పశ్చిమ బెంగాల్: జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాని మోదీకి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని లోక్‌సభ ఎన్నికలు పతాక స్థాయికి చేర్చాయి. దీదీ గడ్డపై తమ ప్రతాపం చూపాలని మోదీ, షా ద్వయం నిర్ణయించుకుంది. ఆ వైపుగా బీజేపీ తన అడుగుల్ని ముమ్మరం చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్ (80), మహారాష్ట్ర (48) తర్వాత దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు కలిగిన పశ్చిమ బెంగాల్ (42)లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నారు. లెఫ్ట్ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఏర్పడిన రాజకీయ అస్థిరతను భర్తీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. విడతల వారీగా ఎన్నికలు జరిగే బెంగాల్‌లో 20 చోట్ల గెలుపే లక్ష్యంగా కాషాయ పార్టీ బరిలోకి దిగుతోంది. దీని కోసం పాక్‌పై జరిపిన వాయుసేన దాడులు, కులం, స్థానిక గుర్తింపు, జాతీయత, శరణార్థుల సమస్యలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రయోగించనుంది. ఈ దిశగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం అక్కడి శ్రేణుల్ని సమాయత్తం చేసింది.
20 సీట్లే లక్ష్యం..
బెంగాల్‌లో 20 సీట్లను దక్కించుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడుగా ఉన్న 6 సీట్లు, గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉన్న మరో ఆరు స్థానాల్లో కులాన్ని ఆయుధంగా వాడుకోవాలని కాషాయ పార్టీ ఆలోచిస్తోంది. మిగిలిన 8 నుంచి 9 స్థానాల్లో స్థానికత, శరణార్థుల సమస్యలు, విభజన హక్కుల ప్రస్తావనతో ఆధిక్యం సాధించాలని చూస్తోంది. బలహీనపడ్డ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన చిన్న చిన్న నియోజకవర్గాలపైనా ఫోకస్ పెట్టనుంది బీజేపీ.
మాథువాల మనసు గెలిచేదెవరో..
బెంగాల్‌లో నిర్ణయాత్మకంగా భావించే మాథువా కులస్థులు అక్కడి కృష్ణానగర్, రానాఘాట్, బారక్‌పూర్, బరాసత్, బనగాం, కూచ్‌బెహర్‌తో పాటు రాష్ట్రంలోని చాలా చోట్ల అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ కుల ఓటర్ల సంఖ్య దాదాపుగా 1.5 కోట్లు. మాథువాల ఆధ్యాత్మిక గురువు బొరోమా బినాపనీ దేవిని దగ్గర తీసుకోవడం ద్వారా 2011 ఎన్నికల్లో మాయావతి లాభపడ్డారు. బినాపనీ దేవి మృతితో మాథువాల ఓట్లపై అన్ని పార్టీలూ కన్నేశాయి. ప్రధాని మోదీ కూడా తన ప్రచారాన్ని మాథువాలు ఎక్కువగా ఉండే బనగాం నుంచే ప్రారంభించనున్నారు. మాథువాల మద్దతు ఉన్న వారికి రాష్రంలో అధిక సీట్లు లభించే అవకాశాలుండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.
రిపీటవుతున్న.. యూపీ ఫార్ములా!
ఉత్తరప్రదేశ్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో వాడిన హిందూత్వ ఫార్ములానే బెంగాల్‌లోనూ సంధించాలని కాషాయ పార్టీ కసరత్తులు చేస్తోంది. ముస్లిం ఓట్లు ఎలాగూ తృణమూల్ ఖాతాలో చేరతాయి కాబట్టి హిందూ ఓటర్లను ఆరర్షించే పనిలో కమలనాథులు బిజీగా ఉన్నారు. గిరిజనలు అధికంగా ఉండే పురులియా, బంకురా, ఝర్‌గ్రాం లాంటి ప్రాంతాల్లో హిందూ మోడల్‌ను వాడుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు పథకాలు వేస్తున్నాయి.
‘కీ’లకం కానున్న శరణార్థులు
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులను (మాథువాలు) ఎందుకు భారతీయులుగా గుర్తించరు’ అని బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మమతా బెనర్జీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఇది. శరణార్థుల పౌరసత్వ హక్కుల గురించి 2016లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రధాని మోదీలు ప్రస్తావించారు. ఈసారి శరణార్థుల హక్కులు, గుర్తింపు అంశాలకు ప్రచార సమయంలో ఎక్కువ స్థాయిలో ప్రస్తావించాలని కమలనాథులు ఆలోచిస్తున్నారు.
లెఫ్ట్ స్థానాలపై కన్ను..
దాదాపు 33 సంవత్సరాలు బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీపీఐ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయింది. లెఫ్ట్ ప్రాభవం తగ్గడంతో బలపడాలని బీజేపీ భావిస్తోంది. కూచ్ బెహర్‌లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ 1962 నుంచి 2009 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది. అలీపుర్‌దార్‌లో ఆర్‌ఎస్పీ 1977 నుంచి 2014 వరకు జరిగిన ఎలక్షన్లలో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. పురులియాలో 1980 నుంచి 2014 వరకు సీపీఐ విజయం సాధిస్తూ వచ్చింది. లెఫ్ట్ పార్టీల క్యాడర్ బలహీనంగా మారడంతో ఈ స్థానాల్లో గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment