సాక్షి, న్యూఢిల్లీ : కేరళ రాష్ట్రంలో ఇటీవల ఇతర వెనకబడిన కులాలకు చెందిన ఎజావ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కూతురునే ఓ దళితుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందన్న కారణంగా చంపేశారు. ఊరిలో పెళ్లి ఊరేగింపులకు తమకు అనుమతివ్వాలంటూ దళితులు డిమాండ్ చేసినట్లయితే వారి అంతు చూస్తామని ఉత్తరప్రదేశ్ ఠాకూర్లు హెచ్చరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లయితే విధ్వంసం సష్టిస్తామని మహారాష్ట్రలోని మరాఠీలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికే ఈ చట్టాన్ని ఎత్తివేయాలని అగ్రవర్ణమైన వర్ణియార్లు ఎక్కువగా ఉన్న తమిళనాడులోని ‘పట్టాలి మక్కల్ కాచ్చి’ డిమాండ్ చేస్తోంది. దేశంలోని దళితుల పట్ట వివిధ సామాజిక వర్గాలకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ వార్తలు స్పష్టం చేస్తున్నాయి.
దళితుల పట్ల దేశంలో ఇంకా ఇలాంటి అభిప్రాయాలు కొనసాగుతున్నందునే ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరుకార్చాల్సిన అవసరం లేదన్నది స్పష్టం అవుతోంది. ఎస్సీ, ఎస్టీల చట్టం దుర్వినియోగం అవుతోందని భావించాల్సిన అవసరం లేదు. నిజంగా దుర్వినియోగం అవుతుంటే అందుకు కారణాలేమిటో క్షుణ్నంగా పరిశీలించి చట్టంలో ఆమోదయోగ్యమైన మార్పులు తీసుకరావచ్చు. అంతేగానీ చట్టాన్ని సవరణ పేరిట పలుచన చేయరాదు. సుప్రీం కోర్టు పలచన చేసిందన్న కారణంగానే, దాని సమీక్షను కోరుతూ కేంద్రం రివ్యూ పిటీషన్ దాఖలు చేయాలంటూ నేడు ఎస్సీ, ఎస్టీలు భారత్ బంద్‌ను పాటిస్తున్నాయి. మొన్నటి వరకున్న చట్టం నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీల చట్టం కింద ఫిర్యాదు అందితే తక్షణం కేసు నమోదు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిందితులను అరెస్ట్‌చేసే అవకాశం ఉండింది.
ఈ కేసులో నిందితులకు బెయిల్ కూడా వెంటనే లభించేది కాదు. ఈ చట్టం దుర్వినియోగం అవుతుందున్న కారణంగా బాధితుల నుంచి ఫిర్యాదు అందితే దానిపై వారం రోజుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని, ఆ తర్వాత నిందితులపై చర్య తీసుకోవాలని, ఇక ప్రభుత్వ అధికారులపై కేసు దాఖలైతే వారిని అరెస్ట్ చేయడానికి వారి పైఅధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇటీవల సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో దళితులపై రోజురోజుకు దాడుల ఘటనలు పెరుగుతున్నప్పటికీ వారిపై ఎస్సీ, ఎస్టీల చట్టం కింద నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువ. ఇక వాటిల్లో శిక్ష పడుతున్న సందర్భాలు చాలా తక్కువ.
మొత్తం కేసుల్లో 25 శాతం కేసులకు మించి నిందితులకు శిక్షలు పడడం లేదు. ఎందుకంటే నిందితుల ఒత్తిళ్లకు లొంగి పోలీసులు బాధితులతో రాజీలు కుదుర్చడమే అందుకు కారణం. ఇక ఈ కేసుల్లో తక్షణ అరెస్ట్‌లు కూడా లేకపోతే నిందితులపై కేసులు దాఖలు చేయడం తగ్గిపోతుంది. దాఖలైనా రాజీలే ఎక్కువ జరిగి శిక్షలు మరింత తగ్గిపోతాయి. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితులపై గోరక్షకులు దాడులు జరపగా, వాటిల్లో 20 శాతం కేసుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని ప్రయోగించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని మరింత కఠినం చేయాలని ‘నేషనల్ కొహలిషన్ ఫర్ స్ట్రెన్తనింగ్ ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్’ డిమాండ్ చేస్తోంది. కుల మతాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికి గౌరవంతో జీవించే హక్కు ఉంది. భారత రాజ్యాంగంలోని 14వ అధికరణం కులాని, అగ్రవర్గాన్ని కాకుండా అంటరాని తనాన్ని నిషేధిస్తోంది.
అందుకనే 1955లో దేశంలో అంటరానితనం నిషేధిత చట్టం అమల్లోకి వచ్చింది. అదే 1974లో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మారింది. 1989లో ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంగా రూపాంతరం చెందింది. వర్ణ వ్యవస్థ ఆధిపత్యంగల భారత్‌లో ఆశించిన మార్పు రాకపోవడంతో చట్టాన్ని సవరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చట్టాన్ని కఠినతరం చేస్తూ రాగా, ఇప్పుడు సుప్రీం కోర్టు దాన్ని సడలించింది. చట్టం దుర్వినియోగం అవుతుందన్న కారణంగా ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని 498ఏ, ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీ చట్టాలు ఎస్సీ,ఎస్టీల చట్టంకన్నా ఘోరంగా దుర్వినియోగం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment