విశాఖలో కూర్మన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన ప్రజలు, కార్మికులు
సాక్షి,అమరావతి/ఉక్కునగరం(విశాఖ)/పటమట (విజయవాడతూర్పు)/పట్నంబజారు(గుంటూరు): విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు జరిగాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల(జేఏసీ) పిలుపు మేరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా విశాఖతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరంలలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగాయి.
విశాఖలో భారీ రాస్తారోకో..
విశాఖ జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రోడ్డుపై బైఠాయించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. దీంతో లంకెలపాలెం నుంచి బీహెచ్‌పీవీ వరకు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే మోదీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని కార్మికులు హెచ్చరించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
► విశాఖపట్నం జిల్లాలోని జీకే వీధి, చోడవరం, పెదబయలు, నక్కపల్లి, కొయ్యూరు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట, కొత్తవలస, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, టెక్కలి, పలాస ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు.
► అలాగే అనంతపురం జిల్లా పెనుకొండ, నల్లచెరువు, తనకల్లు, కర్నూలు జిల్లా కోడుమూరు, కృష్ణా జిల్లా విజయవాడ, తిరువూరు, మొవ్వ, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెం, ప్రకాశం జిల్లా మార్టూరు, ఒంగోలు, వైఎస్సార్ జిల్లా కడప, రాజంపేట తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలు, ప్రదర్శనలు, ధర్నాలు జరిగాయి. గుంటూరు జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనల్లో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
భారత్ బంద్ పాక్షికం..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, కొత్త ఈ–వే బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం తలపెట్టిన భారత్ బంద్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో పాక్షికంగానే కన్పించింది. అయితే భారత్ బంద్‌లో భాగంగా నిత్యావసర ధరలను తగ్గించాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లతోపాటు విశాఖ ఉక్కు నినాదాన్ని కూడా జోడించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించారు. భారత్ బంద్ నేపథ్యంలో.. లారీ యజమానుల సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో పలుచోట్ల రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలోని రామవరప్పాడు, భవానీపురం, ఇబ్రహీంపట్నం, తాడేపల్లిలో లారీలు పెద్దసంఖ్యలో నిలిచాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఆందోళన నిర్వహించారు. విశాఖలోని గాజువాక యార్డులో ట్రాన్స్‌పోర్ట్ లారీలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో 13 వేల లారీలు ఉండగా.. బంద్ కారణంగా 8 వేల లారీలు నిలిచిపోయాయని లారీ అసోసియేషన్ నేతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment