న్యూఢిల్లీ: దాదాపు రూ. 90,000 కోట్ల రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తీవ్ర నేరాల విచారణ సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు వేగవంతం చేసింది. మోసాల్లో పాలుపంచుకున్న ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, లోపాలను గుర్తించడంలో జాప్యానికి గల కారణాల అన్వేషణకు రిజర్వ్ బ్యాంక్ అంతర్గతంగా విచారణ జరపాలని సూచించింది. ఉన్నతాధికారులు కుమ్మక్కై పాల్పడిన మోసం కారణంగా వాటిల్లిన నష్టాలను రాబట్టేందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఫిన్) కొత్త మేనేజ్‌మెంట్ తగు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎస్‌ఎఫ్‌ఐవో పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థ అయిన ఐఫిన్ వ్యవహారంపై విస్తృతంగా దర్యాప్తు చేసిన అనంతరం ఎస్‌ఎఫ్‌ఐవో తాజాగా తొలి చార్జి షీటు దాఖలు చేసింది.
ఈ భారీ ఆర్థిక కుంభకోణం వెనుక 9 మంది కోటరీ ఉన్నట్లు అందులో పేర్కొంది. కంపెనీని ఇష్టారాజ్యంగా నడిపిస్తూ కొందరు స్వతంత్ర డైరెక్టర్లు, ఆడిటర్లు కుమ్మక్కై ఈ కుంభకోణానికి వ్యూహ రచన చేసినట్లు ఆరోపణలు చేసింది. హరి శంకరన్, రవి పార్థసారథి, అరుణ్ సాహా, రమేష్ బవా, విభవ్ కపూర్, కే రామ్‌చంద్ తదితరులు ఈ కోటరీలో ఉన్నట్లు పేర్కొంది. రుణాలు, నికరంగా చేతిలో ఉన్న నిధుల లెక్కింపులో ఐఫిన్ అవకతవకలకు పాల్పడుతోందంటూ 2015 నుంచి ఆర్‌బీఐ అనేక నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐవో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో జరిమానాల విధింపులో జాప్యానికి గల కారణాలను వెలికితీసేందుకు అంతర్గతంగా విచారణ జరపాలని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి ఎస్‌ఎఫ్‌ఐవో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment