ఆరు నెలల్లో కటకటాల్లోకి...
అధికారంలోకి వస్తే అసాంఘిక శక్తుల్ని అణచివేస్తాం
► అధికారంతో అఖిలేశ్ కళ్లు మూసుకుపోయాయి..
► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
లఖింపూర్ ఖేరి: కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అఖిలేశ్ చూడలేకపోతున్నారని, అధికారంతో ఆయన కళ్లు మూసుకుపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి అధికారమిస్తే ఆరు నెలల్లో అసాంఘిక శక్తుల్ని అణచివేస్తామని హామీనిచ్చారు. యూపీలోని లఖింపూర్ ఖేరిలో సోమవారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ... గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో అఖిలేశ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ ‘మన్ కీ బాత్’ను పరోక్షంగా విమర్శిస్తూ... ‘కామ్ కీ బాత్’ (ఉపయోపడే అంశం) గురించి మోదీ ఎప్పుడు మాట్లాడతారని అఖిలేశ్ ప్రశ్నించడాన్ని ప్రధాని తిప్పికొట్టారు. ‘ఆయన (అఖిలేశ్) అధికార గర్వంతో కళ్లు మూసుకుపోయి కేంద్రం చేసిన అభివృద్ధిని చూడలేకపోతున్నారు’ అని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దయనీయ స్థితిలో ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని, జైళ్ల నుంచే గ్యాంగ్‌లు కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ‘కిడ్నాపులు, అల్లర్లు కూడా ఎక్కువయ్యాయి. ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి?’ అని ప్రశ్నించారు.
పొత్తుతో పాపాలు కడుక్కోలేరు..
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశమివ్వాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మాకొక అవకాశమివ్వండి... కత్తులు, పిస్తోలు వాడేవారిని ఆరు నెలల్లో కటకటాల్లోకి నెడతాం. చెరకు రైతుల బకాయిలు 14 రోజుల్లోగా చెల్లిస్తాం’ అని హామీనిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చేసిన పాపాల్ని ఎస్పీ ప్రభుత్వం కడిగేసుకోలేదన్న విషయం మొదట దశ ఎన్నికల సరళిని బట్టి చూస్తే స్పష్టమైందన్నారు. బీఎస్పీ హయాంలో కుంభకోణాలపై విచారణ జరుపుతామన్న అఖిలేశ్ హామీలు ఏమయ్యాయని మోదీ ప్రశ్నించారు.
మెట్రోపై తప్పుదారి పట్టిస్తున్నారు..
సోషలిస్టు నేతలు రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌లు జీవితాంతం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారని, ఇప్పుడు ఆ పార్టీతో జతకలసి వారిని అవమానించారని మోదీ పేర్కొన్నారు. లక్నో మెట్రో ప్రాజెక్టుపై అఖిలేశ్ ప్రచారాన్ని విమర్శిస్తూ...‘మెట్రో స్టేషన్ ఇంకా నిర్మాణంలో ఉండగా ఏ రైలైనా నడుస్తోందా? ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించడమే’నని చెప్పారు.
వారి తీరుతో విసిగిపోయారు: అమిత్ షా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీఎం అఖిలేశ్‌ల తీరుతో యూపీ ప్రజలు విసిగిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. సంభాల్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ‘ఒకరితో అతని తల్లి నిరాశచెందితే... మరొకరు తండ్రిని ఇబ్బందిపెట్టారు’ అని వ్యంగ్యంగా పేర్కొన్నారు.
రేడియో అద్భుత సాధనం: మోదీ
న్యూఢిల్లీ: సమాజంతో సంభాషించేందుకు, నేర్చుకునేందుకు, సంబంధాలు కొనసాగించేందుకు రేడియో ఓ అద్భుతమైన సాధనమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. ‘రేడియో ప్రేమికులకు శుభాకాంక్షలు. ఈ రంగంలో పనిచేసేవారు రేడియోను పునరుజ్జీవింపచేసేందుకు మరింత గొప్పగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించాలి. సమాజంతో అనుసంధానమయ్యేందుకు రేడియో గొప్ప సాధనం. మన్ కీ బాత్ కార్యక్రమంలో రేడియో ద్వారానే భారతీయులకు దగ్గరవుతున్నాను’ అని రెండు వేర్వేరు ట్వీట్లలో మోదీ తెలిపారు.