
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులపై ప్రాసిక్యూషన్ కేసులు దాఖలు చేయడానికి ఎస్‌ఎఫ్‌ఐఓకి మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. కింగ్ ఫిషర్ ఏర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ) ఒక సవివరమైన నివేదికను కార్పొరేట్ వ్యవహరాల శాఖకు సమర్పించింది. మాల్యా, కంపెనీ అధికారుల్లో కొందరు కంపెనీల చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించారని, కంపెనీల నిధులను దారిమళ్లించారని ఈ నివేదిక పేర్కొంది. ఎస్‌ఎఫ్‌ఐఓ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నందున ప్రాసిక్యూషన్ కేసుల దాఖలుకు ఎస్‌ఎఫ్‌ఐఓకు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం.
ఈ కేసు విషయమై కలసి చర్యలు తీసుకోవడానికి గాను, ఇటీవలే ఎస్‌ఎఫ్‌ఐఓ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు సమావేశమై చర్చించాయని సమాచారం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆ కంపెనీ అధినేత విజయ్ మాల్యాపై కేసుల దాఖలయ్యాయి. మాల్యా, ఇతర నిందితులపై ఈడీ, సీబీఐలు ఇప్పటికే వేర్వేరు చార్జిషీట్‌లు దాఖలయ్యాయి. ఈ విమానయాన సంస్థకు రుణాలు మంజూరు విషయంలో కొన్ని బ్యాంకుల, కొం దరు బ్యాంక్ అధికారుల పాత్రలపై దర్యాప్తు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐఓ సూచించింది. ఈ కంపెనీ ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది.