నోట్లరద్దు సిగ్గుమాలిన ఫ్లాప్ షో
- మరోసారి మోదీపై విరుచుకుపడిన మమత
- రేపటి నుంచి మూడురోజులపాటు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న ప్రధానిగా మోదీని తొలగించి, ఇతర బీజేపీ అగ్రనాయకులు పగ్గాలు చేపట్టాలని ప్రతిపాదించిన ఆమె.. తాజాగా పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా మూడురోజుల పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్, భువనేశ్వర్, పంజాబ్, కిషన్గంజ్(బీహార్), మణిపూర్, త్రిపుర, అస్సాం, జార్ఖండ్, ఢిల్లీలలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
సోమవారం, మంగళవారం, బుధవారం ఈ ధర్నాలు చేపడతామని ఆమె చెప్పారు. నోట్ల రద్దు పేరుతో నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలను ఎత్తివేయాలని, నగదు ఉపసంహరణ ఆంక్షలను తొలగించాలని మమత డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల లక్షలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.