ ఎస్ఎఫ్ఐఓ వర్గాలు హెడ్ఆఫీస్ నుంచి ఆదేశాల కోసం ఇంకా వేచిచూస్తున్నామని చెబుతున్నాయి. కేసు పురోగతిపై ఎస్ఎఫ్ఐఓ ప్రధాన కార్యాలయం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను అందచేయాలని ఏడాది కిందటే తమ హెడ్ఆఫీస్ ఇంటెలిజెన్స్ యూనిట్ (హెచ్‌ఐయూ) కోరిందని ఈడీ పేర్కొంటోంది. ఇంత జరిగినా అధికారిక దర్యాప్తు ఇంకా ప్రాధమిక దశలోనే మగ్గుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. -
నీరవ్ కంపెనీలపై ఎస్ఎఫ్ఐఓ ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్బీ స్కాంలో సీబీఐ, ఈడీల దర్యాప్తు నేపథ్యంలో తాజాగా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నిధులు దారిమళ్లించేందుకు ఉపయోగించిన డొల్ల కంపెనీల గుట్టుమట్లను తేల్చేందుకు తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్ఎఫ్ఐఓ) రంగంలోకి దిగింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన 117 కంపెనీల రికార్డులు, పత్రాలను సమర్పించాలని ఎస్ఎఫ్ఐఓ కోరింది. ఈ 117 సంస్థల్లో అత్యధికం ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేపట్టని డొల్ల కంపెనీలేనని ఎస్ఎఫ్ఐఓ భావిస్తోంది. ఈ సంస్థలు, కంపెనీలు, ట్రస్టులను బ్యాంకుల ద్వారా సేకరించిన నిధులను దారి మళ్లించేందుకు నీరవ్ మోదీ, చోక్సీలు వాడుకున్నట్టు సమాచారం. ఆయా సంస్థల, కంపెనీల డైరెక్టర్లు, ఉద్యోగులతో సహా కంపెనీల రికార్డులు, పత్రాలన్నింటినీ సమర్పించాలని ఎస్ఎఫ్ఐఓ ఇప్పటికే ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, అదీశ్వర్ దియా-జ్యూవెల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు పంపింది. కాగా, అమెరికా, హాంకాంగ్, బెల్జియం, రష్యా, మకావు, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రిటన్ కేంద్రంగా పెద్దసంఖ్యలో షెల్ కంపెనీలను వీరు ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల సహకారంతో ఆయా దేశాల్లో నీరవ్, చోక్సీల పేరుతో ఉన్న నివాసాలు, కార్లు, బ్యాంకు ఖాతాలు ఇతర ఆస్తుల వివరాలను దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. నీరవ్, చోక్సీలు ఏళ్ల తరబడి ఎంత మొత్తం దారి మళ్లించారనే దానిపై ఈడీ ఇప్పటికే అమెరికా, బెల్జియం, దుబాయ్ సహా 13 దేశాలను సంప్రదించినట్టు సమాచారం. ఆయా దేశాల్లో వీరి కంపెనీల కార్యకలాపాలు, బ్యాంకు లావాదేవాలను ఈడీ ఆరా తీసింది. కొద్ది వారాల్లోనే ఈ కుంభకోణంపై నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, పీఎన్బీ అధికారులపై అభియోగపత్రాలను నమోదు చేస్తామని సీబీఐ, ఈడీ స్పష్టం చేశాయి. చార్జిషీట్ల ఆధారంగా విదేశాల్లో తలదాచుకున్న నిందితులను భారత్‌కు రప్పించే ప్రక్రియను చేపడతారు. -
ఎస్ఎఫ్ఐవో విచారణకు హాజరైన పీఎన్బీ చీఫ్
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎండీ, సీఈవో సునీల్ మెహతా బుధవారం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) ఎదుట విచారణకు హాజరయ్యారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పీఎన్బీ అధికారులతో చేతులు కలిపి రూ.12,626 కోట్ల భారీ మోసానికి పాల్పడిన కేసులో బ్యాంకు చీఫ్‌ను ఎస్ఎఫ్ఐవో అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఆయన చెప్పిన వివరాలను నమోదు చేశారు. ముంబైలోని ఎస్ఎఫ్ఐవో కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్న మెహతా సాయంత్రం 4 గంటల వరకు విచారణలో పాల్గొని తిరిగి వెళ్లారు. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు అధికారులు సైతం మంగళవారం విచారణకు హాజరుకావటం తెలిసిందే. అంతేకాదు ఈ రెండు బ్యాంకుల చీఫ్‌లతో పాటు మొత్తం 31 బ్యాంకుల అధికారులకు సమన్లు జారీ అయ్యాయి. పీఎన్బీ చీఫ్ మెహతాతోపాటు బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీ బ్రహ్మాజీరావును విచారణకు హాజరు కావాలని ఎస్ఎఫ్ఐవో గత నెలలోనే కోరింది. ఈ కేసులో వారిని నిందితులుగా పరిగణించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన విచారణలో ఈ స్కామ్‌ను ఎలా గుర్తించారు? విధానపరమైన ప్రక్రియలేంటి? అనే అంశాలతో పాటు విధానపరమైన ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడంపై అధికారులు దృష్టి సారించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. -
కింగ్‌ఫిషర్ మాల్యాపై ఎస్ఎఫ్ఐఓ ప్రాసిక్యూషన్ కేసు!
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులపై ప్రాసిక్యూషన్ కేసులు దాఖలు చేయడానికి ఎస్ఎఫ్ఐఓకి మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. కింగ్ ఫిషర్ ఏర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) ఒక సవివరమైన నివేదికను కార్పొరేట్ వ్యవహరాల శాఖకు సమర్పించింది. మాల్యా, కంపెనీ అధికారుల్లో కొందరు కంపెనీల చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించారని, కంపెనీల నిధులను దారిమళ్లించారని ఈ నివేదిక పేర్కొంది. ఎస్ఎఫ్ఐఓ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నందున ప్రాసిక్యూషన్ కేసుల దాఖలుకు ఎస్‌ఎఫ్‌ఐఓకు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ఈ కేసు విషయమై కలసి చర్యలు తీసుకోవడానికి గాను, ఇటీవలే ఎస్ఎఫ్ఐఓ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు సమావేశమై చర్చించాయని సమాచారం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆ కంపెనీ అధినేత విజయ్ మాల్యాపై కేసుల దాఖలయ్యాయి. మాల్యా, ఇతర నిందితులపై ఈడీ, సీబీఐలు ఇప్పటికే వేర్వేరు చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఈ విమానయాన సంస్థకు రుణాలు మంజూరు విషయంలో కొన్ని బ్యాంకుల, కొం దరు బ్యాంక్ అధికారుల పాత్రలపై దర్యాప్తు చేయాలని ఎస్ఎఫ్ఐఓ సూచించింది. ఈ కంపెనీ ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది. -
ఆ 18 కంపెనీలపై కొరడా
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో డిపాజిట్, విత్‌డ్రాయల్స్ జరిపిన 18 డొల్ల కంపెనీల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని 18 కంపెనీల వివరాలను తీవ్ర ఆర్థిక నేరాల విచారణ సంస్థ (ఎస్ఎఫ్ఐఓ)కు అప్పగించింది. అదేసమయంలో తక్కువ మొత్తం డిపాజిట్లతో వేలాది బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు సాగించిన ఇతర కంపెనీల రికార్డులను స్కాన్ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రాంతీయ డైరెక్టర్లను ఆదేశించింది. రూ 100కోట్ల పైబడిన లావాదేవీలు నిర్వహించిన సంస్థలన్నింటినీ ఎస్ఎప్ఐఓకు నివేదించామని, విచారణల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీల ఇతర చట్టాల ఉల్లంఘనలపై ఐటీ, ఈడీ వంటి ఏజెన్సీలూ విచారణ చేపడతాయని తెలిపాయి.నోట్ల రద్దు సమయంలో డిపాజిట్ చేసిన పాత కరెన్సీ నోట్ల వివరాలను తెలపాలని కంపెనీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోరింది. -
మాల్యా రుణ ఎగవేతలో... బ్యాంకులపై ఎస్ఎఫ్ఐఓ కన్ను
* మాజీ బ్యాంకర్ల పాత్రపై విచారణ ప్రారంభం... * నష్టాల్లో ఉన్న కింగ్ఫిషర్కు కొత్త రుణాల మంజూరుపై దర్యాప్తు న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా రుణ ఎగవేతలపై కేంద్రం దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎస్ఎఫ్ఐఓ).. ఇప్పుడు బ్యాంకర్ల పాత్రను నిగ్గుతేల్చే పనిలో ఉంది. ప్రధానంగా కింగ్‌ఫిషర్ భారీగా నష్టాల్లోకి కూరుకుపోతున్నా.. పూర్తిస్థాయిలో మదింపు చేపట్టకుండా దానికి కొత్తగా రుణాలిచ్చిన బ్యాంకులపై దృష్టిసారించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఉన్నాయి. రుణాల మంజూరీలో ఆయా బ్యాంకుల మాజీ చీఫ్‌ల పాత్రపై ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 10కి పైగా బ్యాంకులకు చెందిన మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు పంపినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన కొందరు మాజీ ఉన్నతాధికారులను విచారించినట్లు కూడా తెలిపాయి. మరోపక్క, మాల్యాకు చెందిన కొన్ని బ్రాండ్లు, ఆస్తుల విలువను భారీగా పెంచి చూపడం ద్వారా పెద్దమొత్తంలో రుణాలిచ్చారన్న ఆరోపణలతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి నిధులను దారిమళ్లించడంపైనా ఎస్ఎఫ్ఐఓ దృష్టిపెడుతోంది. కాగా, ఇప్పటికే మల్యా రుణ ఎగవేతలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఈడీ) ఇతరత్రా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 2008-09లో కింగ్‌ఫిషర్ నష్టాలు రూ.1,600 కోట్లకు పైగానే ఎగబాకగా.. 2007-10 మధ్య కాలంంలోనే బ్యాంకులు భారీగా రుణాలివ్వడం గమనార్హం. తీవ్ర నష్టాలు, రుణాల ఊబిలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్ కార్యకలాపాలు 2012లో మూతపడ్డాయి. బ్యాంకులకు రూ. 9,000 కోట్లకుపైగానే రుణాలను(వడ్డీతో కలిపి) ఎగ్గొట్టిన మాల్యాను ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకులు మాల్యా ఎగవేతలపై కేసులు పెట్టడం... సీబీఐ, ఈడీ ఇతరత్రా ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించడంతో మాల్యా ఈ ఏడాది మార్చిలో బ్రిటన్‌కు వె ళ్లిపోవడం తెలిసిందే.