రిలయన్స్ జియో స్పెక్ట్రంను రద్దు చేయాలి | cancel to the Reliance Geo Spectrum | Sakshi
Sakshi News home page

రిలయన్స్ జియో స్పెక్ట్రంను రద్దు చేయాలి

Published Mon, Jun 30 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

రిలయన్స్ జియో స్పెక్ట్రంను రద్దు చేయాలి

రిలయన్స్ జియో స్పెక్ట్రంను రద్దు చేయాలి

  • బీడబ్ల్యూఏ వేలంలో నిబంధనల అతిక్రమణ, రిగ్గింగ్ జరిగింది...
  • టెలికం శాఖకు ఇచ్చిన ముసాయిదా నివేదికలో కాగ్ స్పష్టీకరణ
  • న్యూఢిల్లీ: ఇన్ఫోటెల్ బ్రాండ్‌బ్యాండ్ సర్వీసెస్(ప్రస్తుతం రిలయన్స్ జియోగా మారింది)కు కేటాయించిన దేశవ్యాప్త వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రం(బీడబ్ల్యూఏ-4జీ)ను రద్దుచేయాలని అత్యున్నత్త ఆడిటింగ్ సంస్థ కాగ్ పేర్కొంది. ప్రధానంగా వేలంలో రిగ్గింగ్, నిబంధనలను ఉల్లంఘించినట్లు టెలికం శాఖ(డాట్)కు పంపిన ముసాయిదా ఆడిట్ నివేదికలో తేల్చిచెప్పింది.

    వచ్చే ఏడాది నుంచి 4జీ సేవలను అందించేందుకు సమాయత్తమవుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ జియోకు తాజా పరిణామాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టనున్నాయి. చాలా చిన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోటెల్ తన కంపెనీ విలువ(నెట్‌వర్త్-రూ.2.5 కోట్లు)కు 5,000 రెట్ల మొత్తాన్ని చెల్లించి దేశవ్యాప్తంగా స్పెక్ట్రంను చేజిక్కించుకోవడం వెనుక చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని కాగ్ పేర్కొంది. వేలానికి ముందునుంచీ ఈ తతంగం నడుస్తున్నా... దీన్ని పసిగట్టడంలో డాట్ పూర్తిగా విఫలమైందని కూడా నివేదికలో నిగ్గుతేల్చింది.
     
    పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలి...
    2010లో జరిగిన బీడబ్ల్యూఏ స్పెక్ట్రం వేలంలో ఇన్ఫోటెల్ దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో స్పెక్ట్రం కోసం బిడ్డింగ్‌లో పాల్గొంది. ఏకంగా రూ.12,847.77 కోట్ల మొత్తానికి బిడ్డింగ్ చేసి వేలంలో విజేతగా నిలవడంతో టెలికం శాఖ ఈ కంపెనీకి స్పెక్ట్రంను కేటాయించింది. అయితే, విలువపరంగా ఐఎస్‌పీల్లో 150వ స్థానంలో ఉన్న ఇన్ఫోటెల్ వేలం కోసం రూ.252.50 కోట్ల మొత్తాన్ని ముందస్తు డిపాజిట్(ఈఎండీ)గా చెల్లించిందని.. ఇంత భారీ నిధులను వెచ్చించే సామర్థ్యం ఆ కంపెనీకి లేదని కాగ్ నివేదికలో పేర్కొంది.

    ‘మరో కంపెనీ(థర్డ్‌పార్టీ) లేదా ప్రైవేటు బ్యాంక్ వెనకనుంచి సహాయ సహకారాలు అందించడంవల్లే ఇది సాధ్యపడింది. వేలం ముగిసిన తర్వాత గంటల వ్యవధిలోనే ఇన్ఫోటెల్‌ను ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఆతర్వాత ఇన్ఫోటెల్ పేరును రిలయన్స్ జియోగా మార్చారు. అంటే ఇదంతా కచ్చితంగా కుమ్మక్కుద్వారానే జరిగిందని అర్థమవుతోంది. బిడ్డింగ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇన్ఫోటెల్.. మరో థర్డ్‌పార్టీ కంపెనీకి చేరవేయడం వేలం నిబంధనలు/షరతులను ఉల్లంఘించినట్లే అవుతుంది’ అని కాగ్ తన నివేదికలో తెలిపింది.

    సరైన అర్హతలేనివాళ్లు కూడా వేలంలో పాల్గొనేలా డాట్ అవకాశం కల్పించడంతో... ఇన్ఫోటెల్ ప్రమోటర్లు థర్డ్‌పార్టీకి లబ్ధిచేకూర్చి, అన్యాయంగా లాభాలను ఆర్జించారని కాగ్ పేర్కొంది. కాగా, ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే వేలంలో బిడ్డర్లకు అర్హత నియమావళిని ఖరారుచేశామంటూ డాట్ చేసిన వాదనను కాగ్ తిరస్కరించింది. సరైన ఐఎస్‌పీలనే వేలంలో పాల్గొనేలా చూడటం డాట్ బాధ్యత అని తేల్చిచెప్పింది. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించి ఉల్లంఘనలకు, కుమ్మక్కులకు పాల్పడిన బిడ్డర్లకు కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement