కేబినెట్‌లో రేపిస్టు మంత్రా?
అఖిలేశ్‌యాదవ్‌ను ప్రశ్నించిన యూపీ గవర్నర్
లక్నో: ‘అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతి ఇంకా మీ కేబినెట్‌లో ఎందుకు?’ అని ప్రశ్నిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ ఆదివారం ఘాటు లేఖ రాశారు. ‘ఒక రేప్ కేసులో మంత్రి తప్పించుకు తిరుగుతుండడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఆయన పాస్‌పోర్టును నాలుగు వారాలపాటు సీజ్ చేయడంతోపాటు లుకౌట్ నోటీసులు కూడా అంటించారు. ఇది తీవ్రమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను ఇంకా కేబినెట్‌లో కొనసాగించడం వల్ల రాజ్యాంగ నైతికత, గౌరవానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని మీరు సమర్థించుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై సీఎంను వివరణ కోరారు. ‘లొంగిపోవాలని సీఎం స్వయంగా చెప్పినా, ప్రజాపతి ఆ పని చేయకుండా పరారీలో ఉన్నారు. విదేశాలకు తప్పించుకుని పోయే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
అధికారంలోకి రాగానే అరెస్ట్: షా
తాము యూపీలో అధికారంలోకి రాగానే మొదట చేసే పనుల్లో ప్రజాపతి అరెస్ట్ ఒకటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన ఎన్నికల సభలో చెప్పారు. అతణ్ని నరకంలో ఉన్నా పట్టితెచ్చి జైలుకు పంపుతామన్నారు. ప్రజాపతి గత నెల 27న పోలింగ్ కేంద్రానికొచ్చి ఓటేశారని, అయినా పోలీసులు ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు.