బీజేపీ నేతలకు గవర్నర్ గిరి
రామ్ నాయక్, వీకే మల్హోత్రా సహా ఐదుగురి పేర్లు ఖరారు
త్వరలో రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల గవర్నర్ పదవుల భర్తీ కోసం ఐదుగురు బీజేపీ సీనియర్ నేతల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. వీరిలో పెట్రోలియం మాజీ మంత్రి రామ్ నాయక్, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కేసరీనాథ్ త్రిపాఠి, ఢిల్లీ బీజేపీ నేత వీకే మల్హోత్రా, భోపాల్ మాజీ ఎంపీ కైలాస్ జోషి, బలరాం దాస్ టాండన్(పంజాబ్) ఉన్నారు. ప్రభుత్వం వీరి పేర్లను సిఫార్సు చేసిందని, వీరిని పదవుల్లో నియమిస్తూ రాష్ట్రపతి భవన్ త్వరలో నోటిఫికేషన్ ఇస్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల కింద చర్చించి పేర్లు ఖరారు చేశారన్నాయి. యూపీ గవర్నర్‌గా ఉండాలని పార్టీ వర్గాలు తనను కోరగా, అందుకు అంగీకరించానని రామ్ నాయక్ ఆదివారం ముంబైలో చెప్పారు. మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ పేరు కూడా గవర్నర్ పదవికి పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లను పదవులను నుంచి తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఐదుగురు గవర్నర్లు.. బీఎల్ జోషి(యూపీ), ఎంకే నారాయణన్(పశ్చిమ బెంగాల్), బీవీ వాంచూ(గోవా), శేఖర్‌దత్(ఛత్తీస్‌గఢ్), అశ్వనీకుమార్(నాగాలాండ్) రాజీనామా చేయడం తెలిసిందే. మరో ఇద్దరు గవర్నర్లు హెచ్‌ఆర్ భరద్వాజ్(కర్ణాటక), దేవానంద్ కన్వర్(త్రిపుర) తమ పదవీకాలం ముగియడంతో గత నెలాఖర్లో రాజీనామా చేశారు. అయితే యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన షీలా దీక్షిత్(కేరళ), శంకరనారాయణన్(మహారాష్ట్ర) జగన్నాథ్ పహాడియా(హార్యానా) తదితరులు మాత్రం ఎన్డీఏ సర్కారు ఒత్తిడిని పట్టించుకోకుండా పదవుల్లో కొనసాగుతున్నారు. షీలా, శంకరనారాయణన్‌లను ఈశాన్యరాష్ట్రాలకు బదిలీ చేసే అవకాశముందని సమాచారం.