ఐఎన్‌టీయూసీ సంఘాలు ఏకం
ఐఎన్‌టీయూసీ సంఘాలు ఏకం
Published Tue, Aug 30 2016 2:51 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
10న గోదావరిఖనికి సంజీవరెడ్డి రాక
అధికారికంగా ప్రకటించే అవకాశం
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు ఒక్కటికానున్నాయి. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒకే బ్యానర్‌పై కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐఎన్‌టీయూసీ అనుబంధంగా కొనసాగుతున్న జనక్‌ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఎస్.నర్సింహారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలతో సెప్టెంబర్ 10వ తేదీన గోదావరిఖనిలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి హాజరవుతున్నందున పెద్ద ఎత్తున క్యాడర్‌ను సమీకరించే పనిలో రెండు యూనియన్ల నాయకత్వం నిమగ్నమైంది.
ఎస్‌సీఎంఎల్‌యూ ఆస్తుల పరిరక్షణపై దృష్టి
ఐఎన్‌టీయూసీకి అనుబంధంగా ఉన్న సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఎస్‌సీఎంఎల్‌యూ)కు మొన్నటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన బి.వెంకట్రావు ఈనెల 18న టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌లో చేరి ఆ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు. ఈ నేపథ్యంలో యూనియన్‌కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్.నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా త్యాగరాజన్‌ను నియమిస్తూ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం యూనియన్ పేరుతో కొత్తగూడెం, మణుగూరు, సెంటినరీకాలనీలో సొంత భవనాలున్నాయొ. బెల్లంపల్లి మినహా మిగతా అన్ని ఏరియాల్లో సింగరేణి సంస్థ క్వార్టర్లను సమకూర్చింది. ఈ నేపథ్యంలో యూనియన్‌కు చెందిన ఆస్తులను, కార్యాలయాలను కాపాడుకునేందుకు కొత్త కార్యవర్గం దృష్టి సారించింది.
Advertisement
Advertisement