అక్షరంతోనే జీవితం | A word can be given with literate for life | Sakshi
Sakshi News home page

అక్షరంతోనే జీవితం

Published Wed, Feb 11 2015 6:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

అక్షరంతోనే జీవితం

అక్షరంతోనే జీవితం

యర్రగొండపాలెం: నిరక్షరాస్యత జీవితాలనే నిరర్థకం చేస్తుంది... అక్షరానికి దూరమైతే అందమైన జీవనమే అగమ్య గోచరమవుతుంది ...అ..ఆలు రాకపోతే ఆప్యాయతలు కనుమరుగైపోతాయి ... బడివైపు అడుగులు పడకపోతే బతుకులే బలిపశువులుగా చేసుకోవాల్సి వస్తుంది... విద్య అబ్బకపోవడంతో పచ్చని కుటుంబాల్లో విద్వేషాల విషం చిమ్మి విషాదాంతమవుతున్నాయి... ఇలా...  కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ చెమర్చిన కళ్లతో చెబుతుంటే అక్కడున్నవారి హృదయాలు ద్రవించిపోయాయి. ఆయా వ్యక్తుల్లో అక్షర జ్ఞానం కొరవడడమే ఇందుకు కారణాలని ఉదహరించారు.   
 
 యర్రగొండపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన స్మార్ట్ విలేజీ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు... యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వెంకటాద్రిపాలెం, కొర్రపోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గిరిజన గూడెంలలో ఇద్దరు శిశువులు చనిపోయిన తీరును వివరించారు.
 
 పసిపిల్లకి పాలివ్వక...
 ప్రసవానికి ముందురోజు భార్యా భర్తలు తగాదా పడ్డారు. ఆ మరుసటి రోజు అమె వైద్యశాలలో శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవించిన తరువాత ఆమె ఇంటికి వెళ్లింది. మళ్లీ వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. భర్త మీద కోపంతో తల్లి శిశువుకు పాలుఇవ్వడం మానివేసింది. ఆ శిశువు మృతి చెందాడు.  మరో ప్రాంతంలో మద్యం మత్తులో జోగుతూ శిశువుకు పాలివ్వలేదు ఆ తల్లి.  ఆకలితో దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చినా ఆ అమ్మలో చలనం లేదు. ఏడ్చీ, ఏడ్చీ ఆ శిశువు కన్నుమూసింది.
 
 అమావాస్యంటూ నిండు గర్భిణీనే చంపేశారు...
 కనిగిరి ప్రాంతంలో నిండు గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. హడావుడిగా వైద్యశాలకు తీసుకొని వెళ్తున్న సమయంలో ‘అమవాస్య ఎదురొచ్చింది... ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారని’ ఎవరో చెప్పడంతో గూడెంకు వెళ్లిపోయారు. అమావాస్య పోయిన తరువాత (రెండు రోజులనంతరం) వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే విషమించింది...ప్రసవం కష్టమై తల్లీబిడ్డ తనువు చాలించారని సదస్సులో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ రమేష్ వివరించారు. ఈ సంఘటనలపై కలెక్టర్ మాట్లాడుతూ కేవలం అవగాహన లోపంతో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధానంగా నిరక్ష్యరాస్యతేనని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత సాధించినప్పటికీ ఇంకా 90 వేల మంది నిరక్షరాస్యులుగా ఉన్నారన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకొని రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement