మోదీపై వ్యక్తిగత దాడులొద్దు!
పార్టీ ఎంపీలకు టీఎంసీ అధినేత్రి సూచన
పెద్దనోట్ల రద్దుతో ప్రజలకు కలిగిన ఇబ్బందులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కాస్తా స్వరాన్ని తగ్గించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయవద్దని పార్టీ ఎంపీలకు ఆమె సూచించారు. పెద్దనోట్ల రద్దును ఆమె ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా.. మోదీ ప్రభుత్వం వెనుకకు తగ్గని విషయం తెలిసిందే.
నోట్లరద్దుకు నిరసనగా బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలని ఆమె పార్టీ ఎంపీలకు సూచించారు. అయితే, ఈ నిరసన ప్రదర్శన విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులుగానీ, నిందాపూర్వక వ్యాఖ్యలుగానీ చేయకూడదని ఆమె సూచించారు. ప్రధానిని తాను సంబోధించినట్టు.. మోదీ బాబు అని సంబోధించవద్దని ఆమె టీఎంసీ ఎంపీలకు స్పష్టం చేశారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత మమతా బెనర్జీ, నరేంద్రమోదీ మధ్య స్నేహసంబంధాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత మమతతోపాటు ఆమె పార్టీ ఎంపీలు కూడా మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగారు. నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పలు కుంభకోణాల్లో టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడం కూడా మోదీ సర్కారుపై మమత కోపాన్ని పెంచింది. ఈ పరిణామాలతో ప్రస్తుతం బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ బద్ధవిరోధులుగా పరస్పర రాజకీయ దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే.