దళితుల తిరుగుబాటు బీజేపీకి ‘చెక్‌మేట్’
న్యూఢిల్లీ: గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న దళిత శక్తులు, పంజాబ్ రాష్ట్రంలో దళితుల్లో పేరుకుపోతున్న అసంతృప్తి పవనాలు రానున్న ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉనికికి ప్రమాదంగా పరిణమించనున్నాయి. గుజరాత్‌లోని ఉనాలో నలుగురు చర్మకారులను దారుణంగా హింసించడంతో దళితుల్లో ఉవ్వెత్తిన లేచిన ఆగ్రహ జ్వాలలు ఇప్పటికీ చల్లారడం లేదు. గత 30 ఏళ్లలో కనీ విని ఎరుగని ఐక్యత ఇప్పుడు అక్కడి దళితుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ అని తేడా లేకుండా పార్టీలకు అతీతంగా 70 దళిత సంఘాలు కలసికట్టుగా ఆందోళనకు దిగాయి. ప్రత్యేకంగా ఒక నాయకుడి వెనకాల కాకుండా ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారంటే వారిలో గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తి ఇప్పట్లో ఆరేది కాదు.
మరో పక్క ఉత్తరప్రదేశ్‌లో కూడా దళితులు రగిలిపోతున్నారు. మాయావతికి వ్యతిరేకంగా అక్కడి బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు యూపీలో 21 శాతం ఉన్న దళితులను ఏకం చేసింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి అండగా, బీజేపీకి వ్యతిరేకంగా వారు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కూడా ఇప్పుడు మాయావతికి కలసిరానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటన ఇప్పటికి అక్కడి దళితులు మరచిపోవడం లేదు.
రోహిత్ వేముల ఆత్మహత్య సంఘటనపైనే పార్లమెంట్‌లో మాయావతికి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య జరిగిన సంవాదంలో మాయావతి సాధించిన విజయం రాష్ట్ర దళితులను ఆమెకు మరింత చేరువ చేసింది. ఇప్పుడు బీజేపీ నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు మాయావతిని మరోసారి అందివచ్చిన ఆయుధంగా ఉపయోగపడుతోంది. పరువు నిలుపుకోవడం కోసం దయాశంకర్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది బీజేపీ పరిస్థితి. ఠాకూర్లలో పలుకుబడిగల నాయకుడు దయాశంకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం పట్ల ఠాకూర్ వర్గాలు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇక పంజాబ్‌లో 32 శాతం ఉన్న దళితులకు కూడా బీజీపీ పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. అధికార శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ పొత్తుపెట్టుకోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పంజాబ్‌లోని పగ్వారా సిటీలో ముస్లింలపై శివసేన కార్యకర్తలు దాడి చేయడం కూడా అక్కడ బీజేపీకి ప్రతికూల పరిణామమే. ఈ మూడు రాష్ట్రాల్లోను, ముఖ్యంగా పంజాబ్‌లో దళితులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, కేజ్రివాల్ పార్టీ పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా రానున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బతింటాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ భారీ విజయం సాధించడంతో దళితులను ఆకర్షించడానికి నరేంద్ర మోదీ గత రెండేళ్లుగా భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దళితులను ఆకర్షించడం కోసం ఆయన అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో అంబేడ్కర్ నేషనల్ మెమోరియల్ స్మారక భవనం నిర్మాణానికి పునాది రాయి కూడా వేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం పేరిట ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించి అంబేడ్కర్‌కు ప్రత్యేక నివాళులర్పించారు. ‘స్టాండప్ ఇండియా’ పేరిట దళితుల ఉద్ధరణకు కొత్త స్కీమ్‌ను కూడా ప్రకటించారు. ఇవన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతున్నాయి.