సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ స్కాంలో సీబీఐ, ఈడీల దర్యాప్తు నేపథ్యంలో తాజాగా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నిధులు దారిమళ్లించేందుకు ఉపయోగించిన డొల్ల కంపెనీల గుట్టుమట్లను తేల్చేందుకు తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐఓ) రంగంలోకి దిగింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన 117 కంపెనీల రికార్డులు, పత్రాలను సమర్పించాలని ఎస్‌ఎఫ్‌ఐఓ కోరింది. ఈ 117 సంస్థల్లో అత్యధికం ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేపట్టని డొల్ల కంపెనీలేనని ఎస్‌ఎఫ్‌ఐఓ భావిస్తోంది. ఈ సంస్థలు, కంపెనీలు, ట్రస్టులను బ్యాంకుల ద్వారా సేకరించిన నిధులను దారి మళ్లించేందుకు నీరవ్ మోదీ, చోక్సీలు వాడుకున్నట్టు సమాచారం.
ఆయా సంస్థల, కంపెనీల డైరెక్టర్లు, ఉద్యోగులతో సహా కంపెనీల రికార్డులు, పత్రాలన్నింటినీ సమర్పించాలని ఎస్‌ఎఫ్‌ఐఓ ఇప్పటికే ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, అదీశ్వర్ దియా-జ్యూవెల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు పంపింది. కాగా, అమెరికా, హాంకాంగ్, బెల్జియం, రష్యా, మకావు, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రిటన్ కేంద్రంగా పెద్దసంఖ్యలో షెల్ కంపెనీలను వీరు ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల సహకారంతో ఆయా దేశాల్లో నీరవ్, చోక్సీల పేరుతో ఉన్న నివాసాలు, కార్లు, బ్యాంకు ఖాతాలు ఇతర ఆస్తుల వివరాలను దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి.
నీరవ్, చోక్సీలు ఏళ్ల తరబడి ఎంత మొత్తం దారి మళ్లించారనే దానిపై ఈడీ ఇప్పటికే అమెరికా, బెల్జియం, దుబాయ్ సహా 13 దేశాలను సంప్రదించినట్టు సమాచారం. ఆయా దేశాల్లో వీరి కంపెనీల కార్యకలాపాలు, బ్యాంకు లావాదేవాలను ఈడీ ఆరా తీసింది. కొద్ది వారాల్లోనే ఈ కుంభకోణంపై నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, పీఎన్‌బీ అధికారులపై అభియోగపత్రాలను నమోదు చేస్తామని సీబీఐ, ఈడీ స్పష్టం చేశాయి. చార్జిషీట్‌ల ఆధారంగా విదేశాల్లో తలదాచుకున్న నిందితులను భారత్‌కు రప్పించే ప్రక్రియను చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment