అత్తగారి స్ఫూర్తితో వాట్సాప్‌లో ఉపాధి | Women Business With Social Media Based in Hyderabad | Sakshi
Sakshi News home page

అత్తగారి స్ఫూర్తితో వాట్సాప్‌లో ఉపాధి

Published Fri, Sep 20 2019 9:05 AM | Last Updated on Fri, Sep 20 2019 9:06 AM

Women Business With Social Media Based in Hyderabad - Sakshi

ప్రియ

సోషల్‌ మీడియా అనేది రెండువైపుల పదునైన కత్తి. దీన్ని సరిగా ఉపయోగించుకోకపోతే చెత్తను బహుమతిగా ఇవ్వగలదు. ఉపాధికి కొత్త దారులనూ వేయగలదు. వాట్సప్‌ను ఉపయోగించినప్పుడు షణ్ముగప్రియ గుర్తించింది అదే. ఉపాధికి అనువైన మార్గం వేసుకుంది. తనతో పాటు మరికొంతమందికి ఆదాయ వనరుగా మారింది. నాలుగేళ్లలో దాదాపు మూడుకోట్ల రూపాయల టర్నోవర్‌ని సాధించింది.

ఫణ్ముగప్రియది చెన్నై. ఇప్పుడు రోజుకు 100 నుంచి 150 చీరల వరకు అమ్ముతోంది. అదీ ఆర్డర్ల మీద. పండగరోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. సీజన్‌ బట్టి నెలకు 22 లక్షల ఖరీదు చేసే చీరలను అమ్ముతుంది ప్రియ. 2014లో ప్రారంభించిన ఈ చీరల బిజినెస్‌కు ఆమె వాట్సప్‌గ్రూప్‌నే కీలకంగా ఎంచుకుంది. మొదట 20 మంది బంధుమిత్రులను ఓ గ్రూప్‌గా యాడ్‌ చేసింది. ఇప్పుడు వేలాదిమంది వినియోగదారులతో స్థానికంగానే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చీరలను ఆన్‌లైన్‌ ఆర్డర్ల మీద సరఫరా చేస్తోంది. ఆమె సంస్థ పేరు యునిక్‌ థ్రెడ్స్‌.

                                        సిబ్బందితో ప్రియ
ప్రత్యేకతలపై దృష్టి
ఆన్‌లైన్‌ వ్యాపారంలో వృద్ధిపొందాలంటే చీరలు ప్రత్యేకంగా ఉండాలి. కస్టమర్లను ఆకట్టుకోవాలి. అందుకు ఆమె తన దగ్గర ఇద్దరు చేనేత కార్మికులను నియమించుకుంది. వారి చేత ప్రత్యేకత గల చీరలను నేయిస్తుంది. అంతేకాదు వారిద్వారా ప్రత్యేక డిజైన్లు గల చీరలను తెప్పిస్తుంది. వారి సలహాతో ఏ రంగులు, ఎలాంటి డిజైన్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతారు అనే విషయాల పట్ల ప్రియ అవగాహనæ కల్పించుకుంది. నాణ్యత, రంగులపై దృష్టి పెట్టింది. వచ్చిన ఆర్డర్లను గడువులోగా వినియోగదారులకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఆమె చీరల బిజినెస్‌ వృద్ధిలోకి రావడం ప్రారంభించింది.

ఇంటినే షాప్‌గా మార్చి
ప్రియ ఇప్పుడు 11 వాట్సప్‌ గ్రూప్‌లను నిర్వహిస్తోంది. టెలిగ్రామ్‌నూ ఉపయోగిస్తోంది. ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో చీరలను మార్కెట్‌ చేసేందుకు ఎనిమిది మందిని ఏర్పాటుచేసుకుంది. సోషల్‌మీడియా ద్వారా వచ్చిన ఆర్డర్లను బట్టి బిజినెస్‌ చూసుకుంటుంది. తన బిజినెస్‌ ఏ విధంగా వృద్ధిలోకి వచ్చిందో ప్రియకు బాగా తెలుసు. తన ఇంటి మొదటి అంతస్తులో గోడౌన్‌ కమ్‌ షాప్‌ను ఏర్పాటు చేసింది. కొనుగోలుదారులు ఇక్కడకు వచ్చి తమకు కావల్సిన చీరలను ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఆర్డర్‌ చీరలు ఇక్కడే ప్యాకింగ్‌ అవుతాయి. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్యాకేజీలు బయటకు వెళ్తాయి. వేర్వేరు కొరియర్‌ కంపెనీల ద్వారా కస్టమర్లకు చీరలను అందిస్తుంటుంది ప్రియ.

ఉద్యోగాన్ని వదిలి
షణ్ముగప్రియ చీరలు అమ్మడానికి ఆమె అత్తగారే స్ఫూర్తి. ఆమె ఇంటింటికి వెళ్లి చీరలు అమ్ముతూ ఉండేది. ప్రియ ఉద్యోగం చేస్తూ ఉంటే అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ఆమె చనిపోయారు. తన మూడేళ్ల కొడుకును, ఇంటిని చూసుకోవడానికి వేరే గత్యంతరం లేక ఉద్యోగం మానుకుంది. ‘కానీ, భర్త ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవదు.. ఎలా..?’ అని ఆలోచించింది. అత్తగారిని గుర్తుతెచ్చుకొని కొన్ని ఎంపిక చేసుకున్న చీరలను బ్యాగుల్లో పెట్టుకొని బంధుమిత్రుల ఇళ్లకు తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేది. ఆ సమయంలోనే 20 మందితో వాట్సప్‌ గ్రూప్స్‌ స్టార్ట్‌ చేసింది. ఇల్లిల్లూ తిరగడంతో పాటు వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా వచ్చిన చీరల ఆర్డర్లు తీసుకునేది. దీంతో చీరల అమ్మకాల్లో వేగం పెరగడం గమనించింది.ప్రియ దగ్గర చీరల డిజైన్లు ప్రత్యేకతను ఇష్టపడిన కస్టమర్లు ఏటికేడాది పెరుగుతూ ఇప్పుడు మూడు కోట్ల విలువైన బిజినెస్‌ చేసేంతగా ఎదిగింది. ప్రియ భర్త తను చేసే ఎమ్‌ఎన్‌సి కంపెనీ జాబ్‌కు రిజైన్‌ చేసి, ఆమెకు తోడుగా నిలిచాడు.  – ఎన్‌.ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement