saree business
-
Vini Tandon Keni: చీర... నా రెండో గుర్తింపు
అప్పటివరకు గృహిణిగానే కాలం వెళ్లబుచ్చింది వినీ టాండన్ కెనీ. 53 ఏళ్ల వయసులో చీరకట్టు ద్వారా బిజినెస్ ఉమెన్‌గా మారింది. నేటి తరం అమ్మాయిలకు చీరకట్టు నేర్పించడానికి గోవాలో ప్రత్యేకంగా ‘శారీ స్పీక్’ స్టూడియోను ఏర్పాటు ద్వారా చేనేతకారులను ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ‘శారీ గ్రూప్’ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలను ప్రభావితం చేస్తోంది. ‘చీర నా రెండో గుర్తింపు’ అంటున్న వినీ గురించి ... వినీ టాండన్ కెనీ ని పలకరిస్తే చాలు చీరల పట్ల తనకున్న ప్రేమను ఎంతో ఆనందంగా వ్యక్తపరుస్తుంది. ‘శారీ స్పీక్’ స్టూడియో వ్యవస్థాపకురాలుగా ఆమె ప్రయాణం నేటితరానికి కొత్త పాఠం. భార్య.. తల్లి... కోడలు.. శారీ ఇన్ఫ్లుయెన్సర్, కామిక్ కంటెంట్ సృష్టికర్త కూడా... ఇన్ని పాత్రలను చిరునవ్వుతో పోషించవచ్చుననడానికి వినీనే ఉదాహరణ. ‘నా కుటుంబమే నాకు బలం. ఉత్సాహం. మా కుటుంబ సభ్యులే నా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. ఫేస్బుక్ గ్రూప్ ‘శారీ స్పీక్’ని క్రియేట్ చేసి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ గ్రూప్ కారణంగా చాలామంది మహిళల ఆలోచనల్లో చీర గురించిన నిర్వచనమే మారిపోయింది. ఖాళీ నుంచి మొదలైన ప్రయాణం... నేను పుట్టి పెరిగింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో. మా నాన్నగారు మెరైన్ ఇంజనీర్ అవడంతో ఆయన ఉద్యోగరీత్యా వివిధ నగరాల్లో నివసించాం. నాన్నగారికి గోవాలో పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ప్రసాద్ కెనీతో నా పెళ్లి జరిగింది. అలా నేను గోవాలోనే ఉండిపోయాను. ఇద్దరు అబ్బాయిల పెంపకంలో ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లై కాలేజీలకు వెళుతున్నప్పుడు నాలో ఏదో వెలితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఆసక్తుల వైపు దృష్టి సారించాను. మొదట సినిమా అభిమానుల కోసం ‘మూవీ స్పీక్’ పేరుతో ఫేస్బుక్ గ్రూప్‌ను క్రియేట్ చేశాను. ఆ తర్వాత వివిధ రకాల కళలు, కవులు .. మొదలైన గ్రూప్‌లను సృష్టించాను. అదే సమయంలో ‘శారీ స్పీక్’ బృందం కూడా ఏర్పాటయింది. అలా మొదలైంది... మా అమ్మ, అత్తగారు సౌకర్యం కోసం చీర నుంచి సల్వార్ కమీజ్‌కు మారినప్పుడు నాకెందుకో మనసు చివుక్కుమంది. ఈ విధంగా ఆలోచిస్తే అందరూ చీర కట్టుకోవడం మానేస్తారని అనిపించేది. దీంతో నేను చీర కట్టుకోవడం మొదలుపెట్టాను. నన్ను చీరలో చూసి, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు కూడా చీరలవైపు మొగ్గు చూపేవారు. చీరకట్టు ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. నాకు మంచి స్పందన రావడంతో వాళ్లూ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. చేనేత కారులే నా బ్రాండ్... మా చిన్నబ్బాయి సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమన్నప్పుడు శారీ ఐడియా గురించి చెప్పాను. స్టూడియో ఏర్పాటుకు తనే మద్దతుగా నిలిచాడు. దీంతో 53 ఏళ్ల వయసులో శారీ స్టూడియోతో వ్యాపారవేత్తను అయ్యాను. నా సొంత బ్రాండ్ అంటూ ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల నుంచి చేనేత చీరలను కొనుగోలు చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాను. నా స్టూడియోలో 95 శాతం చేనేత చీరలే ఉంటాయి. ఇప్పుడు చీరలను ఇష్టపడే మహిళలు వాటిని కొనడానికి నా స్టూడియోకు రావడం మొదలుపెట్టారు. కొందరు చీర కట్టుకోవడం తమకు చేతకాదని, ఇంకొందరూ తమకు అసౌకర్యం అని చెబుతుంటారు. చీరకట్టుకోవడానికి ఐదు నిమిషాలు చాలు. ఇక అసౌకర్యం ఎందుకో నాకు అర్థం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నా స్టూడియోలో చీరకట్టుకు సులువైన టెక్నిక్స్ ఇస్తుంటాను. శారీ స్పీక్ స్టోరీలు... చీరకట్టు గురించి మాత్రమే కాదు వారి ఆనందం, అలాగే తమ మానసిక వేదనల నుంచి బయటపడే విధానాల గురించి చెప్పినప్పుడు వాటినీ సోషల్ మీడియా వేదికగా పంచుతుంటాను. బెంగళూరుకు చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. కొన్ని రోజులకు నా పోస్ట్‌లను చూసి తనూ ప్రతి రోజూ కొత్త చీర కట్టుకొని, వాటిని పోస్ట్ చేసింది. ఆ మార్పుతో తన బాధ నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడగలిగింది. ఆమె శారీ స్పీక్కి కృతజ్ఞతలు తెలిపింది. వెయ్యిమందిలో... ప్యాంటు నుండి సల్వార్ డ్రెస్సుల వరకు అన్నీ ధరిస్తాను. కానీ, నాకు అపారమైన నమ్మకాన్ని ఇచ్చేది శారీనే. చీర కట్టుకోగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. నాతో చీర మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కిందటేడాది భారతీయ నేత కార్మికులకు సహాయం చేయడానికి యూకే రాయల్ ఆస్కాట్ హార్స్ రేస్‌లో సుమారు వెయ్యిమంది వరకు చీరలు ధరించారు. వారిలో నేనూ ఉన్నాను. మేం తమ దేశంలో చీర ధరించాలని నిర్ణయించుకున్నందుకు బ్రిటిషర్లు మా వేషధారణను చూసి ఎంతో ఆనందించామని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. లక్షా డెబ్భై వేల మంది సభ్యులు... శారీ స్పీక్ ఫేస్బుక్ అకౌంట్‌కి ప్రపంచం నలుమూలల నుండి లక్షా డెబ్భై వేల మంది సభ్యులు గా ఉన్నారు. ఈ గ్రూపులో మహిళలు మాత్రమే సభ్యులు. ఈ గ్రూప్ చీరలను మాత్రమే ప్రమోట్ చేస్తుంది. ఇన్నేళ్లుగా చీర నన్ను బిజీగా ఉంచింది. నిన్ను చూడగానే చీరలు కట్టుకోవడం మొదలు పెట్టామంటూ చాలా మంది మహిళలు నాకు మెసేజ్ చేస్తుంటారు. మీ వల్లే మాకు ప్రమోషన్ వచ్చిందని, మా అమ్మకాలు పెరిగాయని చేనేత కార్మికులు అంటున్నారు. ఇదంతా వింటే మరింత పనిచేయాలనే ధైర్యం వస్తుంది. ఈ నెల 14న మా గ్రూప్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరూ చీరలో ఆనందంగా విహరించండి’ అంటున్నారు వినీ టాండన్. -
లక్షల రూపాయలున్న బ్యాగు రైల్వే స్టేషన్లో మర్చిపోయాడు.. తిరిగి వచ్చేసరికి
హిందూపురం (సత్యసాయి జిల్లా): రూ. లక్షల డబ్బున్న బ్యాగును ఓ వ్యక్తి మరిచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తేరుకుని మళ్లీ అక్కడకు చేరుకున్నాడు. బ్యాగు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ రైల్వే పోలీసులను ఆశ్రయించగా, బ్యాగును తిరిగి ఆయనకు అప్పగించారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ కెంపరాజు తెలిపిన మేరకు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణానికి చెందిన బిపిన్ చంద్ర చంపక్ లాల్ జరీవాలా హిందూపురం పట్టణంలోని పట్టుచీరల వ్యాపారులతో జరీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం రెండు రోజుల క్రితం హిందూపురం వచ్చాడు. (చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..) స్థానిక వ్యాపారుల ద్వారా రూ.6,15,900 సేకరించాడు. తిరిగి వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న బిపిన్ చంద్ర.. ఇంకా పని పూర్తి కాకపోవడంతో దాన్ని రద్దు చేసుకునేందుకు శనివారం స్థానిక రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. వెంట తెచ్చుకున్న బ్యాగును అక్కడే మర్చిపోయి హడావుడిగా వెళ్లిపోయాడు. బ్యాగును గుర్తించిన స్టేషన్ సిబ్బంది శ్రీకాంత్‌దాస్, రామచంద్ర ఆర్పీఎఫ్ పోలీసుస్టేషన్లో అప్పగించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న బిపిన్ చంద్ర రైల్వే పోలీసులతో గోడు వెళ్లబోసు కున్నాడు. అతడి వద్ద వివరాలు, బిల్లులను పరిశీలించిన పోలీసులు డబ్బున్న బ్యాగును తిరిగి అప్పగించేశారు. (చదవండి: విషాదం.. డ్రైనేజీ శుభ్రం చేసేందుకు దిగి ముగ్గురు మృతి) -
ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!
3D-print saree business in Gujarat: యూపీ ఎన్నికలతో గుజరాత్లో త్రీడీ ప్రింట్ చీరల వ్యాపారం ఊపందుకుంది. ఎన్నికలు జరగన్నును రాష్ట్రాలలో కోవిడ్ -19 దృష్ట్య బహిరంగ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారం కాస్త గుజరాత్‌లోని సూరత్‌లో చీరల వ్యాపారానికి ఊతం ఇచ్చింది. ఈ మేరకు సూరత్‌లోని టెక్స్టైల్ మార్కెట్‌కు చెందిన ఒక బట్టల వ్యాపారి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖాల త్రీడి ప్రింట్లతో చీరను తయారు చేశాడు. దీనికి బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మద్దతు ఉంది. పైగా వారి డిమాండ్ మేరకు సూరత్ వ్యాపారులు ఈ చీరలను తయారు చేస్తున్నారు. అంతేకాదు ఈ చీరలపై రామమందిరం, వారణాసిలోని వివిధ ఘాట్లు, ఇటీవల ప్రధాని ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ల ప్రింట్లను ముద్రించారు. పైగా ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చీరలను పెద్దమొత్తంలో పంపించాలని సూరత్‌కు చెందిన వ్యాపారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు కూడా బీజేపీ మద్దతుదారులే చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో తమ ఎన్నికల ప్రచారానికి సహకరించే మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చీరల్లో కొన్నింటిపై బీజేపీ ఎన్నికల గుర్తు కమలం చిత్రం కూడా ఉంటుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సుమారు లక్ష చీరలను పంపనున్నట్లు వస్త్ర వ్యాపారి లలిత్ శర్మ తెలిపారు. (చదవండి: ఎంత బిజీగా ఉన్నా ఆ పని చేయిస్తా: ప్రియాంక గాంధీ) -
అత్తగారి స్ఫూర్తితో వాట్సాప్‌లో ఉపాధి
సోషల్ మీడియా అనేది రెండువైపుల పదునైన కత్తి. దీన్ని సరిగా ఉపయోగించుకోకపోతే చెత్తను బహుమతిగా ఇవ్వగలదు. ఉపాధికి కొత్త దారులనూ వేయగలదు. వాట్సప్‌ను ఉపయోగించినప్పుడు షణ్ముగప్రియ గుర్తించింది అదే. ఉపాధికి అనువైన మార్గం వేసుకుంది. తనతో పాటు మరికొంతమందికి ఆదాయ వనరుగా మారింది. నాలుగేళ్లలో దాదాపు మూడుకోట్ల రూపాయల టర్నోవర్‌ని సాధించింది. ఫణ్ముగప్రియది చెన్నై. ఇప్పుడు రోజుకు 100 నుంచి 150 చీరల వరకు అమ్ముతోంది. అదీ ఆర్డర్ల మీద. పండగరోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. సీజన్ బట్టి నెలకు 22 లక్షల ఖరీదు చేసే చీరలను అమ్ముతుంది ప్రియ. 2014లో ప్రారంభించిన ఈ చీరల బిజినెస్‌కు ఆమె వాట్సప్గ్రూప్నే కీలకంగా ఎంచుకుంది. మొదట 20 మంది బంధుమిత్రులను ఓ గ్రూప్‌గా యాడ్ చేసింది. ఇప్పుడు వేలాదిమంది వినియోగదారులతో స్థానికంగానే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చీరలను ఆన్లైన్ ఆర్డర్ల మీద సరఫరా చేస్తోంది. ఆమె సంస్థ పేరు యునిక్ థ్రెడ్స్. సిబ్బందితో ప్రియ ప్రత్యేకతలపై దృష్టి ఆన్లైన్ వ్యాపారంలో వృద్ధిపొందాలంటే చీరలు ప్రత్యేకంగా ఉండాలి. కస్టమర్లను ఆకట్టుకోవాలి. అందుకు ఆమె తన దగ్గర ఇద్దరు చేనేత కార్మికులను నియమించుకుంది. వారి చేత ప్రత్యేకత గల చీరలను నేయిస్తుంది. అంతేకాదు వారిద్వారా ప్రత్యేక డిజైన్లు గల చీరలను తెప్పిస్తుంది. వారి సలహాతో ఏ రంగులు, ఎలాంటి డిజైన్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతారు అనే విషయాల పట్ల ప్రియ అవగాహనæ కల్పించుకుంది. నాణ్యత, రంగులపై దృష్టి పెట్టింది. వచ్చిన ఆర్డర్లను గడువులోగా వినియోగదారులకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఆమె చీరల బిజినెస్ వృద్ధిలోకి రావడం ప్రారంభించింది. ఇంటినే షాప్‌గా మార్చి ప్రియ ఇప్పుడు 11 వాట్సప్ గ్రూప్‌లను నిర్వహిస్తోంది. టెలిగ్రామ్నూ ఉపయోగిస్తోంది. ఫేస్బుక్ గ్రూపుల్లో చీరలను మార్కెట్ చేసేందుకు ఎనిమిది మందిని ఏర్పాటుచేసుకుంది. సోషల్‌మీడియా ద్వారా వచ్చిన ఆర్డర్లను బట్టి బిజినెస్ చూసుకుంటుంది. తన బిజినెస్ ఏ విధంగా వృద్ధిలోకి వచ్చిందో ప్రియకు బాగా తెలుసు. తన ఇంటి మొదటి అంతస్తులో గోడౌన్ కమ్ షాప్‌ను ఏర్పాటు చేసింది. కొనుగోలుదారులు ఇక్కడకు వచ్చి తమకు కావల్సిన చీరలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్ చీరలు ఇక్కడే ప్యాకింగ్ అవుతాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్యాకేజీలు బయటకు వెళ్తాయి. వేర్వేరు కొరియర్ కంపెనీల ద్వారా కస్టమర్లకు చీరలను అందిస్తుంటుంది ప్రియ. ఉద్యోగాన్ని వదిలి షణ్ముగప్రియ చీరలు అమ్మడానికి ఆమె అత్తగారే స్ఫూర్తి. ఆమె ఇంటింటికి వెళ్లి చీరలు అమ్ముతూ ఉండేది. ప్రియ ఉద్యోగం చేస్తూ ఉంటే అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ఆమె చనిపోయారు. తన మూడేళ్ల కొడుకును, ఇంటిని చూసుకోవడానికి వేరే గత్యంతరం లేక ఉద్యోగం మానుకుంది. ‘కానీ, భర్త ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవదు.. ఎలా..?’ అని ఆలోచించింది. అత్తగారిని గుర్తుతెచ్చుకొని కొన్ని ఎంపిక చేసుకున్న చీరలను బ్యాగుల్లో పెట్టుకొని బంధుమిత్రుల ఇళ్లకు తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేది. ఆ సమయంలోనే 20 మందితో వాట్సప్ గ్రూప్స్ స్టార్ట్ చేసింది. ఇల్లిల్లూ తిరగడంతో పాటు వాట్సప్ గ్రూప్ ద్వారా వచ్చిన చీరల ఆర్డర్లు తీసుకునేది. దీంతో చీరల అమ్మకాల్లో వేగం పెరగడం గమనించింది.ప్రియ దగ్గర చీరల డిజైన్లు ప్రత్యేకతను ఇష్టపడిన కస్టమర్లు ఏటికేడాది పెరుగుతూ ఇప్పుడు మూడు కోట్ల విలువైన బిజినెస్ చేసేంతగా ఎదిగింది. ప్రియ భర్త తను చేసే ఎమ్ఎన్సి కంపెనీ జాబ్‌కు రిజైన్ చేసి, ఆమెకు తోడుగా నిలిచాడు. – ఎన్.ఆర్. -
ఉక్కపోత
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ : భానుడు తన ప్రతాపంతో జిల్లా ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. వేసవి సెగలతో జిల్లా భగభగ మండుతోంది. ఎండలకంటే ఉక్కపోత పెరిగిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలితో తేమశాతం తగ్గుతుండడంతో భరించలేని ప్రజలు... చల్లగాలుల కోసం కూలర్లు, ఏసీల వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో రోజూ ఓ వైపు మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తున్నా... ఉక్కపోత మాత్రం ఎక్కువగా ఉంది. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడు. మధ్యాహ్నం రోడ్లపైకి రావడానికి జనం జంకుతున్నారు. సాయంత్రం 7దాటినా వేడి సెగలు తగ్గడం లేదు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు, చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఏసీ, కూలర్లు, ఫ్యాన్ల ముందు నుంచి పక్కకు జరిగేందుకు కూడా సాహసించడం లేదు. బయటకు వెళ్లిన నిమిషంలోనే చెమటతో దుస్తులన్నీ తడిసిపోతున్నాయి. ఎండ, ఉక్కపోతతో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, సింగరేణి కార్మికులు విలవిల్లాడుతున్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తేమశాతం ఒక్కసారిగా గాలితో తేమశాతం తగ్గిపోయింది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 40.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 26.0డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 28శాతంగా నమోదైంది. జిల్లాలో బుధవారం ఉక్కపోత తీవ్రస్థాయికి చేరింది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు నమోదు కాగా.. తేమ శాతం 35గా నమోదైంది. బుధవారం ఇది 28 శాతానికి పడిపోవడంతో ఉక్కపోత విపరీతంగా పెరిగిపోయింది.