
మాయావతి (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మధ్రప్రదేశ్‌లలో తాము అధికారంలోకి వచ్చాక దళితులపై ఎన్డీయే సర్కార్ అక్రమంగా పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. బీజేపీకి కొమ్ముగాస్తూ.. దళితులపై అక్రమ కేసులు బనాయించిన అధికారులను సస్పెండ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దళిత సంఘాలు చేపట్టిన ‘భారత్ బంద్’ విజవంతమవ్వడంతో బీజేపీ వెన్నులో వణుకుపుట్టిందని పేర్కొన్నారు. తమ ఐక్యతను చూసి ఓర్వలేకనే ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
నిరసనలకు కూడా చోటు లేదు..
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో కనీసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు కూడా దళిత, బహుజనులకు లేవని ఆవేదన వ్య్తక్తం చేశారు. దళితులు చేస్తున్న నిరసనల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న సంఘటనల్ని కూడా భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని, దగ్గరుండి వీడియోలు తీయించి కేసుల పేరుతో వారిని హింసిస్తున్నారని మండిపడ్డారు.
దళితులకు రక్షణ కవచంలా పనిచేసే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు నీరుగారుస్తోందంటూ ఈ నెల 2న దేశవ్యాప్తంగా దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ బంద్‌లో పాల్గొన్న దళితులను పోలీసులు వేధిస్తున్నారంటూ బీజేపీ దళిత ఎంపీ ఉదిత్‌రాజ్ ట్విటర్‌లో చేసిన కామెంట్‌పై మాయవతి స్పందించారు. బీజేపీ దళిత ఎంపీలను దళిత సమాజం ఎన్నటికీ క్షమించదని ఉదిత్‌రాజ్‌పై విమర్శలు గుప్పించారు. స్వార్ధ రాజకీయాలు చేసే బీజేపీ దళిత నేతలు, ఎంపీలు తమ జాతికి ద్రోహం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.