
అస్సాం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ‘అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్’ సందర్భంగా ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు. టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రిటైల్ విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలను వివరించారు. 2018లో జరిగిన సదస్సులో రాష్ట్రంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ హామీ ఇచ్చిందని, కానీ దానిని రూ.12,000 కోట్లకు పెంచామని అంబానీ గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా ఏఐను ఉపయోగించుకోవాలని ఈ సమ్మిట్ లక్ష్యంగా పెట్టుకుంది.
కీలక పెట్టుబడి రంగాలు
ఏఐ డేటా సెంటర్: అస్సాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. కృత్రిమ మేధ సహాయంతో ఉపాధ్యాయులు, వైద్యులు, రైతులు అస్సాం నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కంపెనీ ఆశిస్తున్నట్లు అంబానీ తెలిపారు.
మెగా ఫుడ్ పార్క్: అస్సాంలో సమృద్ధిగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువను జోడించడానికి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చర్య రాష్ట్ర రైతులకు మద్దతు ఇస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్, పంపిణీకి కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగవుతుంది.
రిలయన్స్ రిటైల్ విస్తరణ: అస్సాంలో రిలయన్స్ రిటైల్ స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. ఈ సంఖ్యను 400 నుంచి 800కు పెంచనుంది. ఈ విస్తరణ రిటైల్ ల్యాండ్ స్కేప్‌ను మెరుగుపరుస్తుంది. వినియోగదారులకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ: అణు ఇంధనంతో సహా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి అస్సాంను హబ్‌గా మార్చడంపై కూడా రిలయన్స్ దృష్టి సారించనుంది. అస్సాంలో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను ఆర్ఐఎల్ నిర్మించనుంది. ఇవి ఏటా 8 లక్షల టన్నుల క్లీన్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిరోజూ రెండు లక్షల ప్యాసింజర్ వాహనాలకు ఇంధనం అందించేందుకు సరిపోతుంది.
హై-ఎండ్ హాస్పిటాలిటీ: హై ఎండ్ హాస్పిటాలిటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆర్ఐఎల్ అస్సాం నడిబొడ్డున విలాసవంతమైన సెవెన్ స్టార్ ఒబెరాయ్ హోటట్‌ను నిర్మించనుంది. పర్యాటకులను ఆకర్షించడం, రాష్ట్ర ఆతిథ్య ప్రమాణాలను పెంచడం ఈ అభివృద్ధి లక్ష్యం.
ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్‌రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలు
ఈ కార్యక్రమాలు అసోంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని అంబానీ తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ తన ‘స్వదేశ్’ స్టోర్ల ద్వారా గ్రీన్ గోల్డ్(వెదురు)ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ అభివృద్ధిలో ప్రధానంగా నిలిపారని అంబానీ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment