సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు మంగళవారం బంద్ పాటించాయి రైతులకు మద్దతుగా పలు సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. పలు దఫాలుగా రైతులతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ ఫలితం రాలేదు. దీంతో కేంద్ర హోమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు.
(చదవండి : విజయవంతంగా ముగిసిన భారత్ బంద్)
మంగళవారం సాయంత్రం 7 గంటలకు చర్చలకు రావాల్సిందిగా అమిత్ షా నుంచి పిలుపు వచ్చినట్లు రైతు సంఘం నేతలు తెలిపారు. అమిత్ షా నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, చర్చలకు రావాలని ఆయన తమను ఆహ్వానించారని రైతు సంఘం నేత రాకేశ్ చెప్పారు. ఢిల్లీ చుట్టుపక్కల జాతీయ రహదారులపై నిరసనలు తెలుపుతున్న రైతు నేతలందరూ ఈ చర్చలకు హాజరవుతారని చెప్పారు. కొత్త చట్టాలు రద్దు అయ్యేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.
కాగా, రైతులతో కేంద్రం ఇప్పటి వరకు ఐదు విడతలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమిత్ షా పాల్గొనలేదు. భారత్ బంద్ తర్వాత రైతులతో అమిత్ షా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ రోజు సాయంత్రం అమిత్ షా తో రైతులు ఏమి మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారు అనేది ఆసక్తికరంగా మారింది. సమస్యలను పరిష్కరించడంలో , ప్రతిష్టంభన పరిస్థితిని అధిగమించడంలో ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి
Comments
Please login to add a commentAdd a comment