గ్వాలియర్‌లో దళితులపైకి పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్న గుర్తుతెలియని యువకుడు
సాక్షి, న్యూడిల్లీ : రాకేశ్ జాటవ్‌కు 40 ఏళ్లు. రోజు కూలి చేసుకుని బతికే సంసారి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీ, భీమ్‌నగర్ దళిత వాడలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు లాగే సోమవారం నాడు కూడా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయ్యాడు. కూతురు టిఫిన్ బాక్సులో చపాతీలు కట్టివ్వగా తీసుకొని సమీపంలోని కూలీ అడ్డాకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి పక్కింటాయన పరుగెత్తుకుంటూ వచ్చి ‘మీ నాన్నకు బుల్లెట్ తగిలింది. కింద పడిపోయాడు’ అంటూ 18 ఏళ్ల కూతురు కాజల్‌కు చెప్పారు.
కూతురు పరుగెత్తుకుంటూ కుమ్హార్ పురలోని కూలీల అడ్డకు వెళ్లింది. దూరం నుంచే ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. రక్తం మడుగులో నుంచి అప్పుడే రాజీవ్ జాటవ్ శరీరాన్ని లేపి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారు. ‘అప్పటికి నాన్న ఊపిరి కొట్టుకుంటుందో లేదో, నాకు తెలియదు. ఛాతిలో నుంచి బుల్లెట్ దూసుకపోయిందంటూ అక్కడి వారు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లేలోగా నాన్న చనిపోయాడు’ అని కాజల్ మీడియాకు వివరించింది.
భారత్ బంద్ సందర్భంగా గ్వాలియర్ సిటీలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన ముగ్గురు దళితుల్లో రాకేశ్ జాటవ్ ఒకరు. మిగతా ఇద్దరు దళితులు కూడా బుల్లెట్ గాయాలకే మరణించారు. వారిలో 22 ఏళ్ల దీపక్ ఒకరు. అతను గ్వాలియర్ నగరంలోని గొల్లకొత్తార్ ప్రాంతానికి చెందిన వాడు. మరొకరు 26 ఏళ్ల విమల్ ప్రకాష్. గ్వాలియర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవారియా ఫూల్ గ్రామస్థుడు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా బంద్‌తోగానీ, ఘర్షణతోగానీ సంబంధం లేదని తేలింది. రాకేశ్ జాటవ్ రోడ్డు మీద వెళుతుండగా ఛాతిలోకి బుల్లెట్ దిగింది. జీవితంలో ఎస్సై కావాలనుకుంటున్న విమల్ 40 కిలోమీటర్ల దూరంలోని దాబ్రాలో కోచింగ్ తరగతులకు హాజరై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇక ఆటోనడిపే దీపక్ రోడ్డు పక్కన ఆటో ఆపుకొని నిలబడి ఏదో గొడవ జరుగుతోందని అనుకుంటున్నంతలోనే మెడలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. అన్న చనిపోతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న 20 ఏళ్ల తమ్ముడు సచిన్ చూశాడు. పోలీసులు వచ్చే వరకే అన్న చనిపోయాడని తెలిపాడు.
తాము ఘర్షణలను ఆపేందుకు లాఠీలతో బెదిరించామేగానీ, ఒక్క బుల్లెట్‌ను కూడా పేల్చలేదని పోలీసులు స్పష్టం చేశారు. రాళ్లు విసురుతున్న దళితులపైకి అగ్రవర్ణాలకు చెందిన గుర్తుతెలియని యువకులు తుపాకులతో కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ముందుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరు కార్చవద్దని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళుతుంటే అగ్రవర్ణాలకు చెందిన యువకులు తుపాకులతో బెదిరించారని, వారిని ఎదుర్కోవడం కోసం తాము రాళ్లు రువ్వాల్సి వచ్చిందని దళితులు చెబుతున్నారు. దళితులే తమ ఇళ్లపైకి దాడులకు దిగారని అగ్రవర్ణాల వారు ఆరోపిస్తున్నారు. అల్లర్లకు కారణం ఎవరైనా గుర్తుతెలియని యువకులు దళితులపైకి తుపాకులతో కాల్పులు జరుపుతున్న దశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. వాటి ఆధారంగా పోలీసులు పలువురిని అరెస్ట్‌చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టైన వారిలో ఇరువర్గాల వారున్నారని పోలీసులు చెప్పారు. సోమవారం నాటి బంద్ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిన విషయం తెల్సిందే. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ముగ్గురు మరణించగా, భింద్ జిల్లలో ఇద్దరు, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment