పరారీలోనే మంత్రి, అనుచరుడి లొంగుబాటు
లక్నో: పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి ప్రధాన అనుచరుడు, హెడ్ కానిస్టేబుల్ చంద్రపాల్ సోమవారం లక్నో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గ్యాంగ్ రేప్ తో పాటు తల్లీకూతుళ్లపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కేసులో గాయత్రీ ప్రజాపతి ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రజాపతి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు.
కాగా అజ్ఞాతంలో ఉన్న మంత్రితోపాటు మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఆయన పాస్‌పోర్టుపై నాలుగు వారాలపాటు నిషేధం విధించి లుక్ ఔట్ నోటీసులు కూడా ఇచ్చింది. కాగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె మైనర్ కుమార్తెపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ప్రజాపతి, మరో ఆరుగురిపై యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత నిరాకరించడంతో బాధిత మహిళ సుప్రీంను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల దాడి గుప్పిస్తోంది.