సాక్షి, అహ్మదాబాద్ : మిస్టర్ దళిత్.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఊపు ఊపేస్తున్న ఉద్యమం. తమపై అగ్ర కులాలు చేస్తోన్న దాడులను ఖండిస్తూ వినూత్న రీతిలో దళిత యువత నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. మీసం మెలితిప్పుతున్న ఫోటోలను ప్రతీ ఒక్కరూ తమ వాట్సాప్ ప్రోఫైల్ పిక్‌గా పెట్టేసుకున్నారు. ఆ దెబ్బకు దేశం మొత్తం గాంధీనగర్ వైపు చూసింది.
అయితే ఈ నిరససకు కారణమైన దిగంత్ మహేరియా దాడికి సంబంధించి పోలీసులు దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెల్లడించారు. అసలు ఆ యువకుడిపై ఎవరూ దాడి చేయలేదని పోలీసులు చెబుతున్నారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే యువకుడు నాటకం ఆడాడని, బ్లేడ్ తో దాడి చేసింది అతని స్నేహితులే అని పోలీసులు చెప్పారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందానికి రక్తపు మరకలు లభ్యం కాకపోవటంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి.
దీంతో గట్టిగా విచారించగా 17 ఏళ్ల దివంగత్ అసలు విషయం వెల్లడించాడు. పోలీస్ అధికారి వీరేంద్ర యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం... తన ఇద్దరు స్కూల్ ఫ్రెండ్స్‌ను తనపై దాడి చేయాలని దిగంత్ కోరాడని, ముందు రాడ్‌తో కొట్టాలని చెప్పినప్పటికీ తర్వాత ఫ్లాన్ మార్చి బ్లేడ్‌తో దాడికి మార్చాడని తెలిపారు. కానీ, దిగంత్ తల్లిదండ్రులు కూడా దాడి చేసింది అగ్ర కులాల వాళ్లేనంటూ ఎందుకు చెప్పారో తేలాల్సి ఉంది. మరోవైపు ఈ కేసు వెనుకాల ‘‘ఒత్తిళ్లు’’ కూడా ఏమైనా పనిచేస్తున్నాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసే వాళ్లు లేకపోలేదు.
కాగా, గతేడాది జులై 11న ఉనా జిల్లాలోని మోటా సమాధియాల గ్రామానికి చెందిన ఏడుగురు దళితులు చనిపోయిన ఆవు చర్మాన్ని వొలుస్తుండగా.. సంఘ్ పరివార్ కు చెందిన గోరక్షక ముఠా వారు గోవధ చేశారనుకుని వారిపై దాడి చేశారు. నలుగురిని వాహనానికి కట్టేసి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసుస్టేషన్ వరకూ ఈడ్చుకెళ్లారు. వారిని దాదాపు ఐదు గంటల పాటు విపరీతంగా కొట్టారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా.. అప్పటి నుంచి దళితులపై వరుసగా దాడులు జరుగుతూ వస్తున్నాయి. దళితులపై దాడులు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా ఉందంటూ స్వయంగా అమిత్ షానే పేర్కొటనం గమనార్హం.
తాజాగా ఆనంద్ జిల్లా భద్రనియా గ్రామంలో పాటిదార్(పటేల్) కులానికి చెందిన మహిళలు గర్భా నృత్యాలు ఆడుతుండగా.. అటుకేసి చూడటంతో జయేశ్ సోలంకి(21) అనే దళిత యువకుడిని పాటీదార్ యువకులు చితకబాదారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేశ్ ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment