లబోదిబోమంటున్న బాధితుడు మల్లేష్
జామి విజయనగరం : మండలంలోని లొట్లపల్లి పంచాయతీలో ప్రతి సోమవారం జరిగే అలమండ సంతలో ఎప్పటికప్పుడు మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులను మోసిగిస్తున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా పంచాయతీ అధికారినని చెబుతూ ఓ నిరక్షరాస్యుడిని మోసి చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపాడ మండలం బానాది గ్రామానికి చెందిన మారపూడి మల్లేష్ అలమండ సంతలో గేదెను విక్రయించి తిరిగి వస్తుండగా, స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఓ మోసకారి అతడితో మాటలు కలిపాడు.
తాను పంచాయతీ అధికారినని, నా దగ్గర పెద్ద నోట్లు ఉన్నాయి.. చిల్లర నోట్లు ఉంటే ఇమ్మని బాధితుడ్నికోరాడు. దీంతో బాధితుడు తనదగ్గరున్న రూ. 100, 500 నోట్లను అతడికిచ్చాడు. అక్కడే ఉన్న ఓ బైక్‌ను చూపించి అది తనదేనని, అక్కడే ఉంటే లోపలకెళ్లి డబ్బులు తీసుకువస్తానని చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు. సుమారు మూడు గంటలైనా ఆ వ్యక్తి రాకపోవడంతో మల్లేష్ తాను మోసపోయానని గుర్తించి లబోదిబోమన్నాడు.
తరచూ ఇవే సంఘటనలు
ప్రతి సోమవారం జరిగే సంతలో ఎప్పటికప్పుడు మోసాలు జరుగుతున్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువ మంది సంతకు రావడంతో మోసగాళ్లు వారిని మాటలతో బురిడీ కొట్టించి మోసం చేస్తున్నారు. గతంలో కూడ గొడికొమ్ము గ్రామానికి చెందిన బొబ్బిలి రాము అనే వ్యక్తి వద్ద 10 వేల రూపాయలు ఇదే తరహాలో స్వాహా చేశారు. ఇటువంటి మోసాలు జరగకుండా ఉండాలంటే పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment