కోల్కతాలో నోట్ల రద్దు వ్యతిరేక ర్యాలీ(ఫైల్)
న్యూఢిల్లీ: ‘నోట్ల రద్దు నిర్ణయాన్ని నల్లధనంపై పోరాటంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పటికే తన దగ్గరున్న జాబితాలోని నల్లకుబేరులపై ఎలాంటి చర్యలు తీసుకుంది? రూ.500, రూ.1000 నోట్లు రద్దుచేసి కొత్తగా రూ.2000 నోట్లు తీసుకురావడం వల్ల నల్లధనం ఎలా అంతం అవుతుంది? చెలామణిలో ఉన్న 80 శాతం కరెన్సీని ఒక్కసారే రద్దు చేస్తే దేశంలోని 40 శాతం మంది పేదలు, కూలీలు, చిరువ్యాపారులు ఎలా బతకాలి?
మనుగడలో ఉన్న కరెన్సీ రద్దు కావడంతో అసంఘటిత రంగం(అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్)పై ఆధారపడి జీవిస్తోన్న దాదాపు 30 కోట్ల మంది నవంబర్ 9 నుంచి ఉన్నపళంగా పని కోల్పోయారు. గత పది రోజుల నుంచి వాళ్లంతా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు నల్లధనంపై పోరాటం చేయాల్సిందే. దానిని అందరూ సమర్థించాల్సిందే. కానీ దొరికిన దొంగల్ని వదిలేసి ప్రజల మీద పడటం, కనీసం వెసులుబాటుకు కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురిచేయడం చేయడం దుర్మార్గం. నిజానికి ఈ నోట్ల రద్దు వ్యవహారం స్వాతంత్ర్య భారత చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం. ఎలాగంటే..
ఇవ్వాళ బ్యాంకుల్లో ఏం జరుగుతోందో చూస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజలంతా క్యూ లైన్లలో నిలబడి తమ దగ్గరున్న డబ్బునంతా బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. అందులో అతికొద్ది మొత్తాన్నే విత్ డ్రాయల్ రూపంలో తిరిగి తీసుకోవచ్చు. ముందుగా ఏం జరుగుతుందటే బ్యాంకుల బొజ్జలు పుష్టిగా నిండుతాయి. తర్వాత బ్యాంకులు తమ దగ్గరున్న భారీ మొత్తాలను బడా బాబులకు భారీ అప్పులిచ్చే వెసులుబాటు లభిస్తుంది. ముందు అనుకున్న ప్రకారం ఏ అంబానీకో, అదానీకో లేదా విజయ్ మాల్యాలాంటి దిగ్గజాలకు కోటానుకోట్లు అప్పులు దొరుకుతాయి. ఆ డబ్బుతో వారు తమ వ్యాపారాలను, పరిశ్రమలను విస్తరిస్తారని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది.
ఇక్కడ విచిత్రమేంటంటే.. ప్రతి బ్యాంకులో డీఫాల్టర్ల(అప్పు ఎగవేతదారుల) జాబితా ఉండేది ఇలాంటి బడా బాబులే. అంటే, ఏ కారణాలు చెప్పి బ్యాంకులు బడా బాబులకు అప్పులు ఇస్తున్నారో, అవి నూటికి నూరుశాతం తప్పుడు కారణాలుగా తేలుతున్నాయి. కొందరు వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు నిజాయితీగా అప్పు చెల్లిస్తారు. కానీ అప్పు ఎగ్గొట్లే విజయ్ మాల్యా లాంటి వాళ్లను ప్రభుత్వం విమానం ఎక్కించి విదేశాలకు పంపిస్తుంది. బ్యాంకులు కేంద్రంగా ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఈ రకమైన జూదం ఆడటం సమంజసమేనా?
నిన్నటికి నిన్న ఎస్‌బీఐ వసూలు కాని రూ.7016 కోట్ల బకాయిలను మాఫీ చేసింది. అలా విజయ్ మాల్యా సహా 63 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు మేలు చేసింది. అదేమని ప్రశ్నిస్తే బకాయిలు రద్దు కాలేదు.. అడ్వాన్స్ అండర్ కలెక్షన్ ఎకౌంట్ (ఏయూసీఏ)కు బదిలీ చేశాం అని ప్రభుత్వం చెప్పుకుంటోంది. బ్యాంకింగ్ నిపుణులు ఎవ్వరినైనా అడగండి.. ఈ ఏయూసీఏలు ‘చెత్తబుట్టల్లాంటివ’ని సందేహించకుండా చెబుతారు. ఇక ముందు కూడా బ్యాంకులు ఇలానే చేయబోతున్నాయి. ప్రజల సొమ్మును నేతల సిఫార్సుల ద్వారా బడా బాబులకు పంచిపెట్టనున్నాయి. ఆ మేరకు లాభించిన సొమ్మునే రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఖర్చు చేస్తారు. అందుకే అంటున్నాం.. నోట్ల రద్దును సమర్థించడం నూటికి నూరుశాతం దేశద్రోహమని.
2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సభలు, ప్రచారం కోసం బీజేపీ కళ్లుచెదిరే రీతిలో చేసిన ఖర్చును భరించిన పారిశ్రామిక వేత్తల కోసమే ఈ నోట్ల రద్దును తెరపైకి తెచ్చారు. ఇవ్వాళ మాల్యా, రేపు ఇంకొకాయన.. అలా బడా బాబుల రుణాలు మొత్తం రద్దవుతాయి. కుటుంబాన్ని నడపటానికి అవసరమైన డబ్బు కోసం మహిళలు, పేదలు మాత్రం బ్యాంకుల ముందు బిచ్చగాళ్లలా నిలబడాలి! ఇలా చేస్తున్నందుకు ప్రభుత్వాలు సిగ్గుపడాలి. గడిచిన 10 రోజుల్లో బ్యాంకుల ముందు లైన్లలో నిలబడి 50 మందికి పైగా చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు కావా? అన్నింటికీ లెక్కలుండాలంటున్న మోదీకి.. బీజేపీ నిధుల వివరాలను బయటపెట్టే దమ్ముందా? మోదీని గుడ్డిగా ఆరాధించేవాళ్లు.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై దేశద్రోహులుగా, నల్లధనం సమర్థకులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వారు(ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించేవారు) నిజంగా నేరాలకు పాల్పడిఉంటే చర్యలు తీసుకోవడానికి భయమెందుకు? ఎంక్వైరీలు చేయించరెందుకు? కేంద్రం తలుచుకుంటే కేసులకు కొదువా?. మోదీ మంచి పనులు చేసినప్పుడు మేం సమర్థించాం. తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం’
నవంబర్ 20లోగా నోట్ల ర్దదు నిర్ణయాన్ని ఉపసంహరించకుని, కుదేలైన పేదల జీవితాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం రాత్రి ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశమింది. పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీతో కలిసి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న ఆయన.. యావత్ ప్రజానీకం తమ వెంట ఉందన్నారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే ఏం చెయ్యాలనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. నోట్ల రద్దుపై పోరాటాన్ని కొందరు ముఖ్యమంత్రులు, కొన్ని పార్టీలు సమర్థించకపోవడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామిక పోరాటాలు నేతలు కేంద్రంగా జరగవని, ప్రజల కోసం, ప్రజలే చేస్తారని కేజ్రీవాల్ అన్నారు.