Illiterate
-
మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇటీవల కాలంలో గణితంలో గాడితప్పుతున్నట్లు జాతీయ విద్యా, పరిశోధన మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థుల్లో 49 శాతం మంది కనీస సామర్థ్యాలు చూపలేకపోతున్నారని సర్వే పేర్కొంది. ప్రధాన రాష్ట్రాల్లో విద్యార్థుల మాతృ భాషల అభ్యసనతోపాటు గణితం సామర్థ్యాన్ని మెరుగుపరచాలని ఎన్సీఈఆర్టీ సూచించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 90 వేల మంది విద్యార్థుల సామర్థ్యాలను మదించి ఎన్సీఈఆర్టీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో తెలంగాణలో 180 స్కూళ్లకు చెందిన 1,500 మందికిపైగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించింది. బేసిక్స్ కూడా అంతంతే.. ఈ అధ్యయనం నివేదిక ప్రకారం... ప్రాథమిక విద్య చదువుతున్న వారిలో చాలా మంది బేసిక్స్‌లోనూ బాగా వెనుకబడ్డారు. టెన్త్ విద్యార్థుల్లో రెండంకెల లెక్కలకూ తడుముకొనే పరిస్థితి ఉంది. కరోనా కాలంలో విద్యార్థులు ఎల్రక్టానిక్ పరికరాలకు అతుక్కుపోవడం, స్వయం సామర్థ్యం పెంపు దెబ్బతినడానికి కారణమైంది. ఏ చిన్న లెక్కకైనా క్యాలిక్యులేటర్, ఆన్లైన్లో వెతుక్కొనే పద్ధతికి అలవాటయ్యారు. 8–10 తరగతుల విద్యార్థులు కాగితంపై లెక్కజేయడానికి అవసరమైన దానికన్నా రెండింతల సమయం తీసుకుంటున్నారు. మాతృభాషలో చదవలేని వారు 19 శాతం ఉన్నట్లు తేలింది. పట్టుమని పది పదాలు తప్పులు లేకుండా చదవగలిగిన వారు 6 శాతం, 20 పదాలు చదవిన విద్యార్థులు 13 శాతం ఉన్నారు. ఇక 70 పదాలు తప్పులు లేకుండా చదవగలిగే వాళ్లు 12 శాతమే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మూడో తరగతి వరకూ కనీసం అంకెలు కూడా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తోంది. రెండంకెల కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో 43 శాతం మంది మూడో తరగతిలో ఉన్నారని సర్వేలో గుర్తించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎన్సీఈఆర్టీ కేంద్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు ఎలాంటి చర్యలు అనుసరిస్తాయనే విషయమై స్పష్టత ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. టీచర్ల కొరతా కారణమే ప్రభుత్వ పాఠశాలల్లో 18 సబ్జెక్టులను ఇద్దరు ఉపాధ్యాయులతో బోధిస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనకన్నా బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. పైగా ఈ పనులకే కచ్చితత్వం ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో మేథ్స్ వంటి సబ్జెక్టుల్లో విద్యార్థులు సరైన ప్రతిభ చూపే అవకాశం లేదు. దీనిపై విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, అధ్యక్షుడు, రాష్ట్ర గెజిటెడ్ హెచ్ఎంల సంఘం -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
పెద్ద నోట్ల పేరుతో..రూ. 25 వేలకు టోకరా
జామి విజయనగరం : మండలంలోని లొట్లపల్లి పంచాయతీలో ప్రతి సోమవారం జరిగే అలమండ సంతలో ఎప్పటికప్పుడు మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులను మోసిగిస్తున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా పంచాయతీ అధికారినని చెబుతూ ఓ నిరక్షరాస్యుడిని మోసి చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన మారపూడి మల్లేష్ అలమండ సంతలో గేదెను విక్రయించి తిరిగి వస్తుండగా, స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఓ మోసకారి అతడితో మాటలు కలిపాడు. తాను పంచాయతీ అధికారినని, నా దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి.. చిల్లర నోట్లు ఉంటే ఇమ్మని బాధితుడ్నికోరాడు. దీంతో బాధితుడు తనదగ్గరున్న రూ. 100, 500 నోట్లను అతడికిచ్చాడు. అక్కడే ఉన్న ఓ బైక్‌ను చూపించి అది తనదేనని, అక్కడే ఉంటే లోపలకెళ్లి డబ్బులు తీసుకువస్తానని చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు. సుమారు మూడు గంటలైనా ఆ వ్యక్తి రాకపోవడంతో మల్లేష్ తాను మోసపోయానని గుర్తించి లబోదిబోమన్నాడు. తరచూ ఇవే సంఘటనలు ప్రతి సోమవారం జరిగే సంతలో ఎప్పటికప్పుడు మోసాలు జరుగుతున్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువ మంది సంతకు రావడంతో మోసగాళ్లు వారిని మాటలతో బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారు. గతంలో కూడ గొడికొమ్ము గ్రామానికి చెందిన బొబ్బిలి రాము అనే వ్యక్తి వద్ద 10 వేల రూపాయలు ఇదే తరహాలో స్వాహా చేశారు. ఇటువంటి మోసాలు జరగకుండా ఉండాలంటే పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
మోదీ నిరక్షరాస్యుడు: అరవింద్ కేజ్రీవాల్
-
మోదీ నిరక్షరాస్యుడు: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ఓ నిరక్షరాస్యుడని, ఎవరినీ సంప్రదించకుండానే పెద్ద నోట్లను రద్దు చేశారని, అసలు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధ్వజమెత్తారు. మోదీ తన డిగ్రీని ఎందుకు చూపించడం లేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గుజరాత్ హై కోర్టులో డిగ్రీకి సంబంధించి జరుగుతున్న విచారణ కోసం మోదీ తన బెస్ట్ లాయర్ తుషార్ మెహతాను పంపేది స్టే కోసమేనా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. నోట్ల రద్దు కుంభకోణంతో దేశ ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు మోదీ విద్యార్హతలు తెలుసుకోవాలనుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. అసలు ప్రధానికి ఎకనామిక్స్ అర్థమౌతుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. -
అ..అమ్మ..ఆ.. ఆకలి
వేతనం కరువైన సాక్షర భారత్ సమన్వయకర్తలు 14 నెలలుగా వీసీఓలు, తొమ్మిది నెలలుగా ఎంసీఓలకు రూ.7.10 కోట్ల జీతాలు పెండింగ్ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా పైసా విదల్చని ప్రభుత్వం జిల్లాలో అక్షరాలు రాక నిరక్షరాస్యులు ముప్పుతిప్పలు పడుతుంటే.. అక్షరాలొచ్చిన వారు ఆకలిదప్పులతో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా కొనసాగిన వయోజనకేంద్రాలు, సాక్షరభారత్ సమన్వయ కర్తలను ప్రస్తుత ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. నెలల తరబడి చిల్లిగవ్వకూడా విదల్చకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం కుంటు పడుతోంది. పండగలొచ్చినా పస్తులతో కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోంది. వీరి గురించి అటు పాలకులుగానీ, ఇటు అధికారులుగానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బి.కొత్తకోట: నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా చేస్తున్న సాక్షర భారత్ సమన్వయకర్తలు ఆకలికేకలు పెడుతున్నారు. బొటాబొటి వేతనంతో బతుకు వెళ్లదీస్తున్న వీరు నెలల తరబడి వేతనాలందక సమస్యలతో సతమతమవుతున్నారు. కష్టాల కడలిని ఈదుతున్న వీరి పనితీరుపై ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రతికూల ప్రభావం చూపుతోంది. లక్ష్యం ఘనం.. వయోజన విద్యా విభాగం 15 ఏళ్లు దాటిన నిరక్ష్యరాసులను అక్షరాస్యులుగా మార్చేందుకు సాక్షర భారత్ కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 2,420 మంది గ్రామ సమన్వయకర్తలు (విలేజ్ కో-ఆర్డినేటర్లు), 60 మంది మండల సమన్వయకర్త(ఎంసీవో)లను నియమించింది. వీరు నిరక్ష్యరాస్యులను గుర్తించి వారిని అభ్యాసాల ద్వారా అక్షరాస్యులను చేస్తారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి. 4,72,510 మందిని అక్షరాస్యులుగా మార్చారు. ప్రస్తు తం ఆరో దశలో జిల్లా వ్యాప్తంగా 1.63లక్షల మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, ఐకేపీ సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా చేసుకొన్నారు. దీనికి డ్వామా, డీఆర్డీఏ శాఖలు సహకారం అందిస్తున్నాయి. వేతనాల మాటేదీ? సాక్షరభారత్ వీసీవోలకు నెలకు రూ.2 వేలు, ఎంసీవోలకు నెలకు రూ.6 వేలు వేతనం ఇస్తున్నారు. అయితే కొద్దిపాటి వేతనంతో పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు కరువైంది. ‘మీ ఇంట్లో తిని మా ఇంట్లో పనిచేయండి’ అన్నట్టుగా మారింది వీరి పరిస్థితి. వీసీవోలకు 14 నెలలుగా, ఎంసీవోలకు తొమ్మిది నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. తమ వేతనాలు ఎప్పుడు చె ల్లిస్తారా అని వీరు ఎదురుచూస్తున్నారు. పైసా ఇవ్వని ప్రభుత్వం జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి, వేతనాల చెల్లింపు ఏడాదికి సగటున రూ. 10 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచనా. అయితే దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్ దాటుతున్నా ఒక్కపైసా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో వేతనాలు ఇచ్చేదెలాగో అధికారులకు అర్థం కావడం లేదు. సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ల జీతం విషయమై జిల్లా వయోజన విద్య డెప్యూటీ డెరైక్టర్ వీ.ఉమాదేవిని సోమవారం వివరణ కోరగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్లో వినియోగించని రూ.3 కోట్ల నిధులు మిగిలి ఉన్నాయని.. వీటితో వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. రోజంతా విధుల్లోనే ఉన్నా.. వేతనం తప్ప మరో ఆదాయం లేదు. దీనిపైనే కుటుంబం ఆధారపడింది. రోజంతా విధుల్లోనే ఉండాలి. అయితే ఏప్రిల్ నుంచి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబం గడవాలంటే కష్టంగా ఉంది. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి. - రాంబాబు, మండల కో-ఆర్డినేటర్, బి.కొత్తకోట అన్ని పనులు చేసినా.. సాక్షర భారత్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం. ప్రభుత్వ పథకాల ప్రచారం, ఇంటింటి సర్వేలను మాతో చేయించారు. ఇచ్చేది తక్కువ జీతం. అది కూడా 14 నెలలుగా రాకుంటే మేమంతా ఏం తిని బతకాలి. - ఆంజినేయులు, విలేజ్ కో-ఆర్డినేటర్, రంగసముద్రం -
మహిళా మణులు
నిర్మల్ గ్రామ పురస్కారాలు అందుకున్న మహిళా సర్పంచ్‌లు జిల్లాలో ఇద్దరికి.. ఆ రెండూ చల్లపల్లి మండలానికే పురస్కారాలతో మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి ఆ ఇద్దరు మహిళలు శివారు గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు. అన్ని వసతులు ఉండి విద్యావంతులు, నిధులు దండిగా ఉండే పంచాయతీలు చేయలేని పనిని సవాల్‌గా చేసి చూపించారు. గ్రామీణ ప్రాంతం, అందునా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే శివారు పంచాయతీలైన యార్లగడ్డ, వెలివోలు సర్పంచ్‌లు యార్లగడ్డ సాయిభార్గవి, తలశిల విజయకుమారి పూర్తిస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఇటీవల నిర్మల్ గ్రామపురస్కారాలను అందుకున్నారు. జిల్లాలో రెండు పంచాయతీలకు ఈ పురస్కారాలు లభించగా, ఆ రెండూ చల్లపల్లి మండలానివే కావడం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఇద్దరూ మహిళలు కావడం అభినందనీయం. సమర్థవంతమైన పాలకులు ఉంటే పల్లెలు సైతం పట్టణాలకు తీసిపోవని నిరూపిస్తున్న ఈ ఇద్దరు మహిళామణులపై ప్రత్యేక కథనం. - చల్లపల్లి చల్లపల్లి : రాష్ట్రంలో 2013 సంవత్సరానికి గాను నిర్మల్ గ్రామ పురస్కారాలకు 27 పంచాయతీలను ఎంపిక చేయగా అందులో రెండు జిల్లాకు దక్కాయి. ఆ రెండూ చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ (యార్లగడ్డ సాయిభార్గవి-సర్పంచ్), వెలివోలు (తలశిల విజయకుమారి-సర్పంచ్) గ్రామపంచాయతీలకు రావడం, అందునా మహిళా సర్పంచ్‌లకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఈ పురస్కారం ద్వారా యార్లగడ్డకు రూ.6 లక్షలు, వెలివోలుకు రూ.3 లక్షలు చొప్పున నగదు అవార్డు లభించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు సిహెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఇద్దరు సర్పంచ్‌లు అవార్డులను అందుకున్నారు. తొలి విడతగా యార్లగడ్డకు రూ.1.50 లక్షలు, వెలివోలుకు రూ.75 వేలు చొప్పున చెక్కులు అందజేశారు. యార్లగడ్డకు పురస్కారం ఇలా.. యార్లగడ్డ గ్రామపంచాయతీ 1950లో ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా 1,950 మంది ఉండగా, యార్లగడ్డ సాయిభార్గవి సర్పంచ్‌గా ఉన్నారు. పంచాయతీ పరిధిలో 415 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 47 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినందుకు గాను నిర్మల్ గ్రామ పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద ఇచ్చే రూ.6 లక్షలను పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ ప్రత్యేకతలు ఇవే.. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామమిది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలతో అలరారుతుంటుంది. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న 18 ఎకరాల చెరువు గ్రామానికి మణిహారంలా ఉంటుంది. చుట్టూ కొబ్బరిచెట్లతో ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ, పక్కా రహదారులు దర్శనమిస్తుంటాయి. ఇటీవల గ్రామంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. మరింత బాధ్యత పెరిగింది నిర్మర్ పురస్కారంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. గ్రామంలో గతంలో గ్రంథాలయం ఉండేది, ఇప్పుడు పనిచేయడం లేదు. దాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామంలో మరిన్ని మొక్కలను నాటి సంరక్షణకు చర్యలు చేపడతాం. చెరువు మధ్యలో ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. - యార్లగడ్డ సాయిభార్గవి, సర్పంచ్, యార్లగడ్డ వెలివోలును వరించిందిలా.. వెలివోలు గ్రామపంచాయతీని 1958లో ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో 1,650 మంది జనాభా ఉండగా, సర్పంచ్‌గా తలశిల విజయకుమారి పాలన సాగిస్తున్నారు. గ్రామంలో 362 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 42 మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా నిర్మల్ గ్రామపురస్కారం లభించింది. దీని ద్వారా రూ.3 లక్షల నగదు అందజేస్తారు. పంచాయతీ ప్రత్యేకలు ఇవే ఈ పంచాయతీలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉంది. మూడు కిలోమీటర్ల మేర గ్రామంలో 14 సిమెంట్ రహదారులున్నాయి. జెడ్పీ పరిధిలో శ్రీకాకుళం-నడకుదురులో రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డు, ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. మెట్ట పంటలకు ప్రసిద్ధి పొందిన ఈ పంచాయతీలో చెరుకు, అరటి వంటి వాణిజ్య పంటలు, ఉద్యాన వన పంటలతో పాటు పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి గాంచింది. పంచాయతీ భవనం నిర్మించాలి గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంది. వ్యవసాయ, వాణిజ్య పంటలతో పాటు పట్టు పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాను. - తలశిల విజయకుమారి, సర్పంచ్, వెలివోలు -
అక్షరంతోనే జీవితం
యర్రగొండపాలెం: నిరక్షరాస్యత జీవితాలనే నిరర్థకం చేస్తుంది... అక్షరానికి దూరమైతే అందమైన జీవనమే అగమ్య గోచరమవుతుంది ...అ..ఆలు రాకపోతే ఆప్యాయతలు కనుమరుగైపోతాయి ... బడివైపు అడుగులు పడకపోతే బతుకులే బలిపశువులుగా చేసుకోవాల్సి వస్తుంది... విద్య అబ్బకపోవడంతో పచ్చని కుటుంబాల్లో విద్వేషాల విషం చిమ్మి విషాదాంతమవుతున్నాయి... ఇలా... కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ చెమర్చిన కళ్లతో చెబుతుంటే అక్కడున్నవారి హృదయాలు ద్రవించిపోయాయి. ఆయా వ్యక్తుల్లో అక్షర జ్ఞానం కొరవడడమే ఇందుకు కారణాలని ఉదహరించారు. యర్రగొండపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన స్మార్ట్ విలేజీ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు... యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వెంకటాద్రిపాలెం, కొర్రపోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గిరిజన గూడెంలలో ఇద్దరు శిశువులు చనిపోయిన తీరును వివరించారు. పసిపిల్లకి పాలివ్వక... ప్రసవానికి ముందురోజు భార్యా భర్తలు తగాదా పడ్డారు. ఆ మరుసటి రోజు అమె వైద్యశాలలో శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవించిన తరువాత ఆమె ఇంటికి వెళ్లింది. మళ్లీ వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. భర్త మీద కోపంతో తల్లి శిశువుకు పాలుఇవ్వడం మానివేసింది. ఆ శిశువు మృతి చెందాడు. మరో ప్రాంతంలో మద్యం మత్తులో జోగుతూ శిశువుకు పాలివ్వలేదు ఆ తల్లి. ఆకలితో దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చినా ఆ అమ్మలో చలనం లేదు. ఏడ్చీ, ఏడ్చీ ఆ శిశువు కన్నుమూసింది. అమావాస్యంటూ నిండు గర్భిణీనే చంపేశారు... కనిగిరి ప్రాంతంలో నిండు గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. హడావుడిగా వైద్యశాలకు తీసుకొని వెళ్తున్న సమయంలో ‘అమవాస్య ఎదురొచ్చింది... ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారని’ ఎవరో చెప్పడంతో గూడెంకు వెళ్లిపోయారు. అమావాస్య పోయిన తరువాత (రెండు రోజులనంతరం) వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే విషమించింది...ప్రసవం కష్టమై తల్లీబిడ్డ తనువు చాలించారని సదస్సులో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ రమేష్ వివరించారు. ఈ సంఘటనలపై కలెక్టర్ మాట్లాడుతూ కేవలం అవగాహన లోపంతో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధానంగా నిరక్ష్యరాస్యతేనని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత సాధించినప్పటికీ ఇంకా 90 వేల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. -
సంపూర్ణ అక్షరాస్యతకు సహకరించాలి
ఖమ్మం : జిల్లాలో ప్రతీ ఒక్కరు అక్షరాస్యులు కావాలని, జిల్లాను నిరక్షరాస్యులు లేని జిల్లాగా తీర్చిదిద్దే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖమ్మం అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబూరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఖమ్మంనగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏజేసీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లాలో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో నిరక్షరాస్యత అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు, విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు ముందుకు రావాలని అన్నారు. ప్రధానంగా మహిళల అక్షరాస్యతను పెంచితే కుటుంబంలో అందరూ అక్షరాస్యులుగా మారే అవకాశం ఉందని అన్నారు. జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు ఎంఏ. రత్నకుమార్ మాట్లాడుతూ అన్నిదానాల కంటే విద్యాదానం గొప్పదని అన్నారు. ప్రతీ ఒక్కరు తమకున్న జ్ఞాన్నాన్ని ఇతరులకు పంచాలని అన్నారు. జిల్లాలో ఐదు దశలుగా జరిగిన అక్షరాస్యతా కార్యక్రమాల ద్వారా 67,300 మంది నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని అన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనకు వయోజన విద్యా వలెంటీర్లు, ఇతర ఉద్యోగులతోపాటు సమాజంలోని చదువుకున్న ప్రతీ ఒక్కరు సహకరిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ వేణుమానోహర్రావు, సెట్‌కం సీఈఓ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్య అన్నింటికి మూలం అన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, అందుకు వయస్సుతో సంబంధం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సమతా మహిళా సొసైటీ నిర్వాహకులు సామ్యూల్ శైలజ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కనకయ్య పాల్గొన్నారు.