న్యూఢిల్లీ: ప్రధాన కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ప్రభావం కీలకమైన బ్యాంకింగ్, రవాణా తదితర రంగాలపై పడనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర వివిధ రంగాల కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8వ తేదీన బంద్ పాటించాలంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్మానించాయి. ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగిత, దిగజారిన ఆర్థిక పరిస్థితులకు నిరసనగా తాము కూడా సమ్మెలో భాగస్వాములవుతామంటూ రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలైన ఏఐఆర్ బీఈఏ, ఏఐఆర్‌బీడబ్ల్యూఎఫ్ మంగళవారం తెలిపాయి.
కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు తదితర 12 డిమాండ్లతో కూడిన ఉమ్మడి ఎజెండాపై ఈ నెల 2వ తేదీన జరిపిన చర్చల్లో కార్మిక మంత్రి నుంచి ఎటువంటి హామీ రానందున సమ్మె పిలుపునకు కట్టుబడి ఉన్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా 25 కోట్లమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపాయి. సమ్మె ప్రభావం బుధవారం బ్యాంకింగ్ సేవలపై పడనుందని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్సే్ఛంజీకి సమాచారం అందించాయి. బ్యాంకుల్లో నగదు, విత్‌డ్రా, చెక్ క్లియరింగ్ వంటి సేవలపై బంద్ ప్రభావం పడనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగనున్నాయి. అఖిల భారత స్థాయి బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణాతోపాటు ఇతర కీలక రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.
పాల్గొంటే కఠిన చర్యలు: కేంద్రం
బంద్‌లో కార్మికులు పాల్గొనకుండా చూడాలంటూ ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం కోరింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలను అమలు చేసి కార్యకలాపాలు యథాతధంగా సాగేలా చూడాలని కోరింది. ఏ విధమైన బంద్, నిరసనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేతనంలో కోత వంటి కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మెమోరాండంలో స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపైనా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment