మోదీ - రాహుల్ మధ్య డీల్?
మోదీ - రాహుల్ మధ్య డీల్?
Published Sat, Dec 17 2016 12:32 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM
► అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
► ఆ తర్వాతే పార్టీలపై నిర్ణయం వచ్చిందని వెల్లడి
► అన్ని పార్టీల విరాళాలపై విచారణకు కమిషన్ వేయాలని డిమాండ్
న్యూఢిల్లీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య డీల్ కుదిరినట్లు అనిపిస్తోందంటూ ఆయన చెప్పారు. ప్రధాని మోదీ వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించిన రాహుల్.. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రిని కలిసి వచ్చారని, ఆ తర్వాతే రాజకీయ పార్టీలు ఎంత మొత్తం పాతనోట్లు డిపాజిట్ చేసినా దానిపై విచారణ ఉండబోదన్న ప్రకటన వచ్చిందని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు రాహుల్ కూడా ప్రధాని మీద ఆరోపణల గురించి మాట్లాడటం లేదని.. ఇదంతా చూస్తుంటే వాళ్ల మధ్య ఏమైనా డీల్ కుదిరిందా అనే అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. అసలు ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటుచేసి.. అన్ని రాజకీయ పార్టీలు గత ఐదేళ్లుగా తీసుకున్న విరాళాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, పార్టీలకు 20 వేల రూపాయల కంటే తక్కువ విరాళం ఇస్తే అందుకు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్న పరిమితిని కూడా ఎత్తేయాలన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత అన్ని పార్టీలు జమచేసిన మొత్తాల వివరాలను బయటపెట్టాలన్నారు.
రాజకీయ పార్టీలు ఎన్ని లక్షల కోట్లు పాతనోట్లలో డిపాజిట్లు చేసినా వాటిపై విచారణ ఉండబోదని మోదీసర్కారు ప్రకటించిందని, ఇది చాలా విచారకరమని ఆయన అన్నారు. పార్టీల దగ్గరున్న నల్లధనాన్ని తెల్లగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని చెప్పారు. బీజేపీ దగ్గర పెద్దమొత్తంలో ఉన్న నోట్లను రద్దుకు ముందే జమ చేసుకున్నారని, ఇప్పుడు కూడా మళ్లీ అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెద్దనోట్లు రద్దు చేయడానికి ముందు ఎన్ని భూములు కొన్నారు, ఎన్ని వాహనాలు కొన్నారని ప్రశ్నించారు. తాజా ప్రకటన తర్వాత వాళ్ల ఉద్దేశం పూర్తిగా బయటపడుతోందని మండిపడ్డారు. ఇది దేశవాసులను మోసం చేయడమేనన్నారు. తమ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న మొత్తం ఆదాయపన్ను రిటర్నులను అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. కానీ, తాము భయపడటం లేదని, అన్ని బిల్లులు, రసీదులు చూపిస్తున్నామని అన్నారు. అలాగే అన్ని పార్టీల వివరాలూ పరిశీలించాలని డిమాండ్ చేశారు.
Advertisement