Ram Naik
-
పేరు మారనున్న మరో నగరం..!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో నగరం పేరు మారనుంది. ఇప్పటికే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా మార్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. తాజాగా చారిత్రక నగరం సుల్తాన్‌పూర్‌ను కూడా ఆ జాబితాలో చేర్చనుంది. ఈ మేరకు గవర్నర్ రామ్‌నాయక్ సీఎం యోగీకి లేఖ రాశారు. చారిత్రకంగా ప్రాధాన్యం కలిగిన సుల్తాన్పూర్ పేరును.. కుష్‌భావన్‌పూర్‌గా మార్చాలని ఆయన సీఎంకు సూచించారు. పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ మేధావులు, ప్రతినిధులు తనతో భేటీ అయ్యారని తెలిపారు. వారు సమర్పించిన మెమోరాండం, సుల్తాన్పూర్ చరిత్రను తెలిపే ఓ పుస్తకాన్ని కూడా యోగికి అందించారు. కుష్‌భావన్‌పూర్‌ను చారిత్రక నగరంగా గుర్తించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. సుల్తాన్పూర్ పేరు మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే ఆ రాష్ట్రం అసెంబ్లీలో ప్రతిపాదన కూడా చేశారు. ఇక మొగల్ చక్రవర్తుల కాలం నుంచి ఉన్న పలు పురాతన నగరాల పేర్లు మార్చుతున్న బీజేపీ తమ హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. (చదవండి : అలహాబాద్.. ఇకపై ప్రయాగ్‌రాజ్!) -
సీఎం ముఖ్య కార్యదర్శిపై ఆరోపణలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ముఖ్య కార్యదర్శి ఎస్పీ గోయల్‌పై అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. గవర్నర్ రామ్ నాయక్ స్వయంగా జోక్యం చేసుకుని యోగికి లేఖ రాయటం, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేయటంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఆరోపణలు.. హర్దోయ్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటు విషయంలో అభిషేక్ గుప్తా అనే వ్యాపారవేత్త.. గోయల్‌ను సంప్రదించాడు. అయితే రోడ్డు వెడల్పు కోసం అదనపు స్థలం(ఒక్క అడుగు) కోరినందుకు గోయల్ రూ. 25 లక్షలు డిమాండ్ చేశారన్నది అభిషేక్ ఆరోపణ. ఈ మేరకు గవర్నర్ రామ్ నాయక్‌కు అభిషేక్ ఏప్రిల్ 18వ తేదీన ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ ఏప్రిల్ 30వ తేదీన సీఎం యోగి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తూ ఓ లేఖ రాయగా, సీఎం యోగి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఎలా జరిగిందో తెలీదుగానీ గురువారం రాత్రి ఈ లేఖ తాలూకూ ఫోటో ఒకటి వైరల్ కావటంతో దుమారం మొదలైంది. గోయల్ మాత్రం అవినీతి ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, అభిషేక్ మాత్రం తన దగ్గర ఆధారాలున్నాయని వాదించటంతో విషయం రాజకీయ మలుపు తిరిగింది. ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్‌ను పిలిపించుకుని ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం యోగి కోరారు. మరోవైపు సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చివర్లో... అభిషేక్ గుప్తాను శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడున్నర గంటలుగా విచారణ చేపట్టి ఆ ఆరోపణలు అబద్ధమని తేల్చారు. ‘అభిషేక్ గతంలో పలువురి బీజేపీ నాయకుల పేర్లను వాడుకుని కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు గోయల్ లంచం కోరారని చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తేలింది’ అని పేర్కొన్నారు. మరోపక్క అభిషేక్ క్షమాపణలు చెప్పినట్లు ఉన్న వీడియో టేపు ఒకదానిని సీఎం ఆఫీస్ మీడియా సలహాదారు మృత్యుంజయ్ కుమార్ విడుదల చేయటం విశేషం. రాత్రికి రాత్రే కేసు?... గురువారం రాత్రి గవర్నర్ రామ్ నాయక్ రాసిన లేఖ తాలూకు ఫోటో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అయితే అదే రాత్రి యూపీ బీజేపీ విభాగం అభిషేక్‌పై ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతల పేర్లు వాడుకుంటూ అభిషేక్ దందాలు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అభిషేక్ సోదరి, అతని తాత సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అభిషేక్‌ను పోలీసులు విడిచిపెట్టిన తర్వాత వారు ఆందోళన విరమించారు. పోలీసులు మాత్రం అభిషేక్‌పై నమోదైన కేసుల దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు. -
యోగి సర్కారు.. గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాస్గంజ్లో జరిగిన మతఘర్షణలపై ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ తీవ్రంగా స్పందించారు. ఈ అల్లర్లు రాష్ట్ర ప్రతిష్టకు మచ్చలాంటివని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మతఘర్షణలు సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. గత తొమ్మిది, పది నెలల్లో మతఘర్షణలు జరగడం ఇదే తొలిసారి అని గుర్తుచేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన కాస్గంజ్లో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. అదుపులోనే ఉంది. ఇక్కడ జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ వర్గం బైకు ర్యాలీ నిర్వహించగా.. మరో వర్గం నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న రాళ్లదాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. -
యోగి సర్కార్‌కు గవర్నర్ చురకలు
సాక్షి,లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే శాంతి భద్రతలను గాడిలో పెట్టడమే తన ముందున్న లక్ష్యమని యోగి ఆదిత్యానాథ్ పేర్కొన్నారు. అయితే యోగి సీఎం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితులు మెరుగవలేదు. మహిళలపై అత్యాచారాలు యథాతథంగా కొనసాగాయి. శాంతిభద్రతల అంశం యోగి సర్కార్‌కు తలనొప్పిగా మారిన క్రమంలో తాజాగా రాష్ర్ట గవర్నర్ రామ్ నాయక్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో నెట్టాయి. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు. తాను గతంలోనూ, ఇప్పుడూ శాంతిభద్రతల పరిస్థితిపై మాట్లాడుతూనే ఉన్నానని, రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మెరుగుపడాల్సి ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు. సురక్షితంగా జీవించే హక్కు ప్రతి మహిళకూ ఉందని, వారికి భద్రత కల్పించడం ప్రభుత్వం, పోలీసుల కర్తవ్యమని అన్నారు. యూపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విపక్షాలు విమర్శల దాడి చేస్తున్న క్రమంలో గవర్నర్ వ్యాఖ్యలు యోగి సర్కార్‌కు ఇబ్బందికరంగా పరిణమించవచ్చని భావిస్తున్నారు. -
యూపీ గవర్నర్ సంచలన నిర్ణయం
► యూపీ సీఎం యోగికి గవర్నర్ లేఖ లఖ్‌నవూ(ఉత్తరప్రదేశ్): యూపీ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మహమ్మద్ ఆజం ఖాన్‌పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ రామ్ నాయక్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయటం సంచలనం రేపుతోంది. ఆజంఖాన్ అధికార దుర్వినియోగంపై రాసిన లేఖలో ఆయన 14 అంశాలను ప్రస్తావించారు. అఖిలేష్‌యాదవ్ సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన ఆజంఖాన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను ఆక్రమించుకున్నారని, ప్రజాధనంతో ప్రైవేటు వర్సిటీలో అతిథిగృహాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్పోర్ట్స్ స్టేడియంనకు సంబంధించిన సామగ్రిని రాంపూర్‌లోని ప్రైవేట్ వర్సిటీ మహ్మద్ అలీ జౌహార్ వర్సిటీకి అక్రమంగా తరలించారని వివరించారు. అంతేకాకుండా వక్ఫ్‌బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి అధికారులు అందజేసిన 42 పేజీల నివేదికను కూడా జతపరిచారు. -
పరారీలోనే మంత్రి, అనుచరుడి లొంగుబాటు
లక్నో: పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి ప్రధాన అనుచరుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రపాల్ సోమవారం లక్నో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గ్యాంగ్ రేప్ తో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కేసులో గాయత్రీ ప్రజాపతి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రజాపతి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. కాగా అజ్ఞాతంలో ఉన్న మంత్రితోపాటు మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఆయన పాస్‌పోర్టుపై నాలుగు వారాలపాటు నిషేధం విధించి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చింది. కాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించడంతో బాధిత మహిళ సుప్రీంను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల దాడి గుప్పిస్తోంది. -
కేబినెట్లో రేపిస్టు మంత్రా?
అఖిలేశ్‌యాదవ్‌ను ప్రశ్నించిన యూపీ గవర్నర్ లక్నో: ‘అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్లో ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ ఆదివారం ఘాటు లేఖ రాశారు. ‘ఒక రేప్ కేసులో మంత్రి తప్పించుకు తిరుగుతుండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన పాస్‌పోర్టును నాలుగు వారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఇది తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఇంకా కేబినెట్లో కొనసాగించడం వల్ల రాజ్యాంగ నైతికత, గౌరవానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎంను వివరణ కోరారు. ‘లొంగిపోవాలని సీఎం స్వయంగా చెప్పినా, ప్రజాపతి ఆ పని చేయకుండా పరారీలో ఉన్నారు. విదేశాలకు తప్పించుకుని పోయే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే అరెస్ట్: షా తాము యూపీలో అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అతణ్ని నరకంలో ఉన్నా పట్టితెచ్చి జైలుకు పంపుతామన్నారు. ప్రజాపతి గత నెల 27న పోలింగ్ కేంద్రానికొచ్చి ఓటేశారని, అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. -
గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్
లక్నో: తన పై విజయం సాధించడానికి నటుడు గోవిందా అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నాడని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ పేర్కొన్నారు. 1999 నుంచి 2004 వరకు రామ్ నాయక్ కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ముంబై లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ్ నాయక్(బీజేపీ)పై పోటీ చేసి గోవిందా(కాంగ్రెస్) 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించడానికి గోవిందా అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బిల్డర్ హితేన్ థాకూర్ల సహాయం తీసుకున్నాడని తాను రాసిన ఓ పుస్తకంలో వెల్లడించారు. తాను ఇటీవల మరాఠీలో రాసిన స్వీయ చరిత్ర చైర్వేతీ, చైర్వేతీ(ముందుకు సాగూ) ఏప్రిల్ 25న ఆవిష్కరించారు. మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన తాను ముంబై అభివృద్ధికి ఎంతగానో కృషిచేశానని తెలిపారు. అయినా స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. తన ఓటమికి కారణాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గోవిందాకు దావుద్, థాకూర్ మంచి స్నేహితులు అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందడానికి వారి సహాయం తీసుకున్నాడని రామ్ నాయక్ ఆరోపించారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న రామ్ నాయక్ ఇలాంటి ఆరోపణలు చేస్తారని తాను ఊహించలేదని గోవిందా అన్నారు.'నన్పు నమ్మి నాకు విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల్లో విజయానికి నేనెవరి సహాయం తీసుకోలేదు' అని తన పై వచ్చిన ఆరోపణలపై గోవిందా వివరణ ఇచ్చుకున్నారు. అండర్ వరల్డ్‌కు అమ్ముడుపోయే వారిలా నియోజక వర్గ ప్రజలు కనిపిస్తున్నారా అని రామ్ నాయక్ పై మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలతో ప్రజలను అవమానపరచకండి అన్నారు. -
యూపీ గవర్నర్‌కు అస్వస్థత
లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆదివారం ఆయన చికిత్స నిమిత్తం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుషన్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు రామ్ నాయక్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ కేబినెట్ లో రామ్ నాయక్ పెట్రోలియం-సహజ వాయువులు మంత్రిగా పనిచేశారు. 1994వ సంవత్సరంలో కేన్సర్ బారిన పడ్డ ఆయన క్రీయశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
యూపీ గవర్నర్ రామ్ నాయక్‌కు అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌కు రాజస్థాన్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళవారం నాటికి రాజస్థాన్ గవర్నర్ మార్గరెట్ అల్వా పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో గోవా గవర్నర్ బీ వీ వాంఛూ రాజీనామా చేయడంతో అల్వాకు ఆ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. అయితే అల్వా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లికి గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి భవన్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
యూపీ గవర్నర్ గా రామ్ నాయక్ ప్రమాణ స్వీకారం
లక్నో: ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా మాజీ కేంద్ర మంత్రి రామ్ నాయక్(80) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధనంజయ వై చంద్రచూద్ రాజ్ భవన్ వద్ద నాయక్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందలు తెలియజేశారు. అంతకుముందు ఇక్కడ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బీఎల్ జోషి గతనెల్లో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండే జోషి.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజీనామా చేయక తప్పలేదు. యూపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రామ్ నాయక్ కు గత ఎన్డీఏ పాలనలో పెట్రోలియం-సహజ వాయువులు మంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు చేసిన ఘనత ఉంది. 1994వ సంవత్సరంలో కేన్సర్ బారిన పడ్డ రామ్ నాయక్ రాజకీయాలకు దూరమైయ్యారు. ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని 2013 లో ప్రకటించారు. -
బీజేపీ నేతలకు గవర్నర్ గిరి
రామ్ నాయక్, వీకే మల్హోత్రా సహా ఐదుగురి పేర్లు ఖరారు త్వరలో రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల గవర్నర్ పదవుల భర్తీ కోసం ఐదుగురు బీజేపీ సీనియర్ నేతల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. వీరిలో పెట్రోలియం మాజీ మంత్రి రామ్ నాయక్, యూపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కేసరీనాథ్ త్రిపాఠి, ఢిల్లీ బీజేపీ నేత వీకే మల్హోత్రా, భోపాల్ మాజీ ఎంపీ కైలాస్ జోషి, బలరాం దాస్ టాండన్(పంజాబ్) ఉన్నారు. ప్రభుత్వం వీరి పేర్లను సిఫార్సు చేసిందని, వీరిని పదవుల్లో నియమిస్తూ రాష్ట్రపతి భవన్ త్వరలో నోటిఫికేషన్ ఇస్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల కింద చర్చించి పేర్లు ఖరారు చేశారన్నాయి. యూపీ గవర్నర్‌గా ఉండాలని పార్టీ వర్గాలు తనను కోరగా, అందుకు అంగీకరించానని రామ్ నాయక్ ఆదివారం ముంబైలో చెప్పారు. మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ పేరు కూడా గవర్నర్ పదవికి పరిశీలనలో ఉందని తెలుస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లను పదవులను నుంచి తప్పుకోవాలని మోడీ ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఐదుగురు గవర్నర్లు.. బీఎల్ జోషి(యూపీ), ఎంకే నారాయణన్(పశ్చిమ బెంగాల్), బీవీ వాంచూ(గోవా), శేఖర్‌దత్(ఛత్తీస్‌గఢ్), అశ్వనీకుమార్(నాగాలాండ్) రాజీనామా చేయడం తెలిసిందే. మరో ఇద్దరు గవర్నర్లు హెచ్ఆర్ భరద్వాజ్(కర్ణాటక), దేవానంద్ కన్వర్(త్రిపుర) తమ పదవీకాలం ముగియడంతో గత నెలాఖర్లో రాజీనామా చేశారు. అయితే యూపీఏ హయాంలో గవర్నర్లుగా నియమితులైన షీలా దీక్షిత్(కేరళ), శంకరనారాయణన్(మహారాష్ట్ర) జగన్నాథ్ పహాడియా(హార్యానా) తదితరులు మాత్రం ఎన్డీఏ సర్కారు ఒత్తిడిని పట్టించుకోకుండా పదవుల్లో కొనసాగుతున్నారు. షీలా, శంకరనారాయణన్లను ఈశాన్యరాష్ట్రాలకు బదిలీ చేసే అవకాశముందని సమాచారం.