Auditing company
-
హైదరాబాద్ కంపెనీలకు ‘హిండెన్‌బర్గ్ బూచి’
సాక్షి, హైదరాబాద్: ‘హిండెన్‌బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అలాంటి ఆడిటింగ్ సంస్థలతో ముప్పు
న్యూఢిల్లీ: దేశంలో సేవలందిస్తున్న బహుళజాతి ఆడిటింగ్ సంస్థల నియంత్రణల విధానాలను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. సదరు అకౌంటింగ్ సంస్థల నియంత్రణ యంత్రాంగాన్ని పునఃసమీక్షించే విధానం లేకపోతే చార్టర్ట్ అకౌంటెన్సీ వృత్తిపై గణనీయమైన ప్రబావం పడుతుందని, అనియంత్రిత ఆడిటింగ్ సంస్థలతో ఆర్థికరంగం, దేశంపైనే తీవ్రమైన ప్రభావం పడుతుందని జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఐ, ఫెమా నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (సీపీఐఎల్) అనే ఎన్జీవోతోపాటు మరో సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి సూచనలు చేసింది. -
రిలయన్స్ జియో స్పెక్ట్రంను రద్దు చేయాలి
బీడబ్ల్యూఏ వేలంలో నిబంధనల అతిక్రమణ, రిగ్గింగ్ జరిగింది... టెలికం శాఖకు ఇచ్చిన ముసాయిదా నివేదికలో కాగ్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: ఇన్ఫోటెల్ బ్రాండ్‌బ్యాండ్ సర్వీసెస్(ప్రస్తుతం రిలయన్స్ జియోగా మారింది)కు కేటాయించిన దేశవ్యాప్త వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రం(బీడబ్ల్యూఏ-4జీ)ను రద్దుచేయాలని అత్యున్నత్త ఆడిటింగ్ సంస్థ కాగ్ పేర్కొంది. ప్రధానంగా వేలంలో రిగ్గింగ్, నిబంధనలను ఉల్లంఘించినట్లు టెలికం శాఖ(డాట్)కు పంపిన ముసాయిదా ఆడిట్ నివేదికలో తేల్చిచెప్పింది. వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలను అందించేందుకు సమాయత్తమవుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియోకు తాజా పరిణామాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టనున్నాయి. చాలా చిన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోటెల్ తన కంపెనీ విలువ(నెట్‌వర్త్-రూ.2.5 కోట్లు)కు 5,000 రెట్ల మొత్తాన్ని చెల్లించి దేశవ్యాప్తంగా స్పెక్ట్రంను చేజిక్కించుకోవడం వెనుక చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని కాగ్ పేర్కొంది. వేలానికి ముందునుంచీ ఈ తతంగం నడుస్తున్నా... దీన్ని పసిగట్టడంలో డాట్ పూర్తిగా విఫలమైందని కూడా నివేదికలో నిగ్గుతేల్చింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి... 2010లో జరిగిన బీడబ్ల్యూఏ స్పెక్ట్రం వేలంలో ఇన్ఫోటెల్ దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో స్పెక్ట్రం కోసం బిడ్డింగ్‌లో పాల్గొంది. ఏకంగా రూ.12,847.77 కోట్ల మొత్తానికి బిడ్డింగ్ చేసి వేలంలో విజేతగా నిలవడంతో టెలికం శాఖ ఈ కంపెనీకి స్పెక్ట్రంను కేటాయించింది. అయితే, విలువపరంగా ఐఎస్పీల్లో 150వ స్థానంలో ఉన్న ఇన్ఫోటెల్ వేలం కోసం రూ.252.50 కోట్ల మొత్తాన్ని ముందస్తు డిపాజిట్(ఈఎండీ)గా చెల్లించిందని.. ఇంత భారీ నిధులను వెచ్చించే సామర్థ్యం ఆ కంపెనీకి లేదని కాగ్ నివేదికలో పేర్కొంది. ‘మరో కంపెనీ(థర్డ్‌పార్టీ) లేదా ప్రైవేటు బ్యాంక్ వెనకనుంచి సహాయ సహకారాలు అందించడంవల్లే ఇది సాధ్యపడింది. వేలం ముగిసిన తర్వాత గంటల వ్యవధిలోనే ఇన్ఫోటెల్ను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఆతర్వాత ఇన్ఫోటెల్ పేరును రిలయన్స్ జియోగా మార్చారు. అంటే ఇదంతా కచ్చితంగా కుమ్మక్కుద్వారానే జరిగిందని అర్థమవుతోంది. బిడ్డింగ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇన్ఫోటెల్.. మరో థర్డ్‌పార్టీ కంపెనీకి చేరవేయడం వేలం నిబంధనలు/షరతులను ఉల్లంఘించినట్లే అవుతుంది’ అని కాగ్ తన నివేదికలో తెలిపింది. సరైన అర్హతలేనివాళ్లు కూడా వేలంలో పాల్గొనేలా డాట్ అవకాశం కల్పించడంతో... ఇన్ఫోటెల్ ప్రమోటర్లు థర్డ్‌పార్టీకి లబ్ధిచేకూర్చి, అన్యాయంగా లాభాలను ఆర్జించారని కాగ్ పేర్కొంది. కాగా, ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే వేలంలో బిడ్డర్లకు అర్హత నియమావళిని ఖరారుచేశామంటూ డాట్ చేసిన వాదనను కాగ్ తిరస్కరించింది. సరైన ఐఎస్పీలనే వేలంలో పాల్గొనేలా చూడటం డాట్ బాధ్యత అని తేల్చిచెప్పింది. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించి ఉల్లంఘనలకు, కుమ్మక్కులకు పాల్పడిన బిడ్డర్లకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచించింది.