మోదీ సీటు రద్దుకు ప్రతిపక్షం పోటీ | Mamata Banerjee and opposition leaders criticises modi decision | Sakshi
Sakshi News home page

మోదీ సీటు రద్దుకు ప్రతిపక్షం పోటీ

Published Sat, Dec 3 2016 4:50 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

మోదీ సీటు రద్దుకు ప్రతిపక్షం పోటీ - Sakshi

మోదీ సీటు రద్దుకు ప్రతిపక్షం పోటీ

జాతిహితం
ప్రస్తుతం విపక్ష శిబిరంలో పూర్తి స్థాయి పోటీ నెలకొంది. ఇది కొంత వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రాథమిక దశలో వ్యక్తులు పోటీ పడుతున్నట్టే ఉంది. ఏదో కొద్దికాలం మినహా భారతదేశంలో రెండుపార్టీల వ్యవస్థ విధానం మనుగడ సాగించలేదు. గతంలో మన రాజకీయాలన్నీ చిరకాలం పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కీ, గాంధీ కుటుంబానికి అనుకూలం లేదా వ్యతిరేకం అన్న పద్ధతిలోనే సాగాయి. ఇప్పుడు బీజేపీకీ, మోదీకీ అనుకూలం లేదా వ్యతిరేకం అన్న పద్ధతిలో ఉంటున్నాయి.
 
 మన ప్రతిపక్ష నేతల ఇటీవలి లీలల గురించి ఏమని చెప్పాలి? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంత హఠాత్తుగా ఎందుకు కేంద్రంతో సమరానికి సమాయత్తమైపోయారు? ఆఖరికి ఆమె సైన్యాన్ని కూడా ఈ రగడలోకి లాగారు. పంజాబ్ పోరు అమాంతం ఢిల్లీకి, సామాజిక మాధ్యమంలోకి తరలి వచ్చినట్టు అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు హడావుడి పడుతున్నారు? సామాజిక మాధ్యమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కంటే కేజ్రీవాల్ చాలా సమర్థంగా వినియోగించగలరు కూడా. మన్మోహన్  సింగ్ కూడా తన అనుభవాన్ని రంగరించి రాజ్యసభ చర్చలో ఎందుకు పాల్గొ న్నారు? ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎందుకు అంత స్థిరంగా కనిపిస్తూ, నిశ్చలంగా మాట్లాడుతున్నారు? చివరిగా, బిహార్‌లో తన రాజకీయ భాగ స్వాములకీ, మొత్తంగా విపక్షాల ధోరణికీ భిన్నంగా నోట్ల రద్దును సమర్థించే వరకు నితీశ్‌కుమార్ ఎందుకు వెళ్లారు? అయితే ఎవరూ మతి కోల్పోయి వ్యవహరించడం లేదు. ఎవరూ అనాలోచితంగా ప్రవర్తించడం లేదు. ముదు రుపాకాన పడిన ఒక రాజకీయ క్రీడను మనం వీక్షించబోతున్నాం.
 
ఇప్పుడు కొనసాగుతున్న రాజకీయ ధోరణి ఏదీ అంటే, ప్రధానిగా బాధ్యతలు చేపట్టినవారు తమ తొలి సంవత్సరం ఏలుబడిలో, ఏదో ఒక దశలో నీట ముంచినా, పాలముంచినా రీతిలో గట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇది విజయవంతం కావచ్చు, లేదా చతికిలపడవచ్చు. కానీ ప్రధాని తీసుకున్న ఆ చర్య  అనంత రకాల  రాజకీయాల మీద చాలా ఏళ్ల పాటు తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇందులో విజయ కేతనాలుగా చెప్పడానికి ఉదాహ రణలు- అటల్ బిహారీ వాజ్‌పేయి జరిపిన పోఖ్రాన్-2 (ఆయన హయాం మొదట్లోనే జరిగింది) పరీక్ష. అలాగే మన్మోహన్ సింగ్ (ఆయన పదవి చేపట్టిన తరువాత ఐదో ఏట)చేసుకున్న అణు ఒప్పందం కూడా ఇలాంటిదే. ఆ ఇద్దరూ కూడా రెండోసారి ప్రధాని పదవికి ఎంపికయ్యారు. ఇక చతికి లపడిన నిర్ణయాల గురించి-ఇవి రాజీవ్‌గాంధీ విషయంలో రెండు కని పిస్తాయి. ముస్లింలలో సనాతన వర్గాలను బుజ్జగించడానికి సంబంధించిన షాబానో ఉదంతం ఒకటి. మళ్లీ మధ్యలో శ్రీలంక అంశం ఆయనను దుర దృష్టంలా వెంటాడింది.
 
వీపీ సింగ్ విషయానికి వస్తే, ఆయన అల్పాయుష్షు ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయ సంకల్పించింది. అదే ఆయన రాజకీయ భవిష్యత్తును ధ్వంసం చేసింది. ఈ పరిణామమే ప్రధాన స్రవంతి రాజకీయా లను శాశ్వతంగా పునర్ నిర్వచించింది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రధానులు సాహసోపేతంగా, ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్యల గురించే ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంతేతప్ప అసమర్థత, దురుద్దేశాలతో జరిగినవి, అంటే పీవీ నరసింహారావు హయాంలోని అయోధ్య ఉదంతం, రాజీవ్ కాలం లోని బొఫోర్స్ ఉదంతం వంటి వాటి గురించి కాదు.
 
పెద్ద పథకమే ఉంది
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పైన చెప్పు కున్న నీట ముంచినా పాల ముంచినా అన్న ధోరణిలో తీసుకున్న చర్యే అని నిర్ధారించడానికి వీలైన పరీక్ష అని చెప్పుకోవచ్చు. అయితే ఈ చర్య వెనుక ఉద్దేశం కేవలం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పరిమితమై లేదు. ఇది విజయవంతమైతే మాత్రం  2019, ఆపై కాలాన్ని కూడా దృష్టిలో పెట్టు కుని చేసినదే. నోట్ల రద్దు చర్య విజయ పరంపరలోకి వస్తుందా, లేదా వైఫల్యాల జాబితాలోకి చేరిపోతుందా అన్న సంగతిని ఈ దశలోనే వెల్లడించడం సాధ్యం కాదు. కానీ ఒకటి వాస్తవం-2014 అనంతర రాజకీయాలను మాత్రం నోట్ల రద్దుచర్య అనంతర రాజకీయాలు, నోట్ల రద్దుకు ముందు రాజకీయాలు అంటూ పేర్లు పెట్టి పేర్కొనడం తథ్యం. ఈ వాస్తవాన్ని మొదట గుర్తించేవారు ప్రస్తుత ప్రముఖ విపక్షనేతలే.
 
దీదీ ప్రతిన
 ఆరంభదశలో కనిపిస్తున్న ఈ కలకలం కాస్త సద్దుమణగగానే విపక్షాలు నరేంద్ర మోదీ నోట్ల రద్దు చర్యను రాజకీయ ఉద్దేశంతోనే చేపట్టారని అంటాయి. ఈ చర్య నిజంగా నల్లధనానికీ, అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటమే అయితే ఇదే 2019 వరకు మోదీకి రాజకీయ ప్రస్థానానికి సాధ నంగా మారబోతోంది. ఈ రెండింటినీ కలిపి మనం ఆర్థికజాతీయ వాదమని పిలవవచ్చునేమో కూడా. కానీ దీనిని కేజ్రీవాల్ రూ 8 లక్షల కోట్ల కుంభ కోణమని ఆరోపించవచ్చు. కాంగ్రెస్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ లేదా పే టు మోదీ (పేటీఎంకి పేరడీ) తమాషా అని పిలుస్తుంది. ఇక దీదీ (మమత) అయితే తనను పదవి నుంచి తప్పించడానికి కేంద్రం సైన్యాన్ని ప్రయోగిస్తున్నదని ఆరోపిస్తూ, నోట్ల రద్దును వెనక్కి తీసుకోవడం తప్ప మరొకటేదీ అంగీకరించే ప్రశ్న లేదని అంటున్నారు. నితీశ్‌కుమార్ కూడా నిజంగా ఈ చర్య అవినీతికి, నల్లధనానికి వ్యతిరేక పోరాటమైతే సరేనంటూ సహనంతో నోట్ల రద్దులోని స్ఫూర్తిని సమర్ధిస్తున్నారు. అయితే ఆయన సహనశీలత్వానికి తోడు కౌటిల్యు డన్న విశేషణాన్ని కూడా చేర్చవచ్చు.
 
కౌటిల్యుడు అనే ఎందుకు అనడం? చాణక్య-చంద్రగుప్తుల కథను గుర్తుకు తెచ్చుకోండి. శత్రువుల కుట్రతో పాటలీపుత్రం సింహాసనాన్ని కోల్పోయి, ప్రవాసంలో ఉన్న చంద్రగుప్తుడు చిరుగుల పంచెతో ఉన్న ఒక పేద బ్రాహ్మణుడిని చూసిన సంగతి కూడా గుర్తు చేసుకోవాలి. అతడు బ్రహ్మ జెముడు మొక్క మొదట్లో పాలు పోస్తుండగా చంద్రగుప్తుడి కంటపడ్డాడు. తన పంచె ఆ ముళ్ల చెట్టుకు చిక్కుకుని చిరిగిందనీ, అందుకే తాను ప్రతీకారం తీర్చుకుంటున్నానని చాణక్యుడు అంటే కౌటిల్యుడు చెప్పాడు. వెంటనే చంద్రగుప్తుడు తన ఒరలోని కత్తి తీసి ఇచ్చి ఒక్క దెబ్బతో నరకవచ్చు కదా అని సూచించాడు. అందుకు ప్రశాంత చిత్తుడైన చాణక్యుడు ఇలా చెప్పాడు, దానిని నరికితే, మళ్లీ చిగురిస్తుంది. అలా జరక్కుండా ఉండేందుకే తాను ఆ ముళ్ల కంప మొదట్లో ఈ తీయటి పాలు పోస్తున్నాననీ, వాటితో చీమలు, చెదపురుగులు చేరి దానిని వేళ్లతో సహా సర్వనాశనం చేస్తాయని వివరించాడు.

సింహాసనాన్ని తిరిగి దక్కించుకోవడానికి తగిన సలహా ఇచ్చేవారి కోసం తాను చేస్తున్న అన్వేషణ ఫలించిందని వెంటనే చంద్రగుప్తుడు నిర్ధారించు కున్నాడు. పేదల పాలిట పెన్నిధిలా కనిపించేందుకు మోదీ చాలా ప్రమాదకర మార్గంలో ప్రయాణం ఆరంభించారని నితీశ్ భావిస్తూ ఉండి ఉండవచ్చు. కాబట్టి నోట్ల రద్దును గురించి తొందరపడరాదు. అది విఫలమైతే ప్రజలు ఆగ్రహిస్తారు. అప్పుడు విపక్షాలు ప్రస్తుతం చేస్తున్న దుష్టచర్య, అసమర్థత వంటి విమర్శలను తాను కూడా గుప్పించవచ్చు.
 
ప్రస్తుతం విపక్ష శిబిరంలో పూర్తి స్థాయి పోటీ నెలకొంది. ఇది కొంత వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రాథమిక దశలో వ్యక్తులు పోటీ పడుతున్నట్టే ఉంది. ఏదో కొద్దికాలం మినహా భారతదేశంలో రెండుపార్టీల వ్యవస్థ విధానం మనుగడ సాగించలేదు. గతంలో మన రాజకీ యాలన్నీ చిరకాలం పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కీ, గాంధీ కుటుంబానికి అను కూలం లేదా వ్యతిరేకం అన్న పద్ధతిలోనే సాగాయి. ఇప్పుడు బీజేపీకీ, మోదీకీ అనుకూలం లేదా వ్యతిరేకం అన్న పద్ధతిలో ఉంటున్నాయి. విపక్ష శిబిరంలోని ఈ పోటీ లేదా రౌతు తయారీ ప్రధానంగా వారికో నేత కోసమే. ఆ నేత 2019 ఎన్నికలలో మోదీని సవాలు చేయాలి.
 
విపక్షం మిథ్య
గతానికీ ఇప్పటికీ రాజకీయాలలో కనిపించే మార్పు ఏమిటంటే, అతి పెద్ద ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నాయకుడు ఇప్పుడు విపక్షనేతనని చెప్పుకునే స్థితిలో లేరు. అందుకు మొదటి కారణం, అతి పెద్ద విపక్షమన్న పేరేగానీ నిజానికి దానిని పెద్ద ప్రతిపక్షమని పిలవడానికి ఏమాత్రం సాధ్యం కాదు. రెండు- విపక్షం తన నాయకత్వం గురించి చెప్పుకోవడానికి తనకు తానే భయపడు తోంది. రాహుల్‌ను అధ్యక్ష స్థానానికి ఎప్పుడు తీసుకువెళ్లాలో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. పంజాబ్‌లో పార్టీ గెలిస్తే అమరీందర్ సింగ్‌ను ముఖ్య మంత్రిని చేస్తామని చెప్పగలిగే స్థితిలో కూడా లేదు. లోక్‌సభలో ఈ ప్రతి పక్షానికి ఉన్నవి కేవలం 45 స్థానాలు మాత్రమేనన్నది ఒక వాస్తవమైతే, ఆ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్య రాష్ట్రం కేవలం ఒక్కటే, అది కర్ణాటక - అన్నది మరొక వాస్తవం. ప్రధాన ప్రతిపక్షం ఉన్న ఈ దుస్థితిని బట్టే దాని కంటే తాము మోదీని సవాలు చేయడానికి ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నా మని ఇతరులు ఓ నమ్మకానికి రావడానికి వీలు కల్పిస్తోంది.
 
ఆ కారణంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఒక్కరే మోదీపై నేరుగా విమర్శలను ఎక్కుపెడుతున్నారు. ఆఖరికి పంజాబ్ మీద ఆయన ఎక్కువగా దృష్టి పెట్టవ లసి ఉన్నప్పటికీ గుజరాత్‌లోనే తన శక్తియుక్తులన్నింటినీ వెచ్చిస్తున్నారు. ఈ కారణంతోనే మమత కూడా జీఎస్‌టీని తుంగలో తొక్కుతామని బెదిరిస్తు న్నది. ఆఖరికి మోదీని అధికారం నుంచే కాదు, రాజకీయాల నుంచే తరిమేస్తా నని ప్రతిన పూనడం కూడా ఈ కారణంతోనే. పైగా మోదీ రాజకీయాలకు తానే బలి అయినట్టు వర్ణించుకుంటున్నారు. అంతేకాదు, హిందీ ఉచ్చారణ తదితర అంశాలను మమత చాలా వేగంగా నేర్చుకుంటున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
 
మోదీయే ఇప్పటికీ దేశంలో ఎక్కువ ప్రాబల్యం కలిగిన నేత అని అంతా అంగీకరిస్తారు. అదే సమయంలో ఆయన ఓట్లు వికేంద్రీకరణకు కారణం కాగలరు. మోదీ వ్యతిరేక ఓటు చెప్పుకోదగినంతే ఉంది. అలాగే దేశంలో పూర్వ సంప్రదాయానికి తగ్గట్ట్టు ప్రతిపక్షం ఏకత్రాటి మీదకు వచ్చే లక్షణాలేవీ లేవు. ఇలాంటి ఐక్యత కోసం ప్రతిసారి ఒక నాయకుడి అవసరం వస్తున్నది. ఆ పని 1989లో వీపీ సింగ్ చేశారు. ఆయనికి ఓటు బ్యాంకూ లేదు. తనదీ అని చెప్పుకోవడానికి ఒక రాజకీయ పార్టీ లేదు. బోఫోర్సు గుట్టు రట్టు చేసిన వ్యక్తిగా ఆయన ఆ స్థానం దక్కించుకున్నారు. వాజ్‌పేయి నాయకత్వంలో ఎల్‌కే అద్వానీ ఎన్డీఏను ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ యూపీఏకి తిరుగులేని నాయకురాలయ్యారు. అలాంటి ఖాళీ ఏదైనా ఏర్పడకుండా ఉంటుందా అని మమత, కేజ్రీవాల్, నితీశ్ నమ్ముతున్నారని అనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ పతనమైపోతున్న రాజకీయ బ్రాండ్‌గానే కనిపిస్తున్నా, దానికి 2014లో పడిన 11.5 కోట్ల ఓట్లు చెక్కుచెదరకుండానే ఉన్నాయి.
 


శేఖర్ గుప్తా
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement