dalit protest
-
దళితులపై జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
యువకుల బుల్లెట్లకు దళితులు బలి
సాక్షి, న్యూడిల్లీ : రాకేశ్ జాటవ్‌కు 40 ఏళ్లు. రోజు కూలి చేసుకుని బతికే సంసారి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సిటీ, భీమ్‌నగర్ దళిత వాడలో నివసిస్తున్నాడు. ప్రతిరోజు లాగే సోమవారం నాడు కూడా ఉదయం ఎనిమిది గంటలకు రెడీ అయ్యాడు. కూతురు టిఫిన్ బాక్సులో చపాతీలు కట్టివ్వగా తీసుకొని సమీపంలోని కూలీ అడ్డాకు బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నానికి పక్కింటాయన పరుగెత్తుకుంటూ వచ్చి ‘మీ నాన్నకు బుల్లెట్ తగిలింది. కింద పడిపోయాడు’ అంటూ 18 ఏళ్ల కూతురు కాజల్‌కు చెప్పారు. కూతురు పరుగెత్తుకుంటూ కుమ్హార్ పురలోని కూలీల అడ్డకు వెళ్లింది. దూరం నుంచే ఓ పోలీసు ఆమెను అడ్డుకున్నారు. రక్తం మడుగులో నుంచి అప్పుడే రాజీవ్ జాటవ్ శరీరాన్ని లేపి అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్నారు. ‘అప్పటికి నాన్న ఊపిరి కొట్టుకుంటుందో లేదో, నాకు తెలియదు. ఛాతిలో నుంచి బుల్లెట్ దూసుకపోయిందంటూ అక్కడి వారు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ తర్వాత నేను ఆస్పత్రికి వెళ్లేలోగా నాన్న చనిపోయాడు’ అని కాజల్ మీడియాకు వివరించింది. భారత్ బంద్ సందర్భంగా గ్వాలియర్ సిటీలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణించిన ముగ్గురు దళితుల్లో రాకేశ్ జాటవ్ ఒకరు. మిగతా ఇద్దరు దళితులు కూడా బుల్లెట్ గాయాలకే మరణించారు. వారిలో 22 ఏళ్ల దీపక్ ఒకరు. అతను గ్వాలియర్ నగరంలోని గొల్లకొత్తార్ ప్రాంతానికి చెందిన వాడు. మరొకరు 26 ఏళ్ల విమల్ ప్రకాష్. గ్వాలియర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెవారియా ఫూల్ గ్రామస్థుడు. ఈ ముగ్గురులో ఎవరికి కూడా బంద్తోగానీ, ఘర్షణతోగానీ సంబంధం లేదని తేలింది. రాకేశ్ జాటవ్ రోడ్డు మీద వెళుతుండగా ఛాతిలోకి బుల్లెట్ దిగింది. జీవితంలో ఎస్సై కావాలనుకుంటున్న విమల్ 40 కిలోమీటర్ల దూరంలోని దాబ్రాలో కోచింగ్ తరగతులకు హాజరై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఇక ఆటోనడిపే దీపక్ రోడ్డు పక్కన ఆటో ఆపుకొని నిలబడి ఏదో గొడవ జరుగుతోందని అనుకుంటున్నంతలోనే మెడలో నుంచి బుల్లెట్ దూసుకుపోయి అక్కడికక్కడే చనిపోయారు. అన్న చనిపోతున్న దృశ్యాన్ని పక్కనే ఉన్న 20 ఏళ్ల తమ్ముడు సచిన్ చూశాడు. పోలీసులు వచ్చే వరకే అన్న చనిపోయాడని తెలిపాడు. తాము ఘర్షణలను ఆపేందుకు లాఠీలతో బెదిరించామేగానీ, ఒక్క బుల్లెట్‌ను కూడా పేల్చలేదని పోలీసులు స్పష్టం చేశారు. రాళ్లు విసురుతున్న దళితులపైకి అగ్రవర్ణాలకు చెందిన గుర్తుతెలియని యువకులు తుపాకులతో కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము ముందుగా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదని, ఎస్సీ, ఎస్టీల చట్టాన్ని నీరు కార్చవద్దని నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళుతుంటే అగ్రవర్ణాలకు చెందిన యువకులు తుపాకులతో బెదిరించారని, వారిని ఎదుర్కోవడం కోసం తాము రాళ్లు రువ్వాల్సి వచ్చిందని దళితులు చెబుతున్నారు. దళితులే తమ ఇళ్లపైకి దాడులకు దిగారని అగ్రవర్ణాల వారు ఆరోపిస్తున్నారు. అల్లర్లకు కారణం ఎవరైనా గుర్తుతెలియని యువకులు దళితులపైకి తుపాకులతో కాల్పులు జరుపుతున్న దశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. వాటి ఆధారంగా పోలీసులు పలువురిని అరెస్ట్‌చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అరెస్టైన వారిలో ఇరువర్గాల వారున్నారని పోలీసులు చెప్పారు. సోమవారం నాటి బంద్ సందర్భంగా జరిగిన హింసాకాండలో ఎనిమిది మంది మరణించిన విషయం తెల్సిందే. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ముగ్గురు మరణించగా, భింద్ జిల్లలో ఇద్దరు, రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఇద్దరు, యూపీలో ఒకరు మరణించారు. -
మిస్టర్ దళిత్.. అది నిజం కాదంట!
సాక్షి, అహ్మదాబాద్ : మిస్టర్ దళిత్.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఊపు ఊపేస్తున్న ఉద్యమం. తమపై అగ్ర కులాలు చేస్తోన్న దాడులను ఖండిస్తూ వినూత్న రీతిలో దళిత యువత నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. మీసం మెలితిప్పుతున్న ఫోటోలను ప్రతీ ఒక్కరూ తమ వాట్సాప్ ప్రోఫైల్ పిక్‌గా పెట్టేసుకున్నారు. ఆ దెబ్బకు దేశం మొత్తం గాంధీనగర్ వైపు చూసింది. అయితే ఈ నిరససకు కారణమైన దిగంత్ మహేరియా దాడికి సంబంధించి పోలీసులు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెల్లడించారు. అసలు ఆ యువకుడిపై ఎవరూ దాడి చేయలేదని పోలీసులు చెబుతున్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే యువకుడు నాటకం ఆడాడని, బ్లేడ్ తో దాడి చేసింది అతని స్నేహితులే అని పోలీసులు చెప్పారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందానికి రక్తపు మరకలు లభ్యం కాకపోవటంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి. దీంతో గట్టిగా విచారించగా 17 ఏళ్ల దివంగత్ అసలు విషయం వెల్లడించాడు. పోలీస్ అధికారి వీరేంద్ర యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం... తన ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్‌ను తనపై దాడి చేయాలని దిగంత్ కోరాడని, ముందు రాడ్‌తో కొట్టాలని చెప్పినప్పటికీ తర్వాత ఫ్లాన్ మార్చి బ్లేడ్‌తో దాడికి మార్చాడని తెలిపారు. కానీ, దిగంత్ తల్లిదండ్రులు కూడా దాడి చేసింది అగ్ర కులాల వాళ్లేనంటూ ఎందుకు చెప్పారో తేలాల్సి ఉంది. మరోవైపు ఈ కేసు వెనుకాల ‘‘ఒత్తిళ్లు’’ కూడా ఏమైనా పనిచేస్తున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసే వాళ్లు లేకపోలేదు. కాగా, గతేడాది జులై 11న ఉనా జిల్లాలోని మోటా సమాధియాల గ్రామానికి చెందిన ఏడుగురు దళితులు చనిపోయిన ఆవు చర్మాన్ని వొలుస్తుండగా.. సంఘ్ పరివార్ కు చెందిన గోరక్షక ముఠా వారు గోవధ చేశారనుకుని వారిపై దాడి చేశారు. నలుగురిని వాహనానికి కట్టేసి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసుస్టేషన్ వరకూ ఈడ్చుకెళ్లారు. వారిని దాదాపు ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా.. అప్పటి నుంచి దళితులపై వరుసగా దాడులు జరుగుతూ వస్తున్నాయి. దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా ఉందంటూ స్వయంగా అమిత్ షానే పేర్కొటనం గమనార్హం. తాజాగా ఆనంద్ జిల్లా భద్రనియా గ్రామంలో పాటిదార్(పటేల్) కులానికి చెందిన మహిళలు గర్భా నృత్యాలు ఆడుతుండగా.. అటుకేసి చూడటంతో జయేశ్ సోలంకి(21) అనే దళిత యువకుడిని పాటీదార్ యువకులు చితకబాదారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేశ్ ప్రాణాలు కోల్పోయాడు. -
దళితుల తిరుగుబాటు బీజేపీకి ‘చెక్‌మేట్’
న్యూఢిల్లీ: గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న దళిత శక్తులు, పంజాబ్ రాష్ట్రంలో దళితుల్లో పేరుకుపోతున్న అసంతృప్తి పవనాలు రానున్న ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉనికికి ప్రమాదంగా పరిణమించనున్నాయి. గుజరాత్‌లోని ఉనాలో నలుగురు చర్మకారులను దారుణంగా హింసించడంతో దళితుల్లో ఉవ్వెత్తిన లేచిన ఆగ్రహ జ్వాలలు ఇప్పటికీ చల్లారడం లేదు. గత 30 ఏళ్లలో కనీ విని ఎరుగని ఐక్యత ఇప్పుడు అక్కడి దళితుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ అని తేడా లేకుండా పార్టీలకు అతీతంగా 70 దళిత సంఘాలు కలసికట్టుగా ఆందోళనకు దిగాయి. ప్రత్యేకంగా ఒక నాయకుడి వెనకాల కాకుండా ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారంటే వారిలో గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి ఇప్పట్లో ఆరేది కాదు. మరో పక్క ఉత్తరప్రదేశ్‌లో కూడా దళితులు రగిలిపోతున్నారు. మాయావతికి వ్యతిరేకంగా అక్కడి బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు యూపీలో 21 శాతం ఉన్న దళితులను ఏకం చేసింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి అండగా, బీజేపీకి వ్యతిరేకంగా వారు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా ఇప్పుడు మాయావతికి కలసిరానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన ఇప్పటికి అక్కడి దళితులు మరచిపోవడం లేదు. రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపైనే పార్లమెంట్లో మాయావతికి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య జరిగిన సంవాదంలో మాయావతి సాధించిన విజయం రాష్ట్ర దళితులను ఆమెకు మరింత చేరువ చేసింది. ఇప్పుడు బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మాయావతిని మరోసారి అందివచ్చిన ఆయుధంగా ఉపయోగపడుతోంది. పరువు నిలుపుకోవడం కోసం దయాశంకర్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది బీజేపీ పరిస్థితి. ఠాకూర్లలో పలుకుబడిగల నాయకుడు దయాశంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం పట్ల ఠాకూర్ వర్గాలు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పంజాబ్‌లో 32 శాతం ఉన్న దళితులకు కూడా బీజీపీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. అధికార శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ పొత్తుపెట్టుకోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పంజాబ్‌లోని పగ్వారా సిటీలో ముస్లింలపై శివసేన కార్యకర్తలు దాడి చేయడం కూడా అక్కడ బీజేపీకి ప్రతికూల పరిణామమే. ఈ మూడు రాష్ట్రాల్లోను, ముఖ్యంగా పంజాబ్‌లో దళితులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, కేజ్రివాల్ పార్టీ పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా రానున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బతింటాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ భారీ విజయం సాధించడంతో దళితులను ఆకర్షించడానికి నరేంద్ర మోదీ గత రెండేళ్లుగా భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దళితులను ఆకర్షించడం కోసం ఆయన అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో అంబేడ్కర్ నేషనల్ మెమోరియల్ స్మారక భవనం నిర్మాణానికి పునాది రాయి కూడా వేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం పేరిట ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి అంబేడ్కర్‌కు ప్రత్యేక నివాళులర్పించారు. ‘స్టాండప్ ఇండియా’ పేరిట దళితుల ఉద్ధరణకు కొత్త స్కీమ్‌ను కూడా ప్రకటించారు. ఇవన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతున్నాయి.