
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ నాయకులు ముఖ చిత్రాల త్రీడి ప్రింట్‌లతో చీరలను తయారు చేయించారు
3D-print saree business in Gujarat: యూపీ ఎన్నికలతో గుజరాత్‌లో త్రీడీ ప్రింట్ చీరల వ్యాపారం ఊపందుకుంది. ఎన్నికలు జరగన్నును రాష్ట్రాలలో కోవిడ్ -19 దృష్ట్య బహిరంగ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారం కాస్త గుజరాత్‌లోని సూరత్‌లో చీరల వ్యాపారానికి ఊతం ఇచ్చింది. ఈ మేరకు సూరత్‌లోని టెక్స్‌టైల్ మార్కెట్‌కు చెందిన ఒక బట్టల వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాల త్రీడి ప్రింట్‌లతో చీరను తయారు చేశాడు.
దీనికి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మద్దతు ఉంది. పైగా వారి డిమాండ్ మేరకు సూరత్ వ్యాపారులు ఈ చీరలను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ చీరలపై రామమందిరం, వారణాసిలోని వివిధ ఘాట్‌లు, ఇటీవల ప్రధాని ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ల ప్రింట్‌లను ముద్రించారు. పైగా ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చీరలను పెద్దమొత్తంలో పంపించాలని సూరత్‌కు చెందిన వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు.
ఈ కొనుగోళ్లు కూడా బీజేపీ మద్దతుదారులే చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల ప్రచారానికి సహకరించే మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చీరల్లో కొన్నింటిపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం చిత్రం కూడా ఉంటుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సుమారు లక్ష చీరలను పంపనున్నట్లు వస్త్ర వ్యాపారి లలిత్ శర్మ తెలిపారు.